నిందితుడు వీరేంద్ర సింగ్
విశాఖపట్నం, అల్లిపురం(విశాఖ దక్షిణం): ఏటీఎం క్లోనింగ్ ముఠాకు చెందిన ఒక వ్యక్తిని సైబర్ క్రైం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సైబర్ క్రైం సీఐ వి.గోపీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం... హర్యాణాకు చెందిన డ్రైవర్ వీరేంద్ర సింగ్, కులదీప్‌సింగ్ స్నేహితులు. వీరివురు సులువుగా డబ్బు సంపాదించాలని సందీప్ సింగ్ అనే వ్యక్తితో కలిసి ఏటీఎం క్లోనింగ్ ద్వారా ఏటీఎం కార్డు రూపొందించారు. దాని సాయంతో సులువుగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది జనవరిలో కులదీప్ సింగ్, సందీప్ సింగ్‌లు ఢిల్లీ నుంచి విమానంలో నగరానికి వచ్చి విశాలాక్షినగర్‌లో గల సీ పిరల్ హోటల్‌లో గదులు బుక్ చేసుకుని విడిదిచేశారు. తరువాత నగరంలో ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం సెంటర్లలో వినియోగదారుల కార్యకలాపాలను రహస్యంగా వీడియో రికార్డింగ్ చేసేవారు. ఏటీఎం కార్డు నంబరు, పిన్ నంబర్లను సేకరించి కార్డు క్లోనింగ్ చేసేవారు. ఒక్కోసారి వృద్ధులు, ఏటీఎం కార్డు వినియోగించలేని వారి నుంచి కార్డులు మార్చేసేవారు.
తరువాత అక్కడి నుంచి హోటల్ గదికి వచ్చి కార్డులు క్లోనింగ్ చేసి తిరిగి సాయంత్రానికి హర్యాణా వెళ్లిపోయేవారు. అక్కడ ఏటీఎం కార్డుల ద్వారా రాంచీ, అంధేరీ, ముంబయి, అసన్‌సోల్, డియోఘర్, షిరిడీ ప్రాంతాల్లో డబ్బులు డ్రా చేసేవారు. తిరిగి ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలలో పలుమార్లు వచ్చి ఏటీఎం కార్డులు క్లోనింగ్ చేసి వాటి ద్వారా సుమారు రూ.60 లక్షలు డ్రా చేసుకుని వెళ్లారు. ఈ మేరకు రూ.50వేలలోపు డబ్బు గుర్తు తెలియని వ్యక్తులు డ్రా చేసినట్లు బాధితుల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో 40 కేసులు నమోదైనట్లు సీఐ తెలిపారు. అదే విధంగా తాజాగా ఈ నెల 21వ తేదీన కులదీప్ సింగ్, వీరేంద్రసింగ్ స్పైస్ జెట్ విమానంలో 12.30గంటల ప్రాంతంలో నగరానికి చేరుకుని మధురవాడలో విడిది చేశారు. గణేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌కు ఫోన్ చేసి దిలీప్ అనే వ్యక్తి నుంచి ద్విచక్రవాహనం తీసుకున్నారు.
ఆ బైకు ఉపయోగించి 22వ తేదీన నగరంలో విశాలాక్షినగర్, గోపాలపట్నం, మధురవాడ ప్రాంతాల్లో ఎస్‌బీఐ, బ్యాంకు ఆఫ్ బరోడా, యాక్షిస్ బ్యాంకు ఏటీఎం సెంటర్లలో వీరంద్రసింగ్ ఏటీఎం కార్డుల వివరాలు సేకరిస్తుంటే కులదీప్ సింగ్ బయట ఉండి పర్యవేక్షిస్తూ కార్డులు క్లోనింగ్ చేశాడు. కులదీప్‌సింగ్, వీరేంద్ర సింగ్ నగరానికి వచ్చినట్లు తెలుసుకున్న సైబర్ క్రైం పోలీసులు వారు విడిది చేసిన హోటల్ రూంలో తనిఖీలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న కులదీప్ సింగ్ అక్కడి నుంచి పారిపోయాడు. గదిలో ఉన్న వీరేంద్రసింగ్‌ను అదుపులోకి తీసుకున్నామని సీఐ గోపీనాథ్ తెలిపారు. అతని వద్ద నుంచి క్లోనింగ్ చేసిన నాలుగు ఏటీఎం కార్డులు, యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం కార్డు ఒకటి, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఏటీఎం సెంటర్లలో అపరిచితులను నమ్మొద్దు
ఏటీఎం సెంటర్లలో అపరిచితులతో కార్డుల ద్వారా డబ్బు డ్రా చేయటం, పిన్ నంబర్లు చెప్పటం చేయవద్దని సైబర్ క్రైం సీఐ వి.గోపీనాథ్ సూచించారు. అలా చేయడం వల్ల ఏటీఎం కార్డులు మార్చేసే అవకాశంతో పాటు పిన్ నంబరు అపహరించే అవకాశం ఉందని, తద్వారా డబ్బులు డ్రా చేసే ప్రమాదం ఉందని తెలిపారు. నగరంలో క్లోనింగ్ ముఠా సంచరిస్తున్నట్లు సమాచారం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సీఐ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment