సాక్షి, వరంగల్ : పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు పాడె ఎక్కాడు. వరుసకు సోదరుడైన వ్యక్తితో అనైతిక బంధం కొనసాగిస్తున్న వధువే వరుడిపై పెట్రోల్ దాడి చేసి హత్యాయత్నం చేసిన ఘటనలో చివరకు వరుడు ప్రాణాలు కోల్పోయాడు. 60 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న వరుడు యాకయ్య శనివారం మృతి చెందాడు. గత ఆరు రోజుల క్రితం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన యాకయ్యపై పెట్రోల్ దాడి జరిగిన విషయం తెలిసిందే. అనైతిక బంధంతో వధువే వరుడిపై హత్యాయత్నం జరపడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికే వధువు అరుణ, ఆమె సోదరుడు బాలస్వామిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
అసలేం జరిగిందంటే..
కంచనపల్లి గ్రామానికి చెందిన గొంగోళ్ల సామ్యేల్- యాదమ్మల కుమారుడు యాకయ్యకు మాదరం గ్రామానికి చెందిన అరుణతో ఈనెల 21న పెళ్లి చేయాలని ఇరువర్గాల కుటుంబసభ్యులు నిర్ణయించారు. వధువుకు మాత్రం ఈ వివాహం ఇష్టం లేదు. కారణం ఆమె గత మూడేళ్లుగా బాలస్వామితో ప్రేమలో ఉంది. కానీ, బాలస్వామి మరెవరో కాదు.. వధువుకు స్వయాన పెద్దమ్మ కొడుకు. పెళ్లిని ఆపేందుకు బాలస్వామితో కలిసి వధువు పథకం పన్నింది. మరోవైపు ఆదివారం 18వ తేది నాడు కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన వరుడు కుటుంబం రాత్రి బంధువులతో హడావిడిలో ఉండగా వధువు అరుణ నుంచి యాకయ్యకు ఫోన్ కాల్ వచ్చింది.
ఫోన్ సిగ్నల్ సరిగా లేదని బయటకు వచ్చి మాట్లాడమని అరుణ చెప్పడంతో వరుడు యాకయ్య బయటకు వచ్చాడు. అప్పటికే మాటువేసిన బాలస్వామి ఒక్కసారిగా యాకయ్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలతో ఉన్న యాకయ్యను చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment