ఎముకల నుంచి నూనె తయారీ
సాక్షి, హైదరాబాద్: యూరియాతో పాలు.. ఇనుప రజను పౌడర్‌తో టీ పొడి.. ఇటుక పొడితో కారం... బట్టల సోడాతో చక్కెర.. పసుపు పచ్చ మోటానిల్‌తో పసుపు పౌడర్... జంతువుల కొవ్వుతో వంట నూనె.. నగరంలో ఇలా ప్రతి వస్తువూ కల్తీమయంగా మారింది. ఏ వస్తువు తింటే ఏ రోగమొస్తుందోనని జనం అల్లాడే పరిస్థితి దాపురించింది. నగర శివారు ప్రాంతాలు అడ్డాగా కోట్ల రూపాయల కల్తీ సరుకు తయారు చేసి నగర మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి తీవ్ర స్థాయిలో హాని కల్గిస్తుందన్న విషయం తెలిసినా కూడా కేవలం ధనార్జనే ధ్యేయంగా కల్తీ దందా జోరుగా కొనసాగుతోంది. భారీ స్థాయిలో ఎతైన గోడలతో గోదాములు నిర్మించి, సెక్యూరిటీ గార్డులను నియమించి లోపలికి ఎవరికీ ప్రవేశం లేకుండా నగర శివారు ప్రాంతాల్లో కల్తీ కర్మాగారాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి.
ఉదయం లేవగానే తాగే కాఫీ లేదా చాయ్ పౌడర్‌లో చెక్కపొట్టు.. లేదంటే ఇనుప రజను ఉండి ఉంటుందంటే మీకు ఆశ్చర్యంగా కలగవచ్చు! చాయ్ లేదా కాఫీ తయారుచేయడానికి మీరు వాడే పాలలో పంటపొలాలకు వేసే యూరియా ఆనవాళ్లు ఉంటాయంటే మీరు భయకలగ వచ్చు...ఇడ్లీ లేదా దోశ లేదా ఉప్మా లేదా.. చపాతీలు వేసుకునే గోధుమపిండిలో మీరు తినకూడని, మీ కడుపులోకి ప్రవేశించకూడని పదార్థాలు యథేచ్ఛగా కలసిపోతున్నాయన్న వాస్తవం మీరు జీర్ణించుకోలేక పోవచ్చు. కానీ ఇవన్నీ వాస్తవాలు. జీర్ణించుకోలేని సత్యాలు! బ్రాండ్ ఎదో...లోకల్ మేడ్ ఎదో...ఏది స్వచ్ఛమో.. ఏది నకిలీయో..అంతా మాయాబజార్.
ఆహార పదార్థాలే ఎక్కువ
చిన్న పిల్లలకు తాగించే పాల నుంచి మొదలుకొని బియ్యం, నునె, కారం, ఉప్పు, పప్పు, నెయ్యి, మసాలాలతో సహా ప్రతి వస్తువు కల్తీ చేస్తున్నారు. బ్రాండెడ్ వస్తువులు సైతం కల్తీకి గురవుతున్నాయి. అసలుకు ఏ మాత్రం తేడా లేకుండా నకలీ వస్తువుల్ని తయారు చేస్తున్నారు.
నగర శివారు నుంచే..
గతంలో నిత్యావసర వస్తువులన్నీ గ్రామాల నుంచి నగరానికి ఎగుమతి అయ్యేవి. కల్తీగాళ్ల పుణ్యమాని ఇప్పుడు ప్రతి వస్తువు పట్టణాల్లోనే తయారు చేసి గ్రామాలకు చేరుస్తున్నారు. రాచకొండ, సైబరాబాద్, ప్రాంతాల్లోని శివారు ప్రాంతాలను కల్తీగాళ్లు తమ అడ్డాలుగా మార్చుకున్నారు. రాచకొండ పరిధిలోని పహాడీషరీఫ్, జల్‌పల్లి, షాహీన్‌నగర్, బాలాపూర్ శివారు, శ్రీరాంనగర్ కాలనీ, మీర్‌పేట్, నాదర్‌గుల్, బడంగ్‌పేట్, కందుకూరు, మామిడిపల్లి, హయాత్ నగర్, పెద్ద అంబర్‌పేట్, అదిభట్ల, ఘట్‌కేసర్, కీసర, మేడిపల్లి మేడ్చల్ తదితర ప్రాంతాలతో పాటు సైబరాబాద్ పరిధిలోని బాలానగర్, శంషాబాద్, కాటేదాన్, రాజేంద్రనగర్, జీడిమెట్ల, మైలార్‌దేవ్‌పల్లి, పటాన్ చెరు తదితర ప్రాంతాలను కల్తీగాళ్లు అడ్డాగా మార్చుకున్నారు. రూ.50కి అమ్మే పదార్థం పది రూపాయలకే తయారవుతుంది. ఏకంగా రూ.40 లాభం పొందుతున్నారు. ఇంకాస్త లాభం ఎక్కువ రావాలంటే ప్యాకింగ్ మార్చేసి..బ్రాండ్ అలంకారం చేసి లారీల్లో గ్రామాలకు, బస్తీలు, కాలనీల్లోని చిన్నాచితక కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నారు.
కొందరు వ్యాపారులు కల్తీ మాఫియాతో సంబంధాలు ఏర్పరుచుకొని వినియోగదారులకు బ్రాండెడ్ వస్తువుల స్థానంలో నకిలీ వస్తువులను అంటగడుతున్నారు. ఈ కల్తీ వస్తువులు మార్కెట్లో తక్కువ ధరకు లభించడంతో వాటిని కొనుగోలు చేసిన ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. అయినా సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకున్న సందర్భాలు చాలా తక్కువే. కల్తీకి గురవుతున్న కొన్ని వస్తువులు ఇలా....
కారం ఇలా కల్తీ
ఫ్రీజర్ గోదాముల నుంచి బూజు పట్టిన మిరపకాయలు కోనుగోలు చేస్తారు. వాటిని మర పట్టించి చెక్కపొడి, నూనె, కొన్ని రకాల రసాయానాలు కలిపి కారాన్ని తయారు చేస్తున్నారు. మార్కెట్లో ఏ బ్రాండెడ్ కారం పొడికి డిమాండ్ ఉంటుందో ఆ బ్రాండ్ కవర్లు తయారు చేయించి అందులో ఆ కారం వేసి ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వారు దాన్ని అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.
యూరియాతో పాలు...
యూరియా, నూనె, క్రిమిసంహారక మందులతో పాటు క్యాస్టిక్ సోడా, అమ్మోనియం వంటి రసాయనాలతో కల్తీ పాలను తయారు చేస్తున్నారు. శివారు ప్రాంతాలలోని పలు ఇళ్లలో కల్తీ పాలు తయారు చేసే యూనిట్‌లపై ఇటీవల ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు.
రేషన్ బియ్యానికి పాలిష్...
రేషన్ బియ్యాన్ని మిల్లర్లు తక్కువ ధరకు కొనుగోలు చేసి మిల్లుల్లో పాలిషింగ్ చేయించి సన్నబియ్యంగా మారుస్తున్నారు. ప్రజలకు సన్న బియ్యం అని ఎక్కువ ధరకు అంటగడుతున్నారు.
నూనె..నెయ్యి కల్తీ ఇలా...
జంతు కళేబరాలతో, వ్యర్థాలను ఉపయోగించి నూనె తయారు చేస్తున్నారు. కళేబరాలను, జంతువుల వ్యర్థాలను మరిగించి వాటి ద్వారా వచ్చే కొవ్వులతో పలు రకాల రసాయనాలు కలిపి నూనె, నెయ్యిని తయారు చేస్తున్నట్లు ఇటీవల పోలీసులు నిర్వహించిన దాడుల్లో తేలింది.
ఏది అసలు..ఏది నకిలీ?
కల్తీ దందా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో జోరుగా సాగుతున్నది. అక్రమార్కులు ఏదో ఒక ఫుడ్స్ పేరుతో ఒక చోట కంపెనీ నెలకొల్పడం.. కుటీర పరిశ్రమ కింద రిజిస్టర్ చేయించుకోవడం.. ఇకపై దందా షురూ! ఓ భారీ షెడ్.. లోపల జరిగే బాగోతం బయటకు కనిపించకుండా చుట్టూ కోటను తలపించే ఎత్తయిన గోడలు.. ఎవరైనా తనిఖీ కోసం వస్తే వారిని మేనేజ్ చేసుకోవడం...ఇలా కల్తీ వ్యాపారం జోరుగా కొనసాగుతుంది..
పోలీసు నిఘా పెరిగినా..
కల్తీని నిర్మూలించడానికి వాస్తవంగా ఫుడ్స్, పీసీబీ, జీహెచ్‌ఎంసీ, పరిశ్రమల శాఖల అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కానీ ఆ పనిని ప్రస్తుతం ఒక్క పోలీసులే చేస్తున్నట్లు అభిప్రాయాలు ఉన్నాయి. తాజాగా కల్తీ అడ్డాలపై పోలీసులు ఉక్కుపాదంతో అణచి వేస్తున్నారు. పోలీసులు దాడులు పెరుగడంతో కొందరు కల్తీదారులు పక్క జిల్లాలు, పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారు. పోలీసులు సోదాలు చేసి.. కల్తీల బండారం బయటపెడుతున్నప్పటికీ.. ఎన్ని కేసుల్లో శిక్షలు పడ్డాయన్నది మాత్రం సందేహమే.
రాచకొండ పరిధిలోనే ఎక్కువ
రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే కల్తీ కార్ఖానాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చిన్న పిల్లలు తినే చాక్లెట్లు, కుర్‌కురే నుంచి మొదలుకొని నిత్యం వాడే వస్తువులు..నూనె, మసాలాలు, అల్లం వెల్లుల్లి, టీ పొడి, పాల పౌడర్ వరకు అన్ని కల్తీల కార్ఖానాలు ఇక్కడే ఉన్నాయి. రాచకొండ ఎస్‌వోటీ అధికారులు గత కొన్ని నెలల్లో 100 కార్ఖానాలపై దాడులు చేశారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.
రోగాల దాడి
ఇది నగరంలో ఒక యువతి వ్యథ. తీవ్ర జ్వరం.. ముఖంపై ఎర్రని మచ్చలు. ఇంట్లో ఏదో అలర్జీ అనుకున్నారు. వేడివల్ల వచ్చాయేమోనని సీరియస్‌గా తీసుకోలేదు. నెల గడిచినా తగ్గలేదు. ఓ కార్పొరేట్ హాస్పిటల్‌కు వెళితే. అక్కడ రక్త పరీక్షలు చేస్తే అసలు సంగతి తేలింది. కల్తీ ఆహారం తినడంవల్ల జీర్ణకోశ సంబంధిత వ్యాధికి గురైనట్టు అక్కడ డాక్టర్లు నిర్థారించారు. నగరంలో ఇలాంటి ఎన్నో కేసులు ఉన్నాయి. రసాయనాలు, విష పదార్థాలతో కల్తీ అవుతున్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్లే జనం ఇలాంటి వ్యాధుల బారినపడుతున్నారు. కాగా కల్తీ నేరానికి ప్రస్తుతం వెయ్యి రూపాయల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తున్నారు. ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ కొత్తగా కల్తీ నేరానికి 10 లక్షల జరిమానా, యావజ్జీవ జైలు శిక్ష విధించాలని ప్రతిపాదించింది.
డబ్బాశతో ఇంజినీరింగ్ విద్యార్థి....
ఇంజినీరింగ్ చదివిన ఓ యువకుడు నగర శివారు ప్రాంతమైన బడంగ్‌పేట్‌లో తన తేలితెటలతో కల్తీ నూనె, నెయ్యి తయారు చేసి జోరుగా విక్రయాలు చేశాడు. కల్తీ కోసం ప్రత్యేకంగా ఓ షెడ్‌తో పాటు మిషనరీ ఏర్పాటు చేసి ప్లాంట్ నెలకొల్పాడు. తయారు చేసిన కల్తీ నూనె, నెయ్యిని బ్రాండెడ్ స్టికర్లతో ప్యాకింగ్ చేసి నగరంతో పాటు శివారు జిల్లాలకు సరఫరా చేశాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి 250 కిలోల కల్తీ నెయ్యి , 50 కిలోల డాల్డా, 2 వేల లీటర్ల నకలీ పామాయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment