శ్రీనివాసరావుకు ఏదైనా జరిగితే టీడీపీ సర్కారుదే బాధ్యత.. | YSR Congress Leaders comments on TDP Govt | Sakshi
Sakshi News home page

శ్రీనివాసరావుకు ఏదైనా జరిగితే టీడీపీ సర్కారుదే బాధ్యత..

Published Wed, Oct 31 2018 4:38 AM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM

YSR Congress Leaders comments on TDP Govt - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం ఘటనకు సంబంధించిన సాక్ష్యాలను సమాధి చేసేందుకు టీడీపీ ప్రభుత్వం మరో కుట్ర చేస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు ఆరోపించారు. ఈ ఘటనలో ప్రధాన పాత్రధారి, సాక్షి అయినా నిందితుడు శ్రీనివాసరావును రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేస్తుందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. శ్రీనివాసరావుకు ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. పార్టీ నేతలు మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 

కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలి 
‘‘తనకు ప్రాణహాని ఉందని నిందితుడు శ్రీనివాసరావు చెబుతున్నాడు. ప్రజలతో, మీడియాతో మాట్లాడాలని అంటున్నాడు. శ్రీనివాసరావే ఈ హత్యాయత్నంలో పాత్రధారుడు, సాక్షి కాబట్టి ఆతడికి ఏదైనా జరగొచ్చు అని మేం మొదటినుంచీ చెబుతున్నాం. అతడికి పోలీసులు రక్షణ కల్పించాలని కోరాం. జగన్‌పై హత్యాయత్నం ఘటనలో సాక్ష్యాలను సమాధి చేసే కుట్ర జరుగుతోంది. అందుకే నిష్పక్షపాతంగా థర్డ్‌పార్టీ విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకొని విచారణ జరపాలి. ఆలోగా శ్రీనివాసరావుకు ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. నిందితుడితో ముఖ్యమంత్రికి, మంత్రి లోకేశ్‌కు, టీడీపీ నేతలకు సంబంధం ఉంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలే అందుకు నిదర్శనం.

అతడి ప్రాణానికి హాని కలిగించి రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు. నిందితుడికి గుండె నొప్పి అంటూ లీకులిస్తున్నారు. కానీ, ఎలాంటి సమస్య లేదని వైద్యులు చెబుతున్నారు. ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో తెలియడం లేదు. జగన్‌పై హత్యాయత్నం కుట్రలో ఉన్నవారు బయటకు రావాలంటే నిందితుడు బతికే ఉండాలి. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రిని మళ్లీ కలిసి ఫిర్యాదు చేస్తాం. చంద్రబాబు హత్యా రాజకీయాలు ఇక సాగవు’’ అని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ‘‘నిందితుడు బతికి ఉంటేనే నిజాలు బయటకొస్తాయి. అతడి ప్రాణానికి హాని కలిగిస్తే నిజాలు బయటకు రావు. ఏపీలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి. నిందితుడు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాడు కాబట్టి ఆతడిని ఏమైనా చేస్తారేమో అన్న భయం కలుగుతోంది. ఈ విషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలి’’ అని తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సమావేశంలో.. మండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, బాలాశౌరి పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement