
నల్లగొండ, మోత్కూరు (తుంగతుర్తి) : బుడి బుడి అడుగులు.. ముద్దు.. ముద్దు మాటలతో నవ్వులొలికించే ఆ చిన్నా రి కాసేపట్లోనే కానరాని లోకాలకు వెళ్లిపోయి తల్లిదండ్రికి కడుపుకోత మిగిల్చింది. ఈ విషాదకర ఘటన మోత్కూరు మండలం ధర్మాపురంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రావుల సత్తయ్య–కమలమ్మ కూతురు హేమలత డెలవరీకి మూడు మాసాల క్రితం తల్లిగారింటికి వచ్చింది. రెండు రెండు నెలల క్రితం చిన్నారికి జన్మనిచ్చింది.
మొదటి కూతురు యేడాదిన్నర చిన్నారి రిశ్విత ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా అమ్మమ్మ ఇంటిలోపల పనుల్లో ఉన్నారు. రిశ్విత ఆడుకుంటున్న సమయంలో తన చేతిలో ఉన్న బిస్కెట్ ప్యాకెట్ ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపులో పడిపోయింది. దానిని తీసుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు చిన్నారి రిశ్విత పడి అక్కడికక్కడే మృతిచెందింది. కాసేపటి తర్వాత చిన్నారి గురించి ఆరా తీయగా నీటి సంపులో విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించారు. చిన్నారి తల్లిదండ్రులు హేమలత–మల్లేష్, అమ్మమ్మ–తాత కమలమ్మ, సత్తయ్యలు రోదనలు మిన్నంటాయి.