చినకొండేపూడిలో పాప శవం దొరికిన బావి వద్ద పోలీసులు
సీతానగరం (రాజానగరం): తల్లి చనుబాలు తాగుతూ రాత్రి నిద్రపోయిన పదహారు రోజుల పసిపాప తెల్లవారేసరికీ అదృశ్యమైంది. అనంతరం ఇంటి సమీపంలో ఉన్న ఓ బావిలో శవమై తేలింది. హృదయ విదారకరమైన ఈ ఘటన సీతానగరం మండలం చిన కొండేపూడిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. చిన కొండేపూడి గ్రామానికి చెందిన మల్లిరెడ్డి రమణ, మహాలక్ష్మికి ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె సృజనకు అదే గ్రామానికి చెందిన కాళ్ల సతీష్‌తో గతేడాది ఏప్రిల్‌లో వివాహమైంది. ఆమె ఈ నెల నాలుగో తేదీన రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. బిడ్డతో సహా ఈ నెల ఆరున చిన కొండేపూడిలోని పుట్టింటికి క్షేమంగా తిరిగి వచ్చింది.
తెల్లవారుజామున ఘటన
రోజూ మాదిరిగానే సతీష్ గురువారం రాత్రి 9 గంటల వరకూ భార్యాబిడ్డలతో గడిపి తన ఇంటికి వెళ్లాడు. భర్త వెళ్లిన తరువాత తల్లి, చెల్లెలు, అమ్మమ్మతో కలిసి సృజన ఒకే గదిలో పడుకుంది. అర్ధరాత్రి 12 గంటలకు కూడా పాపకు పాలిచ్చింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మెలకువ వచ్చి చూస్తే పక్కలో పాప లేదు. వెంటనే కంగారు పడి తన తల్లి మహాలక్ష్మి, అమ్మమ్మ గంధం కనకరత్నం పద్మావతి, చెల్లెలు ప్రమీలను నిద్రలేపింది. జారవేసిన తలుపులు అలాగే ఉన్నాయి. కానీ పాప అదృశ్యమైంది.
ఊరంతా జల్లెడ
సమాచారం తెలుసుకున్న అర్బన్ అడిషనల్ ఎస్పీ కె.లతామాధురి, నార్త్ జోన్ డీఎస్పీ సత్యనారాయణరావు, సీసీఎస్ సీఐలు జగన్, రాంబాబు, కోరుకొండ, రాజానగరం సీఐలు పవన్ కుమార్ రెడ్డి, ఎంవీ సుభాష్ తదితరులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆ ఇంటి పరిసరాలతో పాటు ఊరంతా జల్లెడ పట్టారు. డాగ్ స్క్వాడ్ ఆ సమీపంలోని పామాయిల్ తోట వరకు వెళ్లి ఆగాయి. సృజన కుటుంబ సభ్యులు తమకు ఎవ్వరి తోనూ విభేదాలు లేవని, ఎవరిపైనా అనుమానాలు లేవని చెప్పాడు. దీంతో ఏ విధమైన ఆచూకీ లభించక పోలీసులు తదుపరి నిఘ చర్యలు తీసుకునేందుకు వెళ్లిపోయారు.
సీతానగరం పోలీస్ స్టేషన్ వద్ద పాప తల్లి నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు
అనుమానాస్పదంగా..
పసిపాప అదృశ్యం విషయం తెలుసుకున్న పలువురు సృజన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 4.30 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన సంసాబత్తుల కృష్ట అక్కడకు వచ్చి బాధితులను పరామర్శించాడు. ఆ సమయంలో కాల్ రావడంతో సెల్‌ఫోన్ మాట్లాడుతూ సృజన ఇంటికి రోడ్డు అవతల ఉన్న వీరభద్రరాజు ఇంటి ఆవరణలోని బావి వరకూ వెళ్లాడు. బావికి ఆనుకుని మాట్లాడుతూ యాథాలాపంగా బావిలోకి చూశాడు. అందులో పసిపాప శవం కనిపించడంతో బిగ్గరగా అరిచాడు. సమాచారం తెలుసుకున్న సీఐ పవన్ కుమార్‌రెడ్డి అక్కడకు చేరుకుని పసికందు మృతదేహాన్ని బావి నుంచి పైకి తీశారు. పాప మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, బంధువులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కాగా.. ఆడపిల్ల కావడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నార్త్‌జోన్ డిఎస్పీ సత్యనారాయణరావు విలేకరులతో మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment