కాదేది కల్తీకి అనర్హం. సంక్రాంతి పండుగ కొనుగోళ్లను ఆసరా చేసుకొని కొందరు కల్తీనూనె అమ్మడానికి తెగబడుతున్నారు. రూ. కోట్లు దండుకుని తాము మాత్రం ‘పండుగ‘ చేసుకోవాలను కుంటున్నారు. ఇటువంటి వాటిని నివారించాల్సిన ఆహార నియంత్రణ అధికారులు తమకేమీ పట్టనట్లు ఉండటంతో నూనె వ్యాపారులు బరితెగిస్తున్నారు. కల్తీ నూనెను గుట్టు చప్పుడు కాకుండా ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి
మంచినూనెలో కలిపేస్తున్నారు. ప్రతి నెలా జిల్లాలో దాదాపు రూ. 15 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని వాణిజ్యపన్నుల అధికారులు లెక్కలు చెబుతున్నారు.
సాక్షి ప్రతినిధి, కడప: వేరుశనగ, పామాయిల్, సన్‌ఫ్లవర్, సోయాబిన్ ఇలా రకరకాల నూనెలు ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో బ్రాండెడ్‌వి మినహాయిస్తే అన్ బ్రాండెడ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి లైసెన్సులు పొంది కొందరు వ్యాపారులు మాయాజాలం చేస్తున్నారు. మార్కెట్లో వంటనూనెల తయారీ, విక్రయాల మాటున భారీగా దగా జరుగుతోంది. వంట నూనెల తయారీలో వేరుశనగ తక్కువగా వినియోగించి పామాయిల్, పత్తి విత్తనాలను అధిక మొత్తంలో కలిపి నూనెలు తయారు చేస్తున్నారు. వేరుశనగ విత్తనాలతోనే మొత్తం నూనె తయారు చేసినట్లు చూపి ఆమేరకు ధర నిర్ణయించి ప్రజల నుంచి డబ్బు దండుకుంటున్నారు.
ధర తక్కువతో మక్కువ..
పశు కలేబరాలు, ధాన్యపు వ్యర్థం(తవుడు) నుంచి తీసిన నూనె మార్కెట్ ధర కంటే తక్కువగా లభించడంతో వ్యాపారులు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. మార్కెట్లో మంచి నూనె సుమారుగా కిలో రూ. 70 నుంచి రూ. 120 వరకు ఉంది. అదే కల్తీ నూనె కిలో రూ. 30 నుంచి రూ. 35కే లభించడంతో చిన్నపాటి హోటల్స్, తోపుడు బళ్లు, చిన్న పాటి పాస్ట్‌ఫుడ్ నిర్వాహకులు వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీనిని అదునుగా చేసుకుని కల్తీ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతోంది.
సీమగోల్డుతో వెలుగులోకి
కర్నూలు జిల్లా కేంద్రంగా సీమగోల్డు పేరుతో వంట నూనె తయారవుతోంది. అయితే అందులో 30 శాతమే వేరుశనగ విత్తనాల నూనె ఉందని, మిగిలింది పత్తిగింజల నూనె ఇతరత్రా మిశ్రమాలు ఉన్నాయని అధికారులు తనిఖీల్లో వెల్లడైంది. ఇటీవల గుంటూరు జిల్లా పల్నాడులో సీమగోల్డు వ్యవహారం బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నూనె విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆ జిల్లాలో ఇంతకు ముందు కూడా పశు కళేబరాలతోనూ నూనెలు తయారు చేసి ఇతర జిల్లాలకు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును విజిలెన్స్ అధికారులు రట్టు చేసినా.. మోసగాళ్లు వెనక్కు తగ్గకపోవడం గమనార్హం.
ఇవన్నీ ఉండాల్సిందే...
మార్కెట్లో విక్రయానికి వచ్చిన నూనె ప్యాకింగ్ సంచిపై కేంద్ర ప్రభుత్వం నుంచి లైసెన్సు, రాష్ట్ర వ్యవసాయశాఖ జారీ చేసే అగ్‌మార్క్ ముద్రలు ఉండాలి. ప్రీ ఫ్రం హార్జిమోన్ ఆయిల్(బ్రహ్మదండి గింజలు అసలు కలపలేదని) అని పేర్కొనాలి. ప్యాకింగ్‌పై కచ్చితంగా నూనె తయారీ కోసం వాడిన విశ్రమాల వివరాలు శాతాలతో సహా చూపాలి. అలాగే బ్యాచ్ నంబర్లు, ఎప్పుడు తయారు చేశారు.. ఎప్పటి దాకా విక్రయించవచ్చనే సూచిక ఉండాలి.
జూన్ నుంచి తనిఖీలు లేవు..
గతేడాది మే నెల వరకు జిల్లాలో ఆహార కల్తీ నియంత్రణ విభాగం అధికారులతో తనిఖీలు చేపట్టి నమూనాలు తీశాం. వాటి ప్రయోగ నివేదికలు వివరాలు తెలియాల్సి ఉంది. జిల్లాలో అర్హత ఉన్న తనిఖీ అధికారులు లేకపోవడంతో ఇటీవల కర్నూలు నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్ 8 నమూనాలు సేకరించారు. వాటి నివేదిక వచ్చాకే చర్యలు తీసుకుంటాం.
– విశ్వనాథ్‌రెడ్డి, డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్
Comments
Please login to add a commentAdd a comment