క్యాష్‌కౌంటర్‌లో వేలిముద్రలు సేకరిస్తున్న క్లూస్‌టీం
నెల్లూరు(క్రైమ్): నగరంలోని ట్రంకురోడ్డులోని ఓ ప్రము ఖ వస్త్ర దుకాణంలో ఆదివారం వేకువన దొంగలు చోరీకి పాల్పడ్డారు. టెర్రస్‌పై నుంచి రెండో అంతస్థులోకి ప్రవేశించిన దుండగులు మెట్ల మీదుగా కిందకు చేరుకున్నారు. దుకాణం షట్టర్ తెరుచుకోకపోవడంతో ట్రయల్‌రూమ్ ద్వారా లోనికి ప్రవేశించారు. క్యాష్‌కౌంటర్‌లోని రూ.34.43లక్షలను అపహరించుకెళ్లారు. శనివారం వేకువన ట్రంకురోడ్డులోని కుమార్ జ్యువెలరీస్‌లో దొంగలు చోరీకి యత్నించారు. ఈ ఘటన మరువక ముందే వస్త్రదుకాణంలోకి ప్రవేశించి భారీగా చోరీకి పాల్పడడంతో వ్యాపారులు హడలిపోతున్నారు. పో లీసుల సమాచారం మేరకు....నగరంలోని ట్రంకురోడ్డులో ఉన్న ప్రముఖ వస్త్ర దుకా ణానికి, కనకమహాల్‌సెంటర్‌లో మరో దుకాణం ఉంది. రెండు దుకాణాల శుక్ర, శనివారాలకు సంబంధించిన కలెక్షన్ నగదు రూ 34.43లక్షలను ట్రంకురోడ్డులోని దుకాణం క్యాష్‌కౌంటర్‌లో ఉంచారు.
సోమవారం వాటిని బ్యాంకులో జమచేయాల్సి ఉంది. శనివారం రాత్రి ఎప్పటిలాగే దుకాణానికి తాళాలు వేసి వెళ్లారు. ఈ క్రమంలో గుర్తుతెలియని దుండగులు దుకాణం పక్కనే ఉన్న కాంప్లెక్స్‌పై నుంచి చెక్కబల్ల సాయంతో టెర్రస్‌పైకి వచ్చారు. గ్రిల్స్‌ను యాక్సాబ్లేడ్‌తో కోసి మెట్లమీదుకు చేరుకున్నారు. షట్టర్‌ను తెరిచేందుకు విఫలయత్నం చేశారు. తెరుచుకోకపోవడంతో పై భాగంలో ఉన్న రంద్రం ద్వారా ట్రయల్‌రూమ్‌లోకి ప్రవేశించారు. తలుపు బోల్టులను తొలగించి లోనికి చేరుకున్నారు. రెండో అంతస్థులోని క్యాష్‌కౌంటర్‌లోని చిల్లర నగదును తీసుకున్నారు. పొడిచిల్లరను వదిలేశారు. అనంతరం కింద పోర్షన్‌కు చేరుకున్నారు. అక్కడి క్యాష్‌కౌంటర్‌ను తెరచి అందులోని రూ.34.43లక్షలను తీసుకుని వచ్చిన మార్గంలోనే టెర్రస్‌పైకి వెళ్లారు. అక్కడ నగదు పంచుకున్నారు. రూ.10, రూ. 20 నోట్లను అక్కడే వదిలి మిగిలిన నగదు తీసుకుని పరారయ్యారు.
సూపర్‌వైజర్ ఫిర్యాదు
ఆదివారం ఉదయం సూపర్‌వైజర్ షాపింగ్‌మాల్‌కు వచ్చాడు. షట్టర్ తాళాలు తెరచి లోనికి వెళ్లిచూడగా వస్తువులన్ని చిందరవందరగా పడి ఉన్నాయి. క్యాష్‌కౌంటర్ తెరచి ఉంది. రెండో అంతస్థులోకి వెళ్లి చూడగా అక్కడి క్యాష్‌కౌంటర్‌ను తెరచి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించి జనరల్ మేనేజర్‌కు తెలిపాడు. ఆయన, యజమా ని ఘటనా స్థలానికి చేరుకుని చోరీ ఘటనపై ఒకటోనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చోరీ తీరును పరిశీలించిన అధికారులు
నగర, సీసీఎస్ డీఎస్పీలు ఎన్‌బీఎం మురళీకృష్ణ, ఎం బాలసుందరరావు, ఒకటోనగర ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ బీ పాపారావు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ షేక్ బాజీజాన్‌సైదా, ఎస్‌ఐలు షేక్ కరిముల్లా, షేక్ షరీఫ్ తమ సిబ్బందితో చోరీ జరిగిన తీరును పరిశీలించారు. రెండో అంతస్థులో నుంచి టెర్రస్‌పైకి వెళ్లే షట్టర్‌ను తెరిచే ప్రయత్నం చేయగా ఎంతకీ రాకపోవడంతో దుకాణ సిబ్బంది పక్క కాంప్లెక్స్‌పై నుంచి టెర్రస్‌పైకి చేరుకుని షట్టర్‌ను అతికష్టంపై పైకిలేపారు. దీంతో పోలీసులు టెర్రస్‌పైకి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్‌టీం ఘటనా స్థలంలో వేలిముద్రలను సేకరించింది. డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలంతో పాటు సమీపంలోని కాంప్లెక్స్ వద్ద కలియతిరిగింది. కాంప్లెక్స్ పైభాగంలో కొత్తగా గదులు నిర్మిస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. అక్కడ పనిచేసే వారి వివరాలను సేకరిస్తున్నారు.
రెక్కీవేసి చోరీ
దుండగులు పక్కా రెక్కీ వేసి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఎక్కడి నుంచి వెళితే షాపింగ్‌మాల్‌లోకి వెళ్లవచ్చు. దొంగతనం అనంతరం ఎలా సులువుగా తప్పించుకోవచ్చనే వివరాలను పూర్తిగా పరిశీలించిన అనంతరమే దుండగులు దొంగతనం చేసినట్లు తెలుస్తోంది.దీంతో ఐదారు రోజుల సీసీఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఆన్‌లో లేని సీసీ కెమెరాలు
దుకాణంలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు సీసీకెమెరాలు పనిచేస్తుంటాయి. రాత్రి వేళల్లో షార్ట్ సర్క్యూట్ భయంతో సిబ్బంది ఆఫ్‌చేసి వెళుతున్నారు. సీసీకెమెరాలు ఆపకుండా ఉండి ఉంటే చోరీకి పాల్పడిన దుండగుల ఆనవాళ్లు దొరికి ఉండేవి. క్యాష్‌కౌంటర్ పక్కనే ఇనుప బీరువా ఉంది. దాంట్లో నగదు ఉంచినా భద్రంగా ఉండేది. సిబ్బంది కౌంటర్‌లోనే నగదు ఉంచడంతో దొంగలు సులభంగా అపహరించగలిగారు.
కేసు నమోదు
చోరీ ఘటనపై దుకాణం మేనేజర్ ఫిర్యాదు మేరకు ఒకటోనగర ఎస్‌ఐ షేక్ కరిముల్లా కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో లభ్యమైన క్లూస్ ఆధారంగా కేసును విచారిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment