లక్ష్మీకాంత్ శర్మ
సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్: జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్ శర్మ కిడ్నాప్ వ్యవహారంలో ఆయన వద్ద పని చేస్తున్న వ్యక్తే ప్రధాన సూత్రధారిగా పోలీసులు నిర్థారించినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి చిలకలగూడ పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు. లక్ష్మీకాంత్ శర్మ ప్రతిరోజూ బంజారాహిల్స్ రోడ్ నెం.7లో ఉన్న ఓ టీవీ కార్యాలయానికి వస్తుంటారు. ఇందులో భాగంగానే గురువారం మధ్యాహ్నం తన ఇద్దరు డ్రైవర్లు, సహాయకుడితో కలిసి వచ్చారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో టీవీ కార్యక్రమం పూర్తయిన తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కారు ముందు సీట్లో కూర్చున్న అతడిని సఫారీ సూట్లలో వచ్చిన నలుగురు వ్యక్తులు అడ్డగించారు. తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమని, విచారణ నిమిత్తం రావాలంటూ చెప్పి బలవంతంగా వెనుక సీట్లో కూర్చోబెట్టారు. డ్రైవర్లతో పాటు సహాయకుడినీ కారు నుంచి దింపేసిన వారు ఇద్దరి సెల్‌ఫోన్లు సైతం లాక్కుని లక్ష్మీకాంత్ ఐదు నిమిషాల్లో వస్తారని చెప్పారు. ఆయనను వాహనంతో సహా రోడ్ నెం.7లోని వాటర్‌ట్యాంక్ వైపు తీసుకుని వెళ్లిపోయారు. కొద్దిసేపు అక్కడ వేచి చూసిన అతని అనుచరులు ముగ్గురిలో ఒకరి సెల్‌ఫోన్‌కు లక్ష్మీకాంత్ నుంచి ఫోన్ వచ్చింది. తనను ఎంక్వైరీ కోసం తీసుకువెళ్తున్నారంటూ చెప్పిన ఆయన అది పూర్తయిన తర్వాత వస్తానని, మీరు ఇంటికి వెళ్లాల్సిందిగా సూచించారు.
దీంతో ఈ ముగ్గురూ చిలకలగూడ పరిధిలోని మధురానగర్‌లో ఉన్న లక్ష్మీకాంత్ ఇంటికి వెళ్లి విషయం చెప్పారు. అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో లక్ష్మీకాంత్‌కు చెందిన వాహనంలోనే ఇంటికి వచ్చిన ‘ఆ నలుగురూ’ ఓ చిన్న లేఖ తీసుకువచ్చి లక్ష్మీకాంత్ తండ్రి రాజగోపాల్‌రావుకు ఇచ్చారు. అందులో ‘నాన్న సార్ వారు వస్తారు. వాళ్లు అడుగుతారు మీకు తెలిసింది చెప్పండి’ అంటూ లక్ష్మీకాంత్ చేతిరాతతోనే రాసి ఉంది. దీనిని చూపించిన దుండగులు తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమని చెప్పి ఇంట్లో ఉన్న బంగారం, నగదు తీసుకుని వెళ్ళారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల వైర్లు సైతం తొలగించిన దుండగులు డీవీఆర్ పట్టుకెళ్లారు. మరుసటి రోజు (శుక్రవారం) లక్ష్మీకాంత్ శర్మను ఆరామ్‌ఘర్ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఆయన చిలకలగూడ పోలీసుస్టేషన్‌కు వచ్చి తన కళ్లకు గంతలు కట్టారని, బెదిరించి చీటీ రాయించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఉదంతానికి సంబంధించి శుక్రవారం బంజారాహిల్స్ ఠాణాలో లక్ష్మీకాంత్ డ్రైవర్ చంద్రశేఖర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో కిడ్నాప్ కేసు నమోదైంది. మరోపక్క ఆయన తండ్రి రాజగోపాలరావు ఫిర్యాదుతో చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు రిజిస్టరైంది.
చంద్రశేఖర్ తన ఫిర్యాదు లో ఇంటికి వచ్చిన దుండగులు రూ.30 లక్షల నగదు, 30 తులాల బంగారం తీసుకువెళ్లారని పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళారు. లక్ష్మీకాంత్ తండ్రి తన ఫిర్యాదులో 60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు తీసుకువెళ్లారంటూ పేర్కొ న్నారు. ఈ రెండు కేసుల్నీ బంజారాహిల్స్, చిలకలగూడ పోలీసులు వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నా రు. ప్రాథమికంగా చిలకలగూడ పోలీసుల లక్ష్మీకాంత్ శర్మ వద్ద పని చేస్తున్న, పని చేసి మానేసిన వారి వివరాలు సేకరించి విశ్లేషించారు. ఈ నేపథ్యంలో ఓ పనివాడే సూత్రధారిగా ఈ వ్యవహారం సాగినట్లు గుర్తించారు. లోతుగా దర్యాప్తు చేసిన చిలకలగూడ పోలీసులు సోమవారం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని వి చారిస్తున్న పోలీసులు మిగిలిన నిందితుల్ని పట్టుకోవడంతో పాటు రికవరీలపై దృష్టి పెట్టారు. అయితే ఈ కేసులో అనేక అంశాలు మిస్టరీగా ఉన్నాయన్న అధికారులు నిందితులందరూ చిక్కితేనే చిక్కుముడులు వీడతాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment