అమృత్‌సర్ : మరికొన్ని క్షణాల్లో పెళ్లి చేసుకోబోతున్నాననే ఆనందంలో... బ్యాండ్, బాజా, భజంత్రీలతో ఊరేగుకుంటూ పెళ్లి మండపానికి వచ్చిన వరుడికి ఊహించని షాక్ ఎదురైంది. పెళ్లి మండపం వద్ద కనీసం పెళ్లి ఏర్పాట్లే కాకుండా.. పెళ్లి కూతురు, వారి కుటుంబ సభ్యులు కూడా కనిపించలేదు. దీంతో పెళ్లి చేసుకోబోతున్నాననే ఆనందమంతా క్షణాల్లో ఆవిరైపోయింది. ఈ సంఘటన అమృత్‌సర్‌లో జరిగింది. స్థానిక ఆసుపత్రిలో పారామెడిక్ అయిన పర్గత్ సింగ్, తను పెళ్లి చేసుకోవాలనుకున్న సిమ్రాన్‌జిత్ కౌర్‌ను గత కొన్నినెలల క్రితమే కలిశాడు. ఉద్యోగం కోసం పర్గత్ సింగ్ ఆసుపత్రికి వచ్చిన సిమ్రాన్‌జిత్ కౌర్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల్లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఈ పెళ్లికి వరుడు తరుఫు కుటుంబం ఎలాంటి షరతులు పెట్టకుండానే అంగీకరించింది. హమ్మయ్యా.. ఇక ఎలాంటి తలనొప్పులు లేవు. హ్యాపీగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పెళ్లి కోసం పర్గత్‌ను సిమ్రాన్‌జిత్, బల్జీత్ కౌర్ అనే మహిళకు పరిచయం చేసింది. ఆమెనే తమ పెళ్లి తేదీలను నిర్ణయిస్తుందని చెప్పింది. అంతేకాక తమ కుటుంబం కోసం పెళ్లి పనులన్నీ తానే చూసుకుంటుందని తెలిపింది. తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాననే సంబురంలో అన్నింటికీ ఓకే చెప్పేశాడు పర్గత్.
ఈ వేడుక కోసం పెళ్లి కూతురు వైపు వారు తాజ్ ప్యాలెస్ బాంకెట్ హాల్‌ను బుక్ చేసినట్టు చెప్పారు. పర్గత్ తన కుటుంబ సభ్యులు, బంధువులు మొత్తంగా కలిపి 150 మందితో బ్యాండ్, బాజా, భజంత్రీలతో పెళ్లి మండపానికి చేరుకున్నాడు. కానీ బాంకెట్ హాల్ వారు మాత్రం వారిని లోపలికి అనుమతించలేదు. అసలేమైంది అని కనుక్కుంటే, పెళ్లి కోసం అక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగలేదని తెలిసింది. పెళ్లి కూతురు, వారి కుటుంబ సభ్యులు కూడా కనిపించకుండా పోయారు. పెళ్లి కూతురి తరుఫు బంధువులకు ఎంతమందికి ఫోన్లు చేసినప్పటికీ, ఒక్కరూ లిఫ్ట్ చేయకపోవడంతో, ఇక ఏం చేయలేని స్థితిలో పెళ్లి కొడుకు బ్యాచిలర్‌గానే తిరిగి తన ఇంటికి వెళ్లిపోవాల్సి వచ్చింది.
ఉద్యోగం కోసం సిమ్రాన్‌జిత్ కౌర్ కొన్ని నెలల కిత్రం తనను కలిసిందని, తన కోసం ఉద్యోగం ప్రయత్నిస్తున్న సమయంలో తామిద్దరం ప్రేమలో పడ్డామని పర్గత్ చెప్పాడు. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నట్టు తెలిపాడు. ఈ పెళ్లి కోసం బల్జీత్ కౌర్‌కు 70వేల రూపాయలు ఇచ్చినట్టు చెప్పాడు. బల్జీత్, సిమ్రాన్‌జిత్‌లు కలిసి తనను మోసం చేసినట్టు లబోదిబోమంటున్నాడు. పోలీసు స్టేషన్‌లో తన ఫిర్యాదును నమోదు చేశాడు. వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ పెళ్లి వేడుక కోసం తాను లక్షన్నర ఖర్చు చేశానని, కానీ ఆఖరికి సిమ్రాన్‌జిత్ ఇలా చేస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పర్గత్ అసలు, సిమ్రాన్‌జిత్‌ను, బల్జీత్‌కౌర్‌ను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలువలేదని ఛేహార్తా పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ సతీష్ కుమార్ చెప్పారు. కేవలం మొబైల్ ఫోన్‌లోనే వారితో సంభాషించినట్టు వెల్లడించారు. విచారణలో నిజనిజాలన్నీ బయటికి వస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment