అడ్రస్‌ చూపుతానని.. బైక్‌తో ఉడాయింపు! | Bike Robbery In Anantapur | Sakshi
Sakshi News home page

అడ్రస్‌ చూపుతానని.. బైక్‌తో ఉడాయింపు!

Published Thu, Jul 26 2018 10:50 AM | Last Updated on Thu, Jul 26 2018 10:50 AM

Bike Robbery In Anantapur - Sakshi

అనంతపురం, రాయదుర్గం అర్బన్‌: రాయదుర్గంలో సరికొత్త మోసానికి తెరలేపాడో యువకుడు. అడ్రస్‌ కోసం వెదుకుతున్న వ్యక్తికి తాను అడ్రస్‌ చూపిస్తానంటూ అతని మోటార్‌ సైకిల్‌ ఎక్కి, దిగగానే ఉడాయించాడు. పట్టపగలే జరిగిన ఈ ఘటనకు పల్లెటూరి రైతు బిత్తరబోయాడు. వివరాల్లోకి వెళితే.. కణేకల్లు మండలం యర్రగుంటకు చెందిన రైతు పాపన్న గారి నాగరాజు (30) రెండు నెలల క్రితం అనంతపురంలో హోండాషైన్‌ బైకు (నెంబర్‌ ఏపీ02సీబీ3640) తీసుకున్నాడు.

నంబర్‌ ప్లేటు కోసం బుధవారం రాయదుర్గంలోని హీరో షోరూంకు వచ్చాడు. ఇక్కడ కాదు ఇచ్చేది.. హోండా షోరూంలో అంటూ ఒక యువకుడు అతనికి తెలిపాడు. అడ్రస్‌ చెప్పాలని నాగరాజు కోరగా.. తాను చూపిస్తానంటూ వాహనాన్ని తనే నడుపుతూ హోండా షోరూం వద్దకు వచ్చాడు. నాగరాజు దిగి షాపులో అడిగే లోపల, వెంట వచ్చిన యువకుడు మోటార్‌సైకిల్‌తో ఉడాయించాడు. దీంతో బిత్తరపోయిన నాగరాజు తమ గ్రామానికి చెందిన బంధువులకు విషయం చెప్పి పట్టణమంతా గాలించారు. సాయంత్రం వరకు దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీకెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement