
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీనివాసరావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గురువారం మధ్యాహ్నం విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్కడ రెస్టారెంట్‌లోని వెయిటర్ శ్రీనివాసరావు జగన్‌పై హత్యాయత్నం చేయడం తెలిసిందే. నిందితుడిని ఎయిర్‌పోర్టు సీఐఎస్‌ఎఫ్ అధికారులు గురువారం సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్టు శాంతి భద్రతల పోలీసులకు అప్పగించారు. గురువారం రాత్రి నుంచి శ్రీనివాసరావును ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచి విచారిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్హా స్వయంగా విచారించారు. కేసులో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా న్యాయ నిపుణులు, ఫోరెన్సిక్ నిపుణులతో చర్చించారు.
అనంతరం పోలీసులు విమానాశ్రయానికి తరలించారు. అక్కడ సీఐఎస్‌ఎఫ్ అధికారుల వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం విశాఖ కింగ్ జార్జి ఆస్పత్రి (కేజీహెచ్)కి తరలించారు. అనంతరం రాత్రి మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఇన్‌చార్జి జడ్జి, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి రమ్య నివాసంలో నిందితుడిని హాజరుపరచగా.. నిందితుడికి వచ్చే నెల 9వ తేదీ వరకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు. నిందితుడు శ్రీనివాస్ గ్రామమైన ఠానేలంక నుంచి ఇద్దరు స్నేహితులను సిట్ బృందం అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం విశాఖపట్నం తీసుకువెళ్లారు. ఇందులో ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు.