
పట్నా: బిహార్ మహిళా పోలీసు అధికారి ఒకరు భయంకరమైన గ్యాంగస్టర్‌ను పట్టుకునేందుకు ఏకంగా టాప్ హీరోయిన్‌ను వాడేసుకున్నారు. ప్రముఖ దక్షిణ భారతీయ సినీ హీరోయిన్ ఫోటోతో చాకచక్యంగా హనీట్రాప్ విసిరి ఓ కరుడు కట్టిన నేరస్తుడి ఆటకట్టించిన వైనం ఆసక్తికరంగా మారింది.
దర్భంగా జిల్లా పోలీసులు అందించిన సమాచారం ప్రకారం పాట్నాకు 150 కిలోమీటర్ల దూరంలోని దర్భాంగా జిల్లాలో బీజేపీ సంజయ్ కుమార్ మహతోకు చెందిన ఖరీదైన మొబైల్ ఫోన్ ఇటీవల చోరీకి గురైంది. దీంతో ఆయన స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. ఈ కేసును పోలీసు ఉన్నతాధికారి మధుబాలదేవికి అప్పగించారు అధికారులు. విచారణ సందర‍్భంగా గ్యాంగ్‌స్టర్ మహమ్మద్ హస్నయిన్ ఈ మొబైల్ వాడుతున్నట్టుగా గుర్తించారు. అతడి కాల్ లిస్ట్ ఆధారంగా వలపన్నిన మధుబాల చివరి నిమిషంలో మహ‍్మద్ తప్పించుకోవడంతో పలు సార్లు విఫలమయ్యారు.
ఇక్కడే మధు బుర‍్రలో ఓ స్మార్ట్ ప్లాన్ రూపుదిద్దుకుంది. హీరోయిన్ నయనతార ఫోటోను తన ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని..నకిలీ ప్రేమ నటిస్తూ అతగాడికి మెసేజ్‌లు పెట్టింది. మొదట్లో నిరాకరించినా, నయనతార ఫోటో చూసిన ఫ్లాట్ అయ్యాడో ఏమో తెలియదు కానీ..చివరకి హనీట్రాప్‌లో ఇరుక్కున్నాడు. దర్భంగా టౌన్‌లో కలవాలని ప్రతిపాదించాడు. సరిగ్గా దీనికోసమే ఎదురు చూస్తున్న ఈ స్మార్ట్ పోలీసు చాకచక్యంగా అతగాడికి చెక్ పెట్టింది.
అయితే ఈ స్టోరీలో మరో ట్విస్ట్ ఏంటంటే..మహ్మద్ నేరాన్ని ఒప్పుకున్నాడు కానీ తను వాడుతున్న మొబైల్ వేరే నేరస్తుడి నుంచి రూ.4500 కొనుగోలు చేశానని పోలీసులకు చెప్పాడు. దీంతో ఆ నేరస్తుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోటో చూసి బుక్కయ్యాడని.. బురఖాలో వెళ్లి.. ఇతర పోలీసులు సహాయంతో అతనిని అరెస్టు చేశామని మధుబాల చెప్పారు. మరోవైపు అధికారి మధుబాలకు పోలీసు శాఖ రివార్డ్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment