గతంలో పూజలు నిర్వహించిన ఆలయ ఉద్యోగి (ఫైల్)
శ్రీకాళహస్తిలో తరచూ క్షుద్ర పూజల నిర్వహణ కలకలం రేపుతోంది. శక్తి ఆలయం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. పదవీయోగం సిద్ధిస్తుందని.. గుప్త నిధుల లభ్యమవుతాయని.. శత్రువులకు హాని చేయవచ్చనే మూఢ నమ్మకాలతో ఒళ్లు గగుర్పొడిచే పూజలు నిర్వహిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా వేడాం సమీపంలోని భైరవకోనలో మంగళవారం రాత్రి క్షుద్రపూజలు చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి సమాచారం మేరకు శ్రీకాళహస్తి దేవస్థానం ఓ ఉద్యోగిని అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తి ఆలయ సమీపంలో ఉన్న భైరవ కోన, వెయ్యిలింగాల కోన పరిధిలో తరచూ క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి, నూతన సంవత్సరం వంటి ముఖ్యమైన రో జుల్లో తప్ప మిగిలిన రోజుల్లో ఇక్కడ జనసంచారం పెద్దగా ఉండదు. దీంతో ఈ ప్రాంతాన్ని కొందరు మూఢ నమ్మకాలతో కొన్ని పూజలకు నిలయంగా మార్చుకున్నారు.
ఎన్నికల ముందు..
సాధారణ ఎన్నికల ముందు 2018 జనవరి 5న గుర్తు తెలియని వ్యక్తులు భైరవ కోన వద్ద క్షుద్ర పూజలు నిర్వహించారు. ఈ పూజను ఆలయంలో పనిచేసే అధికారి ధనపాల్ అనే వ్యక్తి నిర్వహించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను సస్పెండ్ చేశారు. కొద్ది రోజుల తరువాత తిరిగి ఆయన విధుల్లో చేరారు. అది కూడా పదోన్నతిపై. అతని పదోన్నతిపై తిరిగి విధుల్లో చేరేందుకు అప్పటి దేవదాయశాఖ మంత్రి రాతపూర్వకంగా లేఖ కూడా ఇచ్చారని తెలిసింది. నాటి నుంచి నేటి వరకు ఆయన ఆలయ ఏఈఓగా విధులు నిర్వహిస్తున్నా రు. తాజాగా మంగళవారం అర్ధరాత్రి ధనపాల్ సహకారంతో చెన్నైకి చెందిన కొందరు భైరవ కోనలో క్షుద్రపూజలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని పూజలు నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.
ఉద్యోగి సూచనల మేరకే..
శ్రీకాళహస్తి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగి సూచనల మేరకే భైరవ కోనలో ఈ పూజలు నిర్వహించేందుకు వచ్చినట్టు తమిళనాడు వాసులు చెప్పినట్టు సమాచారం. అయితే అక్కడ జరిగింది క్షుద్రపూజా.. మరేదైనా పూజ తేలాల్సి ఉందని సీఐ ఆరోహణరావు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ విషయమై ప్రభుత్వం స్పందించింది. శ్రీకాళహస్తీశ్వరాలయ పరిధిలో జరిగిన పూజలపై విచారణ చేపట్టి వెంటనే నివేదిక ఇవ్వాలని దేవదాయ శాఖ మంత్రి ఆదేశాలు జారీచేశారు.
అవి క్షుద్రపూజలే
ఆగమ సంబంధమైన ఆలయం శ్రీకాళహస్తీశ్వరాలయం. ఆలయ పరిసర ప్రాంతాల్లో రాత్రి 9 గంటలు దాటాక ఏ పూజ చేసినా క్షుద్రపూజే.
– సింగరాజు ప్రకాశం పంతులు, పురోహితులు, శ్రీకాళహస్తి
Comments
Please login to add a commentAdd a comment