
ప్రతీకాత్మక చిత్రం
కోల్‌కతా : బిర్యానీ డబ్బులు అడిగినందుకు హోటల్ యజమానిని కాల్చి చంపిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో కలకలం రేపింది. ఉత్తర 24 పరగణ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సంజయ్ మండల్ అనే వ్యక్తి స్థానికంగా హోటల్ నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి హోటల్‌కు వచ్చిన నలుగురు కస్టమర్లు ప్లేట్ బిర్యానీ ఆర్డర్ చేశారు. బిల్లు 190 రూపాయలు అయింది. అయితే తిన్న తర్వాత డబ్బులు కట్టకుండానే కస్టమర్లు వెళ్లిపోతుండగా.. వారిని ఆపిన సంజయ్ బిల్లు కట్టిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్లాలంటూ డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన మహమ్మద్ ఫిరోజ్ అనే కస్టమర్ తన వద్ద ఉన్న తుపాకీతో సంజయ్‌ను కాల్చగా.. అతడు అక్కడిక్కడే మరణించాడు. సంజయ్ తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే కేవలం బిర్యానీ బిల్లు కోసమే ఈ హత్య జరిగిందా లేదా మరేదైనా కారణముందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.