
వెలుగు కార్యాలయంలో బాధితులను విచారిస్తున్న పట్టణ సీఐ సదాశివయ్య
సాక్షి, ఎర్రగుంట్ల(కడప) : పొదుపు సంఘానికి చెందిన బకాయి డబ్బులు చెల్లించాలని అడిగినందుకు డ్వాక్రా సంఘాల సీసీ ఇబ్రహీం, హెడ్‌డీసీసీ రామ్మోహన్‌లపై పొదుపు సంఘం లీడర్ వరలక్ష్మితో పాటు ఆమె బంధువులు దాడి చేసి గాయపరిచారని వెలుగు అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి (ఏపీఎం) అపర్ణ దేవి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఏఎస్‌ఐ శ్రీనివాసులు కథనం మేరకు... మండల పరిధిలోని చిలంకూరు గ్రామంలో సాయిచందన గ్రూపు పొదుపు సంఘం లీడర్ డి. వరలక్ష్మి తన అవసరాల నిమిత్తం రూ.2.70 లక్షలు అప్పుగా తీసుకుంది. ఆ అప్పును చెల్లించకపోవడంతో ఆ గ్రూపులోని సభ్యులందరూ బకాయి డబ్బులు చెల్లించాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారు.
దీంతో చిలంకూరు పొదుపు సంఘాలకు చెందిన కమ్యూనిటీ కో ఆర్డినేటర్ ఇబ్రహీం, హ్యూమన్ డెవలప్‌మెంట్ కమ్యూనిటీ కో ఆర్డినేటర్ రామ్మోహన్‌లు డబ్బులు చెల్లించాలని ఆమెను అడిగారు. ఆగ్రహించిన వరలక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులతో పాటు మరి కొందరు ఎర్రగుంట్లలోని వెలుగు కార్యాలయానికి వచ్చి విధి నిర్వహణలో ఉన్న సీసీ ఇబ్రహీం, హెచ్‌డీసీసీ రామ్మోహన్‌లపై కర్రలు, వాటర్‌పైపు, వైర్లతో దాడి చేసి గాయపరిచారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.