పండ్ల మార్కెట్‌కు వెళ్లిన వ్యక్తి.. బావిలో శవమై..! | East Godavari: Missing Man Found Dead In Well | Sakshi
Sakshi News home page

పండ్ల మార్కెట్‌కు వెళ్లిన వ్యక్తి.. బావిలో శవమై..!

Published Wed, May 26 2021 9:11 AM | Last Updated on Wed, May 26 2021 9:18 AM

East Godavari: Missing Man Found Dead In Well - Sakshi

శెన్నంశెట్టి శ్రీనివాసరావు

సాక్షి, రాజానగరం: చక్రద్వారబంధానికి చెందిన పండ్ల వ్యాపారి శెన్నంశెట్టి శ్రీనివాసరావు (శ్రీను) (45) అదృశ్యం కేసులో మిస్టరీ వీడింది. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి సమీపంలోని కశింకోట మండలం చింతలపాలెంలో రహదారిని ఆనుకుని ఉన్న నేలబావిలో అతడు శవమై తేలాడు. అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. రాజమహేంద్రవరంలోని మామిడి పండ్ల మార్కెట్‌కు వెళ్లి వస్తానని ఆదివారం తెల్లవారుజామున ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరిన శ్రీను తిరిగి రాలేదు. ఆ రోజంతా అతడి కోసం ఎదురు చూసిన కుటుంబ సభ్యులు సోమవారం చుట్టుపక్కల గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో అతడి కుమారుడు వీరబాబు రాజానగరం పోలీసులను ఆశ్రయించాడు.

జాతీయ రహదారిపై సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. శ్రీను విశాఖ వైపు వెళ్లినట్టు గుర్తించారు. ఇంటి నుంచి వచ్చిన అతడు సూర్యారావుపేట జంక్షన్‌లోని కనకదుర్గమ్మ ఆలయం వద్ద మోటార్‌ సైకిల్‌ను పార్క్‌ చేశాడు. తన సెల్‌ఫోన్‌ కూడా బైక్‌ కవర్‌లోనే ఉంచి, తాళాలను మ్యాట్‌ కింద పెట్టి, విశాఖ వైపు వెళ్లే లారీ ఎక్కినట్టు సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డయింది. ఇదిలా ఉండగా ‘గుర్తు తెలియని వ్యక్తి మృతి’ అంటూ వివిధ పత్రికల విశాఖ జిల్లా ఎడిషన్లలో మంగళవారం వార్తలు వచ్చాయి. అవి చూసిన కుటుంబ సభ్యులు ఒంటిపై ఉన్న దుస్తుల వివరాలను బట్టి అనుమానంతో అక్కడకు వెళ్లారు. ఆ మృతదేహం శ్రీనుదేనని గుర్తించారు. అనకాపల్లి ప్రభుత్వాస్పత్రిలో భద్రపరిచిన శ్రీను మృతదేహాన్ని పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసును రాజానగరం ఎస్సై శివనాగబాబు దర్యాప్తు చేస్తున్నారు. 

ఆర్థిక ఇబ్బందులే కారణమా? 
సీజనల్‌ పండ్లు విక్రయిస్తూ జీవనం సాగించే శ్రీనివాసరావు ఆయా సీజన్లలో పండ్ల కోసం తోటలు కొనుగోలు చేసి, వ్యాపారం చేస్తుంటాడు. మూడేళ్లుగా తోటలపై పెట్టుబడులు అధికం కావడం, వ్యాపారాలు అనుకున్నంతగా లేకపోవడంతో అప్పుల భారం పెరిగిందని గ్రామస్తులు అంటున్నారు. అయితే అతడికి ఉన్న ఆస్తుల దృష్ట్యా ఇటువంటి అఘాయిత్యం చేసుకునే అవసరం కూడా లేదని చెబుతున్నారు. శ్రీనుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

చదవండి: భర్త అనుమానం.. ఇద్దరు బిడ్డలతో తల్లి ఆత్మహత్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement