పరికరాలను పరిశీలిస్తున్న సీపీ
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఏటీఎం కేంద్రాలను టార్గెట్‌గా చేసుకొని ప్రత్యేక ఉపకరణాల ద్వారా డెబిట్ కార్డ్స్ క్లోనింగ్ చేస్తున్న హైటెక్ ముఠా గుట్టును అబిడ్స్ పోలీసులు రట్టు చేశారు. లండన్‌లో ఉన్న సూత్రధారి సూచనల మేరకు నగరానికి వచ్చి స్కిమ్మింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు రొమేనియా దేశస్తులను పట్టుకున్నారు. వీళ్లు నగరంలోని 8 ఏటీఎం కేంద్రాల్లోని మెషిన్లకు అత్యాధునిక స్కిమ్మర్లు, మైక్రో కెమెరాలు ఏర్పాటు చేసి డెబిట్ కార్డుల డేటా సంగ్రహించినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. మధ్య మండల సంయుక్త పోలీసు కమిషనర్ విశ్వప్రసాద్‌తో కలిసి గురువారం తనకార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు.
గత నెల 20న సిటీకి
యూరోపియన్ యూనియన్ దేశమైన రొమేనియాకు చెందిన డినీట వర్జిల్ సొరైనెల్, జార్జ్ క్రిస్టియన్లు అక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికేవాళ్లు. ఓ సందర్భంలో ఈ ద్వయం లండన్ వెళ్లినప్పుడు అక్కడ క్రిస్ట్ అనే వ్యక్తిని కలిశారు. ఇరువురికీ 5వేల యూరోల చొప్పున ఇచ్చిన అతగాడు డెబిట్ కార్డ్స్ స్కిమ్మింగ్, క్లోనింగ్‌కు ఉపకరించే అత్యాధునిక పరికరాలు అందజేశాడు. వీటితో ఇండియాకు వెళ్లి అక్కడి ఏటీఎం కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని సూచించాడు. అలా తస్కరించిన డేటాను తనకు ట్రాన్స్‌ఫర్ చేయాలని చెప్పాడు. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ 9న రొమేనియాలో పాస్‌పోర్ట్ పొందిన ఇరువురూ వేర్వేరుగా విజిట్ వీసా తీసుకొని 14న ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడి నుంచి 20న హైదరాబాద్‌కు వేర్వేరుగా వచ్చిన వీరు.. వేర్వేరు ప్రాంతాల్లోని సర్వీసు అపార్ట్‌మెంట్స్‌లో దిగారు. కేవలం ఫోన్‌కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారానే సమాచార మార్పిడి చేసుకున్నారు.
ఒక్కొక్కరు ఒక్కో పని...
డినీట్ తన వద్దనున్న పరికరాలు తీసుకొని ఉదయమే బయటకు వచ్చేవాడు. నగరం మొత్తం సంచరిస్తూ అనువైన ఏటీఎం కేంద్రాన్ని గుర్తించేవాడు. అందులోకి మాస్క్, టోపీతో వెళ్లేవాడు. డెబిట్‌కార్డ్ పెట్టే స్లాట్‌లో స్కిమ్మర్, పిన్ నంబర్ నొక్కే కీ–ప్యాడ్‌పైన భాగంలో మైక్రో కెమెరా, బ్యాటరీలతో కూడిన డివైజ్ ఏర్పాటు చేసేవాడు. ఇవి ఆ మెషిన్‌కు ఉండే పరికరాల్లో ఇమిడిపోతాయి. దీంతో సాధారణంగా చూసే ఎవరూ గుర్తించరు. ఉదయం 7:30–8 గంటల మధ్య ఈ పని పూర్తి చేసేవాడు. ఆ ఏటీఎం మెషిన్‌ను వినియోగించడానికి వచ్చిన వినియోగదారుడు తన డెబిట్‌కార్డును స్లాట్‌లో పెడితే... అప్పటికే దానిపై అమర్చిన స్కిమ్మర్ దాని డేటాను రీడ్ చేసేస్తుంది. పిన్ నొక్కేప్పుడు అవన్నీ కీప్యాడ్ పైన ఉన్న కెమెరాలో రికార్డు అయిపోతాయి. వీటిని ఏర్పాటు చేసిన తర్వాత ఆ లోకేషన్‌ను డినీట్ వాట్సాప్‌లో జార్జ్‌కు పంపించేవాడు. దీని ఆధారంగా 16–17 గంటల తర్వాత ఆ ప్రాంతానికి చేరుకునే జార్జ్ వాటిని తీసుకెళ్లేవాడు. వాటిలో నిక్షిప్తమైన డేటాను తమ ల్యాప్‌టాప్‌లోకి డౌన్‌లోడ్ చేసేవాడు.
సెక్యూరిటీ గార్డు అనుమానంతో...
మధ్య మండల పరిధిలోని జగదీష్ మార్కెట్ వద్దనున్న ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రంలోని మెషిన్‌కు ఓ విదేశీయుడు ఏవో ఉపకరణాలు బిగిస్తున్నట్లు సెక్యూరిటీ గార్డు అనుమానించాడు. ఈ విషయం బ్యాంకు అధికారులకు తెలపడంతో వాళ్లు ఈ నెల 14న వచ్చి పరిశీలించి ఉన్నట్లు గుర్తించారు. ఆ మరుసటి రోజు పరిశీలిస్తే అవి లేకపోవడం, 16న మళ్ళీ ఉండడంతో బ్యాంకు అధికారులు అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్ రవికుమార్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది. ఏటీఎం కేంద్రంలో రికార్డు అయిన ఫీడ్ ఆధారంగా దుండగులు విదేశీయులని గుర్తించింది. అక్కడి నుంచి చుట్టూ ఉన్న అనేక సీసీ కెమెరాల్లో ఫీడ్ పరిశీలిస్తూ ముందుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే సదరు విదేశీయుడు ఆటో ఎక్కుతున్నట్లు దానికి 200 మీటర్ల దూరంలో ఉన్న ఓ కెమెరాలో గుర్తించారు. ఆ ఆటోడ్రైవర్‌ను ప్రశ్నించగా, అతగాడు మెహిదీపట్నంలో దిగాడని తేలింది.
ఆటోలు మారుతూ...
ఒకే ఆటోలో ప్రయాణిస్తే సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు పట్టుకుంటారని నిందితుడు అనుమానించాడు. దీంతో ఆటోలు మారుతూ తాను బస చేసిన సర్వీస్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లే పథకం వేశాడు. మెహిదీపట్నం ప్రాంతంలో సీసీ కెమెరాలు పరిశీలించగా అక్కడ మరో ఆటో ఎక్కినట్లు తేలింది.దాని నంబర్ ఆధారంగా డ్రైవర్‌ను గుర్తించి ఆరా తీశారు. నానల్‌నగర్ వద్ద ఆటో దిగాడని తేలడంతో అక్కడి కెమెరాల ఆధారంగా మూడో ఆటో ఎక్కినట్లు తేల్చి ఆ డ్రైవర్‌ను ఆరా తీశారు. సదరు డ్రైవర్ ఆ విదేశీయుడు గచ్చిబౌలి పరిధిలోని అంజయ్యనగర్‌లో దిగాడని చెప్పాడు. అప్పటికే సీసీ కెమెరాల ఫీడ్ నుంచి సంగ్రహించిన విదేశీయుడి ఫొటో ఆధారంగా అక్కడి సర్వీస్ అపార్ట్‌మెంట్స్‌లో ఆరా తీయగా ఫలితం దక్కింది. ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న డినీట్ పోలీసులకు చిక్కాడు. అక్కడ దిగడానికి అతగాడు బోగస్ గుర్తింపు కార్డు వాడినట్లు వెల్లడైంది. అతడిచ్చిన సమాచారంతో బేగంపేటలోని మరో సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న జార్జ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి గదుల్లో తనిఖీ చేసిన పోలీసులు ల్యాప్‌టాప్ తదితర స్వాధీనం చేసుకున్నారు.
క్లోనింగ్ సైతం చేస్తున్నట్లుఅనుమానాలు...
ఈ ద్వయం చెప్పిన దాని ప్రకారం వీళ్లు డెబిట్‌కార్డుల డేటా తస్కరించి (స్కిమ్మింగ్) లండన్‌లో ఉన్న క్రిస్ట్‌కు పంపిస్తుంటారు. అయితే వీరి వద్ద పోలీసులు స్కిమ్మర్లతో పాటు ఎలాంటి డేటా లేని ఖాళీ ప్లాస్టిక్ కార్డులు, ల్యాప్‌టాప్ సాయంతో స్కిమ్మింగ్ డేటాను వీటిలోకి ఎక్కించే రీడర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్లు ఇక్కడే క్లోన్డ్ డెబిట్‌కార్డులు తయారీకి ప్రయత్నించారని అనుమానిస్తున్నారు. తదుపరి విచారణలోనే ఈ వివరాలన్నీ వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. 20 రోజులకు పైగా నగరంలో స్వైరవిహారం చేసిన ఈ ద్వయం 8 ఏటీఎం కేంద్రాల్లో డివైజ్‌లు ఏర్పాటు చేసి డేటా తస్కరించినట్లు పోలీసులు గుర్తించారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌లో విశ్లేషించిన తర్వాతే ఎవరెవరి డేటా తస్కరణకు గురైంది? అందులో ఎంత లండన్‌లోని క్రిస్ట్‌కు చేరింది? అనేది తేలుతుందని, బ్యాంక్ అధికారులు సైతం దీనిపై విచారణ చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.
ఎలా కొట్టేస్తున్నారు?
ఏటీఎంలలో డెబిట్ కార్డును ఉంచే స్లాట్‌లో స్కిమ్మర్, పిన్ నంబర్ ఎంటర్ చేసే కీప్యాడ్ పైభాగం లో మైక్రో కెమెరా అమర్చుతారు. వినియోగదారులు డెబిట్ కార్డును స్లాట్‌లో ఉంచినప్పుడు అప్పటికే దానిపై అమర్చిన స్కిమ్మర్ డేటాను రీడ్ చేస్తుంది. పిన్ ఎంటర్ చేసేటప్పుడు మైక్రో కెమెరాలో రికార్డు అవుతుంది.
ఏం చేస్తున్నారు?
ఏటీఎం కేంద్రాల్లో ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేసి డెబిట్ కార్డుల డేటా సంగ్రహిస్తున్నారు. దీని ద్వారా డెబిట్ కార్డుల క్లోనింగ్‌కు పాల్పడుతున్నారు.
ఎంత మంది?
ఇద్దరు రొమేనియా దేశస్తులు ఈ నేరానికి పాల్పడ్డారు. వీరు విజిట్ వీసాపై భారత్‌కు వచ్చి నగరంలో పాగా వేశారు. వీరిద్దరు పాత్రధారులు కాగా.. లండన్‌లోని క్రిస్ట్ సూత్రధారి.
..ఇలా చిక్కారు
అబిడ్స్ జగదీష్ మార్కెట్‌లోని ఎస్‌బీఐ ఏటీఎంలో వీటిని అమర్చుతుండ గా సెక్యూరిటీ గార్డుకు అనుమానం వచ్చింది. బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వగా స్కిమ్మర్లు ఉన్నట్లు గుర్తించారు. అధికారులు పోలీసులకు తెలియజేయడంతో సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment