
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు విజయసాయి ఆత్మహత్యకు తాను కారణం కాదని అతడి భార్య వనిత స్పష్టం చేశారు. మూడేళ్లుగా విడిపోయి ఉంటున్నప్పుడు అతడి మరణానికి తాను ఎలా కారణమవుతానని ప్రశ్నించారు. గురువారం ‘సాక్షి’ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టే అతడిపై సానుభూతి చూపిస్తూ తనను నేరస్తురాలిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. అత్తింటి నుంచి ఎలాంటి ఆస్తులు తీసుకోలేదని, సాక్ష్యాలు సేకరించడం కోసమే తాను పోలీసులకు లొంగిపోలేదని వివరించారు.
జీవితాంతం సంతోషంగా ఉండాలని విజయ్, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పెళ్లైన తర్వాత అతడి ప్రవర్తన నచ్చక విడాకులకు దరఖాస్తు చేశాను. పాప తీసుకుని మా ఇంటికి వచ్చేసాను. మూడేళ్లుగా అతడికి దూరంగా ఉంటున్నాను. అతడితో పర్సనల్‌గా మాట్లాడలేదు. మా మామగారు మొదట్లో నాతో మంచిగా ఉండేవారు. తర్వాత ఎందుకో మారిపోయారు. విజయ్ అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయం అతడి ఫ్రెండ్స్ కూడా తెలుసు. అతడు చనిపోయాడన్న సానుభూతితో వారు నోరు విప్పడం లేదు. విజయ్ ప్రవర్తనకు సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇంకా సేకరించే పనిలో ఉన్నాను.
పాప చూపించకుండా విజయ్‌ను మానసిక క్షోభకు గురిచేశానడటం వాస్తవం కాదు. నిజనిజాలు తెలుసుకోకుండా నాపై నిందలు వేయడం కరెక్ట్ కాదు. అతడి కేరెక్టర్ ఏంటో తెలుసుకోండి. పాప ఎదురుగానే నన్ను అసభ్య పదజాలంతో తిట్టేవాడు. సైకోలా ప్రవర్తించేవాడు. రెండుసార్లు నాపై దాడి చేశాడు. దీనిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాను. విజయ్ ఆత్మహత్య చేసుకోవడంతో అతడిపై సానుభూతి చూపిస్తూ అందరూ నాపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆధారాలన్నీ సేకరించిన తర్వాత పోలీసులకు లొంగిపోతాన’ని వనిత చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment