జాగిలంతో గాలింపు( పాత చిత్రం)
గుడివాడ : గుడివాడ రాజేంద్రనగర్‌లో దంపతుల హత్య కేసులో నిందితులు పోలీసులకు చిక్కినట్లు సమాచారం. నలుగురు నిందితులతో పాటు వాళ్లు దొంగిలించిన కారును తమిళనాడు రాష్ట్రంలోని వేలేరు సమీపంలో పట్టుకున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. శుక్రవారం రాత్రి జరిగిన బొప్పన సాయిచౌదరి దంపతుల హత్య కేసును పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. కేసును ఛేదించేందుకు అన్ని రకాల మార్గాలలో విచారణ ప్రారంభించారు. హత్య జరిగిన చోట వేలిముద్రలు దొరికిపోవటంతో పాటు ప్రధాన రహదారిలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజి ఆధారంగా వాళ్లు వెళ్లిన మార్గాన్ని గుర్తించి పట్టుకున్నట్లు తెలుస్తోంది.
బృందాలుగా ఏర్పడిన పోలీసులు..
హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై సమీక్షించేందుకు డీజీపీ మాలకొండయ్య, జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి గుడివాడ పోలీసులతో రాజేంద్రనగర్‌లోని అగ్రోస్ భవనంలో శనివారం రాత్రి సమావేశం అయ్యారని తెలిసింది. నిందితులను పట్టుకునేందుకు ఏఏ బృందాలు ఎలా వెళ్లాలి అనే అంశాలపై సమీక్షించినట్లు సమాచారం. గుడివాడ డీఎస్పీ ఆధ్వర్యంలో తమిళనాడు వెళ్లిన పోలీసు బృందానికి నిందితులు చిక్కినట్లు తెలుస్తోంది.
పాత నేరస్తులేనా?..
దంపతుల హత్య ఘటనలో పాల్గొన్న వారిలో గుడివాడకు చెందిన మాజీ రౌడీషీటర్ గిన్నెల సురేష్ ఉన్నట్లు సమాచారం. ఇతను కొంతకాలంగా గుంటూరులో ఉంటున్నాడని తెలిసింది. తమిళనాడులో పోలీసులకు చిక్కిన వారిలో గుడివాడకు చెందిన వారితోపాటు అతను కూడా ఉన్నట్లు వినికిడి.
వేలిముద్రలు, సీసీ కెమెరా ఫుటేజీలే పట్టించాయా?..
హత్య జరిగిన చోట నిందితుల వేలిముద్రలు క్లూస్ టీం నిపుణులు కనుగొన్నారు. దీనికి తోడు గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజిలు నిందితులను పట్టుకోవటంలో సహకరించినట్లు తెలుస్తోంది. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున మరో నాలుగు రోజుల్లో కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాల నుంచి వినికిడి. అయితే హత్య ఎందుకు చేశారనే అంశాలు ఇంకా వెలుగు చూడలేదు. ఆర్థికపరమైన లావాదేవీలే కారణమని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment