సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో ‘డీ–గ్యాంగ్’కలకలం! అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తన నేర సామ్రాజ్యాన్ని ఇక్కడికీ విస్తరించాడు. ముంబైకి చెందిన ఓ న్యాయవాదిని హతమార్చేందుకు డీ–కంపెనీ చేసిన కుట్రలో హైదరాబాద్ లింకులు బయటపడ్డాయి. ‘బిగ్ బాస్’షో గొడవ నేపథ్యంలో ఆ లాయర్‌ను చంపే పనిని నగరానికి చెందిన రోహుల్ అమీన్ షంషుల్ ఇస్లాంకు అప్పగించింది గ్యాంగ్! ఇందుకు దావూద్ కుడి భుజం అయిన ఫహీమ్ మచ్‌మచ్.. అమీన్‌తో రూ.25 లక్షల డీల్ కుదుర్చుకున్నాడు.
చివరికి న్యాయవాది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ముంబై పోలీసులు.. అమీన్‌తోపాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. గతనెల చివరి వారం హైదరాబాద్ వచ్చిన ముంబై క్రైం బ్రాంచ్ ప్రత్యేక విభాగం అధికారులు.. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ సాయంతో ఈ అరెస్టులు చేయడంతోపాటు ఓ పిస్టల్, 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని నగర పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచారు. ఉగ్రవాదుల మాదిరి ‘డీ–కంపెనీ’సైతం సామాజిక మాధ్యమాల ద్వారా నియామకాలు చేసుకుంటున్నట్లు ఈ ఉదంతంతో తేలింది.
‘బిగ్‌బాస్’తో మొదలైన వివాదం
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ కలర్స్ టీవీ చానల్‌లో ‘బిగ్‌బాస్–11’షో నిర్వహిస్తున్నారు. కొన్నాళ్ల కిందట ఇందులో ముంబైలోని డోంగ్రీ ప్రాంతానికి చెందిన జుబేర్ ఖాన్ పాల్గొన్నాడు. దావూద్ ఇబ్రహీం స్వస్థలం కూడా డోంగ్రీనే కావడం గమనార్హం. కొద్దిరోజుల తర్వాత షో నుంచి జుబేర్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. తనను షో నుంచి అన్యాయంగా ఎలిమినేట్ చేశారంటూ అతడు బాంద్రా ప్రాంతానికి చెందిన న్యాయవాది షబ్నమ్‌ను ఆశ్రయించాడు.
దీంతో ఆమె సల్మాన్‌తోపాటు ఆ టీవీ చానల్‌పై ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తర్వాత నిబంధనలకు అనుగుణంగానే ఎలిమినేషన్ జరిగిందని తెలుసుకొని ఆమె తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. అయితే దీని వెనుక భారీ మొత్తం చేతులు మారినట్లు, షబ్నమ్‌కు రూ.5 కోట్ల వరకు ముట్టినట్లు జుబేర్ అనుమానించాడు. ఆ మొత్తంలో తనకు రూ.3 కోట్లు ఇవ్వాలంటూ ఆమెతో వాదనకు దిగాడు. చివరికి డోంగ్రీ ప్రాంతంలో తనకున్న పరిచయాలతో ‘డీ–కంపెనీ’కి చెందిన ఫహీమ్ మచ్‌మచ్‌ను సంప్రదించాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంటున్న ఇతడు దావూద్ ఇబ్రహీంకు కుడి భుజంగా ఉన్నాడు. బెదిరింపు వ్యవహాలన్నింటినీ ఇతడే డీల్ చేస్తుంటాడు.
ఎవరీ అమీన్.. ఏంటి ఆ డీల్?
పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్‌లోని కిషన్‌గంజ్ ప్రాంతానికి చెందిన అమీన్ కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చి ఓల్డ్ మలక్‌పేట వహీద్‌నగర్ ప్రాంతంలో నివసిస్తోంది. బీకాం కంప్యూటర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఇతడు మాదాపూర్‌లోని 100 ఫీడ్ రోడ్ ప్రాంతంలో మరో ముగ్గురితో కలిసి ఓ కార్ల షెడ్ నిర్వహించాడు. ఇతడికి బంజారాహిల్స్ రోడ్ నం.4కు చెందిన మీర్జా మహ్మద్ ముఫకమ్ బేగ్‌తో పరిచయం ఏర్పడింది. ఇతడు కుటుంబంతో సహా చాలాకాలం దుబాయ్‌లో ఉండి 2004లో ఇక్కడకు వచ్చాడు.
మాదాపూర్‌లోని అమీన్ షెడ్‌కు తరచూ వెళ్తుండటంతో అతడితో గతేడాది పరిచయం ఏర్పడింది. దుబాయ్‌లో ఉండగా అక్కడున్న ‘డీ–కంపెనీ’అనుచరులతో ముఫకమ్‌తో పరిచయాలున్నాయి. ఈ నేపథ్యంలో ముఫకమ్, అమీన్‌లు తరచూ తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాల గురించి చర్చించేవారు. ఈ నేపథ్యంలోనే ముఫకమ్ తనకు ‘డీ–కంపెనీ’తో పరిచయాలు ఉన్నాయని, వారికోసం పని చేస్తే తక్కువ కాలంలోనే ఎక్కుడ డబ్బు సంపాదించవచ్చని అమీన్‌తో చెప్పాడు.
ఇందుకు అమీన్ అంగీకరించడంతో దుబాయ్ ‘లింకుల్ని’పరిచయం చేశాడు. వీరి ద్వారా అమీన్... పాకిస్తాన్‌లో ఉన్న ఫహీమ్ మచ్‌మచ్‌తో టచ్‌లోకి వెళ్లాడు. కేవలం వాట్సాప్ లేదా మెసెంబర్ ద్వారా మాత్రమే సంప్రదింపులు జరిపే ఫహీమ్.. షబ్నమ్‌ను బెదిరించి డబ్బు వసూలు చేసే బాధ్యతల్ని అమీన్‌కు అప్పగించాడు. పని పూర్తి చేస్తే రూ.25 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఫేస్‌బుక్ ద్వారా మరో ఇద్దరిని..
ఫహీమ్ మచ్‌మచ్ ఫేస్‌బుక్ ద్వారా ఢిల్లీకి చెందిన హరీష్ యాదవ్, పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన జస్వీందర్‌సింగ్‌లను డీ–కంపెనీ కోసం రిక్రూట్ చేసుకున్నాడు. వీరిద్దరినీ వాట్సాప్ ద్వారా అమీన్‌కు పరిచయం చేసిన ‘ఆపరేషన్’పూర్తి చేయాలని ఆదేశించాడు. దుబాయ్, పాకిస్తాన్‌లతోపాటు హైదరాబాద్ నుంచి షబ్నమ్‌కు బెదిరింపు ఫోన్లు చేయించాడు. అయినా ఆమె లొంగకపోవడంతో హతమార్చాలని ఫహీమ్ నిర్ణయించుని, ఆ పనిని అమీన్‌కు అప్పగించాడు.
అయితే తనకు తుపాకీ కాల్చడం రాదని చెప్పిన అమీన్.. హరీష్‌తో పని చేయిస్తానని తెలిపాడు. బిహార్ నుంచి వచ్చి మంగళ్‌హాట్ ప్రాంతంలో నివసిస్తున్న తన స్నేహితుడైన మహ్మద్ అబ్రార్ అహ్మద్‌ను ఆయుధం కోసం అమీన్ సంప్రదించాడు. దీంతో అహ్మద్ బిహార్‌లో ఉంటున్న తన బావ ఇమ్రాన్ ద్వారా రూ.34 వేలు వెచ్చించి .9ఎంఎం పిస్టల్, 10 తూటాలు తెప్పించి అమీన్‌కు అందించాడు.
షబ్నమ్‌ను హతమార్చడానికి ఢిల్లీ నుంచి హరీష్ యాదవ్‌ను ముంబై రమ్మని చెప్పిన అమీన్ తానూ అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈలోపు షబ్నమ్ ఫిర్యాదు మేరకు గతేడాది నవంబర్ 30న కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు... క్రైమ్ బ్రాంచ్ ఆధీనంలోని యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్‌ను రంగంలోకి దింపారు.
గతంలోనూ దందాలు చేశారా?
కేసును దర్యాప్తు చేసిన యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్ పోలీసులు ముంబైలోనే జుబేర్‌ను, హరీష్‌లను పట్టుకున్నారు. అమృత్‌సర్‌కు చెందిన జస్వీందర్‌ను సైతం అరెస్టు చేశారు. వీరిచ్చిన సమాచారంతో గతనెల చివర్లో హైదరాబాద్ వచ్చి టాస్క్‌ఫోర్స్ అధికారుల్ని కలిశారు. డీ–కంపెనీకి చెందిన వారిని అరెస్టు చేయడానికి సహకరించాల్సిందిగా కోరుతూ వారి వివరాలు ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్ అమీన్, ముఫకమ్, అబ్రార్‌లను పట్టుకుంది. వీరి నుంచి పిస్టల్, 10 తూటాలు, ఫోన్లు తదితరాలు స్వాధీనం చేసుకుంది. ముంబై తీసుకువెళ్లి నిందితుల్ని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
ఇక్కడ్నుంచే బెదిరించారు: ముంబై క్రైం బ్రాంచ్ అధికారి
ఈ కేసుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా అత్యంత గోప్యంగా ఉంచాల్సి వచ్చిందని ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారు. ‘‘అమీన్‌తోపాటు ఈ కేసులో అరెస్టు చేసిన ఇతర నిందితులను లోతుగా విచారించాల్సి ఉంది. అమీన్ నేరుగా పాకిస్తాన్‌లో ఉన్న డీ–కంపెనీ క్యాడర్‌తో సంప్రదింపులు జరిపినట్లు నిర్ధారణ అయింది. మిగిలిన ఇద్దరు ఇతడికి సహకరించారు. ఓ సందర్భంలో అమీన్ హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి షబ్నమ్‌ను బెదిరించి డబ్బు డిమాండ్ చేశాడు. ఇతడు గతంలోనూ ఈ తరహా బెదిరింపులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నాం’’అని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment