రమేష్ (ఫైల్)
కుప్పంరూరల్: అతనికి ప్రేమ వివాహమై ఒక కుమారుడు కూడా ఉన్నాడు.. ఆమె పెళ్లయి భర్తను వదిలిపెట్టింది. ఇద్దరిదీ ఒకే వృత్తి కావడంతో ఫోన్ల ద్వారా దగ్గరై వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. తీరా యువతి వైపు నుంచి ప్రియుడితో కలవడం మానుకోవాలని ఒత్తిడి.. ప్రియుడు తనవైపు వారికి సమాధానం చెప్పుకోలేక మానసిక వేదనకు గురయ్యారు. ఇరువైపుల వారు, సమాజం తమను నిందితులుగా చూడడం భరించలేక ఇద్దరూ ఆత్మహత్యకు యత్నించారు. ఈ ప్రయత్నంలో ప్రియుడు మృత్యువాత పడగా, ప్రియురాలు తప్పించుకుంది. ఈ సంఘటన సోమవారం ఉదయం కుప్పం రైల్వేస్టేషన్ సమీపంలోని మల్దేపల్లి వద్ద చోటు చేసుకుంది. కుప్పం రైల్వే పోలీసుల కథనం మేరకు వివరాలిలా..
కుప్పం మండలం వెండుగంపల్లికి చెందిన రమేష్ (26) ఒంగోలులో రాతి పాలిష్ పనికి వెళ్లేవాడు. సమీపంలోని గూడూరులో తన అక్క ఉండగా, అక్కడికి వెళ్లి వస్తుండేవాడు. అక్కడ సుజాత అనే అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయి వర్గం విబేధించినా ఇద్దరూ ఒకతాటిపై నిలిచి 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక మగపిల్లాడు కలిగాడు. అక్కడ పనులు తక్కువ కావడంతో రమేష్ కుటుంబాన్ని తిరుపతికి మార్చాడు. ప్రస్తుతం భార్య సుజాత, కుమారుడు అక్కడే ఉన్నారు. ఈ మధ్యలో పాలిష్ పనిని వదిలి వంట చేయడం వృత్తిగా ఎంచుకున్నాడు. తమిళనాడులోని హొసూరులో ఓ హోటల్లో వంటమాస్టర్‌గా చేరాడు. అక్కడ ఫోన్, సోషల్ మీడియా ద్వారా హోటల్ మేనేజ్‌మెంట్ చేస్తున్న బెంగళూరు పట్టణానికి చెందిన ఓ యువతితో ఏడాది కిందట పరిచయం ఏర్పడింది. అప్పటికే ఆమెకు వివా హమై భర్తతో దూరంగా ఉంటోంది. రమేష్, ఆ యువతి అప్పుడప్పుడు హొసూరు, బెంగళూరు పరిసరాల్లో కలుసుకునేవారు.
యువతి ఎవరితోనే తిరుగుతున్నట్లు తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు అతన్ని వదిలిపెట్టాలని తీవ్రంగా హెచ్చరించారు. రమేష్‌కు సైతం భార్య, కుటుంబ సభ్యుల నుంచి సదరు యువతిని వదిలిపెట్టాలని నెల రోజులుగా ఒత్తిడి ఎక్కువైంది. ఈ క్రమంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మూడు రోజుల క్రితం కుప్పం చేరుకున్నారు. ఆదివారం రాత్రి రమేష్ స్థానికంగా ఉన్న తన మరో అక్క సులోచన ఇంటికి వెళ్లి బంగారుచైను, మొబైల్‌ఫోన్ ఇచ్చి, బావ ద్విచక్ర వాహనాన్ని తీసుకుని, మరలా వస్తానని చెప్పి బయటకు వచ్చాడు. రాత్రంతా రమేష్, యువతి మద్యం సేవించారు. ఉదయం కుప్పం రైల్వేస్టేషన్ సమీపంలోని మల్దేపల్లి వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అక్కడికి చేరుకోగానే రైలు సైతం వచ్చింది. రమేష్ అమాంతం రైలుకింద పడి విగతజీవుడయ్యాడు. యువతికి ధైర్యం చాలక సొమ్మసిల్లి రైలుపట్టాల సమీపంలోనే పడిపోయింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న హెడ్ కానిస్టేబుల్ బృందం రమేష్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, యువతిని చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు రైల్వే పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment