సాక్షి, సిటీబ్యూరో: ఏటీఎం కేంద్రాలే టార్గెట్‌గా డెబిట్ కార్డులను క్లోనింగ్ చేస్తున్న ముఠాను అబిడ్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన విషయంవిదితమే. రొమేనియాకు చెందిన ఇద్దరు లండన్ వాసి క్రిస్ట్
ఆదేశాలతో ఏటీఎం మెషిన్లకు స్కిమ్మర్లు, మైక్రో కెమెరాలు అమర్చి డేటా చోరీ చేశారు. అయితే నగరంలోనూ ఇలాంటి హైటెక్ ముఠాలు ఉన్నాయని... అవి స్కిమ్మింగ్, క్లోనింగ్ వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా పబ్లిక్ ప్లేసులే అడ్డాగా చేసుకొని దందా కొనసాగించే ఈ ముఠాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.ఈ ముఠాలు క్లోనింగ్,స్కిమ్మింగ్ చేసే విధానాలను వివరిస్తున్నారు.
అంతా అరచేతిలోనే...
ఈ సైబర్ నేరగాళ్లు మినీ స్కిమ్మర్లుగా పిలిచే అత్యాధునిక యంత్రాలను ఇంటర్‌నెట్, డార్క్ వెబ్ ద్వారా చైనా నుంచి ఖరీదు చేసి దిగుమతి చేసుకుంటున్నారు. నగరంలోని పెట్రోల్ బంక్‌లు, హోటల్స్, రెస్టారెంట్స్, బార్స్ తదితర చోట్ల హెల్పర్స్‌గా పనిచేసే వారిని మచ్చిక చేసుకొని వారికి ఈ పరికరాలను అందిస్తున్నారు. అరచేతిలో ఇమిడిపోయే సైజులో ఉండే వీటిని వాళ్లు నిత్యం తమ జేబుల్లో ఉంచుకుంటున్నారు. వినియోగదారుల్లో ఎవరైనా డబ్బు చెల్లింపు కోసం డెబిట్ కార్డు ఇచ్చినప్పుడు అదను చూసి ఆ కార్డును తమ అరచేతిలోని స్కిమ్మర్‌లోనూ ఒకసారి స్వైప్ చేస్తున్నారు. దీంతో అందులో ఉండే డేటా మొత్తం స్కిమ్మర్‌కు చేరుతోంది. ఆపై దాన్ని పీఓఎస్ మెషిన్‌లో స్వైప్ చేసి, పిన్ నంబర్ ఎంటర్ చేయడం కోసం వినియోగదారుడికి అందిస్తుంటారు. కస్టమర్ ఎంటర్ చేసే పిన్‌ను జాగ్రత్తగా గమనిస్తారు. ఈ తంతు పూర్తయిన తర్వాత కార్డును వినియోగదారుడికి తిరిగి ఇచ్చేస్తుంటారు.
రైటర్‌తో ల్యాప్‌టాప్‌లోకి...
డెబిట్ కార్డుకు సంబంధించిన డేటా మొత్తం దాని వెనుక ఉండే నల్లని టేపు లాంటి మ్యాగ్నటిక్ స్ట్రిప్ లేదా చిప్‌లో నిక్షిప్తమై ఉంటుంది. స్కిమ్మర్‌లో కార్డును ఉంచి స్వైప్ చేయడంతో డేటా అందులోకి చేరుతుంది. ఇలా తస్కరించిన డేటాతో కూడిన స్కిమ్మర్లను ఈ పాత్రధారులు అసలు సూత్రధారులకు అందిస్తారు. ఇలా చేసినందుకు వీరికి కమీషన్ లేదా కొంత మొత్తం సూత్రధారుల నుంచి అందుతుంది. కేవలం డేటా మాత్రమే ఇచ్చిన కార్డుల కంటే పిన్ నంబర్‌తో సహా అందించిన వారికే కమీషన్ ఎక్కువ ఇస్తారు. ఈ డేటాను అందుకునే సూత్రధారులు ల్యాప్‌టాప్‌కు స్కిమ్మర్లు కనెక్ట్ చేయడం ద్వారా వాటిలోకి అప్‌లోడ్ చేస్తారు. అనేక సందర్భాల్లో ఈ సమాచారాన్ని సూత్రధారులు విదేశాల్లోని తమ అనుచరులకు అందిస్తారు. డార్క్ వెబ్ ద్వారానూ విక్రయించే దందా జోరుగా సాగుతుంటుంది.
ఖాళీ కార్డు టు క్లోన్డ్ కార్డు
సూత్రధారులు ఇంటర్‌నెట్ లేదా డార్క్ వెబ్ ద్వారానే మ్యాగ్నటిక్ స్ట్రిప్ లేదా చిప్‌తో కూడిన ఖాళీ కార్డులను కొనుగోలు చేస్తుంటారు. వీటిని ల్యాప్‌టాప్‌కు అనుసంధానించిన రైటర్‌లో ఉంచి.. అందులోకి క్లోన్ చేసిన వాటిలో ఓ కార్డు డేటా ట్రాన్స్‌ఫర్ చేసి క్లోన్డ్ కార్డు రూపొందిస్తారు. అంటే వినియోగదారుడి కార్డుకు నకలు దుండగుడి వద్ద తయారైపోతుందన్న మాట. దీన్ని తీసుకొని వాళ్లు షాపింగ్, ఆన్‌లైన్‌లో లావాదేవీలు చేయడం, డబ్బు డ్రా చేసుకోవడం చేస్తుంటారు. పీఓఎస్ మెషిన్లు ఉన్న కొందరు చిన్న చిన్న వ్యాపారులకు ఈ నేరగాళ్లు కమీషన్ల వల వేస్తున్నారు. దీంతో వాళ్లు నిబంధనలకు విరుద్ధంగా స్వైపింగ్ మెషిన్‌లో స్వైప్ చేసి నగదు ఇస్తూ కమీషన్ తీసుకుంటున్నారు.
ఓ కన్నేయండి...
కేవలం డెబిట్ కార్డులనే కాదు క్రెడిట్ కార్డులనూ క్లోన్ చేసే ఆస్కారం ఉంది. కార్డుల ద్వారా లావాదేవీలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ కార్డు ఎదుటి వ్యక్తి చేతికి వెళ్లి మళ్లీ తిరిగి వచ్చే వరకూ గమనిస్తూ ఉండాలి. పీఓఎస్ మెషిన్‌లో పిన్ నంబర్ మీరే ఎంటర్ చేయాలి. అలా చేస్తున్నప్పుడు అది ఎవరూ గమనించకుండా రహస్యంగా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిన్‌ను ఎంటర్ చేసుకొమ్మని ఎదుటి వ్యక్తికి చెప్పకూడదు. ఈ తరహా సైబర్ నేరాల్లో రికవరీలు కష్టసాధ్యం. ఈ నేపథ్యంలో నేరాల బారినపడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమం. – సైబర్ క్రైమ్ పోలీసులు
రొమేనియా ఎంబసీకి లేఖ రాస్తాం
నగరంలోని ఏటీఎం కేంద్రాలను టార్గెట్‌గా చేసుకొని ప్రత్యేక ఉపకరణాల ద్వారా డెబిట్ కార్డుల క్లోనింగ్‌కు పాల్పడుతున్న డినీట వర్జిల్ సొరైనెల్, జార్జ్ క్రిస్టియన్లను అరెస్టు చేశాం. వీరి విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లండన్‌కు చెందిన క్రిస్ట్ వీరి తో పాటు మరికొందరు రొమేనియన్లనూ క్లోనింగ్ దందా కోసం భారత్‌కు పంపాడని వెల్లడైంది. వీళ్లు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దిగారని తెలిసింది. దీనిపై సమగ్ర నివేదిక రూపొందించి ఆ వివరాలతో రొమేనియన్ ఎంబసీకి లేఖ రాసి సమాచారం ఇవ్వాలని నిర్ణయించాం. డినీట, జార్జ్‌లన కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత మరింత సమాచారం తెలుస్తుంది. – మధ్య మండల పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment