
విజయ్ సాయి మృతదేహం వద్ద విలపిస్తున్న వనిత
సాక్షి, హైదరాబాద్: తన భర్త మృతిపై అనుమానాలున్నాయని సినీ నటుడు విజయ్ సాయి భార్య వనిత అన్నారు. ఆస్తి తగాదాలే అతడి మరణానికి కారణమైవుండొచ్చని ఓ వార్తా చానల్‌తో చెప్పారు. తండ్రితో విజయ్‌కు ఆస్తి తగాదాలున్నాయన్నారు. తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు. విజయ్‌ను తాను బెదిరించినట్టు వచ్చిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. తాను ఎవరితోనూ కలిసి తన భర్తను బెదిరించలేదని చెప్పారు. విజయ్ వేధింపులు తట్టుకోలేక తానే చనిపోవాలనుకున్నానని వెల్లడించారు. ఓ అమ్మాయితో అతడికి వివాహేతర సంబంధం ఉందని, రెండేళ్ల క్రితం ఆమెను వివాహం చేసుకున్నాడని తెలిపారు. ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా వదిలేశాడని వెల్లడించారు.
అక్రమ సంబంధాల గురించి ప్రశ్నించినందుకే నడిరోడ్డుపై తనను కొట్టాడని వాపోయారు. పిల్లలు వద్దంటూ చిత్రహింసలు పెట్టాడని, మూడుసార్లు తనకు అబార్షన్ చేయించాడని ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ అంటే తనకు ప్రాణమని, అతడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు చెప్పారు. శశిధర్‌తో తనకు అక్రమసంబంధం అంటగట్టడం దారుణమని వనిత అన్నారు. కాగా, ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో తన భర్త మృతదేహాన్ని చూసి ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.
వనిత దొంగ: విజయ్ తండ్రి
తమ ఇంట్లో వనిత బంగారం దొంగతనం చేసిందని, చాలా వస్తువులు మాయం చేసిందని ఆమె మామ కెవి సుబ్బారావు ఆరోపించారు. కోడల్ని కూతురిలా చూసుకున్నామని, చనిపోయిన తన కొడుకుపై లేనిపోని అభాండాలు వేయడం భావ్యం కాదన్నారు. తాము గౌరవంగా బతుకుతున్నామన్నారు. రేపు పోస్ట్‌మార్టం పూర్తి చేసిన తర్వాత విజయ్ సాయి భౌతికకాయానికి అంత్యక్రియలు హైదరాబాద్‌లోనే నిర్వహిస్తామని తెలిపారు.
పూర్తి వివరాలు సేకరిస్తున్నాం: డీసీపీ
విజయ్ సాయి ఆత్మహత్య కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ వెంకటేశ్ తెలిపారు. ఆత్మహత్యకు ముందు తన సెల్‌ఫోన్‌లో విజయ్ సెల్ఫీ వీడియో రికార్డు చేసినట్టు చెప్పారు. తన మరణానికి భార్య వనిత, శశిధర్, న్యాయవాది శ్రీనివాస్ కారణమని వీడియోలో అతడు పేర్కొన్నాడని వెల్లడించారు. ఈ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నట్టు చెప్పారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు. కాగా, వనిత, శశిధర్, న్యాయవాది శ్రీనివాస్‌లపై ఐపీసీ సెక్షన్ 306 కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment