రవి (ఫైల్)
చిత్తూరు, పీలేరు రూరల్ : వివాహేతర సంబంధం హత్యకు దారి తీసిన సంఘటన శనివారం రాత్రి పీలేరు పట్టణంలో చోటుచేసుకుంది. పీలేరు అర్బన్ సీఐ చిన్నపెద్దయ్య కథనం మేరకు.. గుర్రంకొండ మండలం నడిమికండ్రిగ పంచాయతీ పేయలవారిపల్లెకు చెందిన కృష్ణప్పనాయుడు కుమారుడు రవి (37)కి వివాహమై భార్య విడాకులు తీసుకుంది. దీంతో ఒంటరిగా జీవనం సాగించేవాడు. రవికి వరుసకు సోదరుడైన అదే గ్రామానికి చెందిన గణపతి భార్య ధనలక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలసి పీలేరు పట్టణం శ్రీనివాస్‌నగర్‌లో నివాసం ఉన్నారు. గణపతి లారీడ్రైవర్‌గా పనిచేసేవాడు. కొన్ని నెలల క్రితం ఒంటరిగా ఉన్న రవికి గణపతి తన ఇంటిలో ఆశ్రయం కల్పించాడు. ఈ క్రమంలో ధనలక్ష్మితో రవి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
నాలుగు నెలల క్రితం ఇద్దరూ గణపతికి తెలియకుండా హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. గణపతి పిల్లలు దిగులుపడుతున్నారని భార్యకు నచ్చజెప్పి తిరిగి ఇంటికి పిలుచుకుని వచ్చాడు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ నుంచి పీలేరుకు వచ్చిన రవి ఓ లాడ్జిలో ఉండి ధనలక్ష్మికి ఫోన్‌చేసి రమ్మన్నాడు. ఈ విషయాన్ని ధనలక్ష్మి తన భర్త గణపతికి చెప్పి, ఇద్దరూ కలసి స్థానిక తిరుపతి రోడ్డులోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వద్దకు వెళ్లారు. ధనలక్ష్మిని చూసిన రవి ఇంత ఆలస్యం ఎందుకంటూ చేయిచేసుకున్నాడు. తన ముందరే భార్యను కొట్టడంతో కోపోద్రిక్తుడైన గణపతి పక్కనే ఉన్న ఇనుపరాడ్డుతో రవి తలపై మోదాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిన రవి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment