తాళంవేసి ఉన్న నిర్మలాదేవి ఇంటి ముందు పోలీసులు. (ఇన్‌సెట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి)
విద్యార్థుల పోరాటాలు, సంఘసేవకులఆందోళనలు ఎట్టకేలకు ఫలించాయి. కళాశాల విద్యార్థునులను లైంగిక కార్యకలాపాలకుప్రేరేపించిన ఆరోపణలపై కళాశాల అసిస్టెంట్‌ప్రొఫెసర్ నిర్మలాదేవిని సోమవారం రాత్రి
విరుదునగర్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కళాశాలవిద్యార్థినులను లైంగిక చర్యలకు ప్రేరేపించినట్లుగా ఆరోపణలు, చెలరేగిన వివాదం విశ్వరూపందాల్చడంతో ఈ ఘటనపై మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ సంతానం నేతృత్వంలో ఉన్నతస్థాయి విచారణకు రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ ఆదేశించారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై:విద్యా బుద్ధులు నేర్పించాల్సిన మహిళా ప్రొఫెసర్ విద్యార్థినులను లైంగిక కార్యకలాపాలకు ప్రోత్సహించారని మహిళా సంఘాల నేతలు నిప్పులు కక్కుతున్నారు. అటువంటి వారిని ఎన్‌కౌంటర్ చేయాలని మంత్రి వ్యాఖ్యానించారు. ఎట్టకేలకు ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన నేపథ్యం ఇలా ఉంది.
విరుదునగర్ జిల్లా అరుప్పుకోట్టైలోని దేవాంగర్ ఆర్ట్స్ కళాశాలలో మూడువేల మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నారు. ఈ కళాశాలలో అదే ప్రాంతానికి చెందిన నిర్మలాదేవి 15 ఏళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మదురై యూనివర్సిటీకి చెందిన ఉన్నతాధికారులకు ‘సన్నిహితంగా’ మెలగాల్సిందిగా నలుగురు విద్యార్థినులపై ఈనెల 13వ తేదీన సెల్‌ఫోన్ ద్వారా ఆమె ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ‘ఇప్పటివరకూ మనమధ్య ప్రొఫెసర్, విద్యార్థినుల సంబంధాలు, ఇక తరువాత లెవల్‌కు పోదాం, నలుగురూ ఒక్కచోటనే ఉన్నారు కదా, నాకు తెలుసు, నేను చెప్పినట్లు నడుచుకుంటే వర్సిటీ అధికారులతో చెప్పి మంచి మార్కులు వేయిస్తాను, ఆర్థికంగా కూడా మీకు లాభం ఉంటుంది, కళాశాలకు క్రమం తప్పకుండా రాకున్నా అటెండెన్స్ వచ్చేలా చేస్తాను’ అని ఆమె విద్యార్థినులతో అన్నారు. ‘వద్దు మేడం.. మా కలాంటివి వద్దు’ అని విద్యార్థినులు నిరాకరించినా, ‘తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు, ఒకటిన్నర నెలలో ప్రాక్టికల్స్ వస్తాయి, అందుకే ఈరోజు ఫోన్‌చేశాను, రెండు రోజుల్లో ఆలోచించుకుని చెప్పండి, మనం మాట్లాడుకున్న విషయాలు గోప్యంగా ఉంచండి..’ అంటూ మరీ ఒత్తిడిచేసినట్లు సమాచారం.
విద్యార్థినులు, నిర్మలాదేవి మధ్య సాగిన సంభాషణలు ఆదివారం వాట్సాప్‌లో వైరలయ్యాయి. ఈ క్రమంలో పలువురు సంఘ సేవకులు, మహిళా సంఘాలు నిర్మలాదేవిపై నిప్పులుగక్కాయి. అలాగే బాధిత విద్యార్థినులు కళాశాల కార్యదర్శికి ఫిర్యాదు చేయడంతో నిర్మలాదేవిని సోమవారంఉదయం సస్పెండ్ చేశారు.
చట్టపరమైన చర్యలకు సిఫారసు
నిర్మలాదేవిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు సిఫార్సు చేసినట్లు మదురై కామరాజర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ చెల్లదురై, ఉన్నత విద్యశాఖ కార్యదర్శి సునీల్ బాలివాల్, కళాశాల నిర్వాహకులు మీడియాకు తెలిపారు. ఈ వ్యవహారంలో నిర్మలాదేవితోపాటు ఇంకా ఎవరికి సంబంధాలు ఉన్నాయో విచారణలో తేలుతుందని అన్నారు. నిర్మలాదేవిని అరెస్ట్ చేయాలని ధర్మపురి లోక్‌సభ సభ్యులు, పీఎంకే అగ్రనేత అన్బుమణి రాందాస్ డిమాండ్ చేశారు. సీబీఐ విచారణకు ఆదేశించాలని డీఎంకే అగ్రనేత స్టాలిన్ కోరారు. సర్వత్రా నిరసనలు వ్యక్తం కావడంతో సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో భర్త, సోదరుని సమక్షంలో పోలీసులు నిర్మలాదేవి ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి అరెస్ట్‌చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ సంతానం నేతృత్వంలో ఉన్నతస్థాయి విచారణకు రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ ఆదేశించారు.
ఎన్‌కౌంటర్ చేయాలి
విద్యార్థినులను లైంగిక కార్యకలాపాలకు ప్రోత్సహించడం క్షమించరాని నేరమని, ఇలాంటి వారిని ఎన్‌కౌంటర్ చేయాలని మంత్రి జయకుమార్ వ్యాఖ్యానించారు. ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్యాశాఖ మంత్రి అన్బళగన్ తెలిపారు.
దురుద్దేశం లేదు :నిర్మలాదేవి
విద్యార్థినులతో మాట్లాడింది నిజమేనని, వాట్సాప్‌లో వైరలైనది తన గొంతుకనే అని అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి అంగీకరించారు. అయితే తన మాటల్లో దురుద్దేశం లేదని, కొన్ని మాటలను కత్తిరించి తప్పుడు అర్థం వచ్చేలా ప్రసారం చేశారని ఆమె ఆరోపించారు.
కళాశాలలో విచారణ
అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి తీరుపై విచారణ చేపడుతున్నట్లు కళాశాల నిర్వాహకులు తెలిపారు. అరుప్పుకోట్టై ఆర్‌డీఓ చెల్లప్ప, తహసీల్దారు కార్తికేయని, టౌన్ ఇన్స్‌పెక్టర్ బాలమురుగన్ తదితరులు సోమవారం సదరు కళాశాలకు వెళ్లి కార్యదర్శి వద్ద తీవ్రస్థాయిలో విచారణ చేపట్టారు. నిర్మలాదేవిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించాలని, విద్యార్థునులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్దులు, మహిళా సంఘాలు నేతలు కళాశాల ప్రవేశద్వారం వద్ద బైఠాయించారు. ఆ తరువాత కళాశాల ముట్టడి యత్నం చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసులు మొహరించి ఆందోళకారులను అడ్డుకున్నారు. ఆందోళనలు మిన్నంటడంతో నిర్మలాదేవి ఉదయం నుంచి తన ఇంటిలో తాళం వేసుకుని గడిపారు. ఆర్డీఓ, తహసీల్దారు, పోలీసులు వచ్చినా తలుపులు తీయలేదు.
Comments
Please login to add a commentAdd a comment