బస్సు చక్రాలకు బలైపోయిన బాలుడు అశోక్ మృతదేహం తల్లిదండ్రులు, అన్నయ్యతో అశోక్ (తండ్రి పక్కనున్న బాలుడు)
స్కూలు వదిలారు.. బిలబిలమంటూ పిల్లలు బస్సు చుట్టూ చేరారు.. సీటు కోసం ఎగబడుతున్న చిన్నారులు బ్యాగులను బస్సులో వేస్తున్నారు.. ఇంతలో గుండెలు పిండేలా ఆర్తనాదం.. ఎక్కే ప్రయత్నంలో కాలు జారిన విద్యార్థిపైకి వెనక్కి మళ్లుతున్న బస్సు చక్రాలు ఎక్కేశాయి.. కొత్త స్కూల్లో చేరి ఇంకా రెండు వారాలు కూడా కాకముందే పదకొండేళ్ల చిన్నారి విగత జీవిగా మిగిలాడు..
రావికమతం, బుచ్చెయ్యపేట (చోడవరం): పిల్లలిద్దరినీ ఆ ఊళ్లో రామలక్ష్మణులని పిలుస్తారు.. అన్న మరుపాక మోడల్ స్కూల్లో చదువుతున్నాడని తమ్ముడినీ అదే స్కూల్లో చేర్చారు.. ముద్దులొలికే వారిద్దరినీ విధి విడదీసింది. తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది. ప్రమాదవశాత్తూ బస్సు కింద పడి మరుపాక మోడల్ స్కూల్ విద్యార్ధి గుంటల అశోక్ (11) గురువారం సాయంత్రం మృతి చెందాడు. బుచ్చెయ్యపేట మండలం చిట్టియ్యపాలెం గ్రామానికి చెందిన గుంటల నూకరాజు, వరహాలమ్మల చిన్న కొడుకు అశోక్ ఆరో తరగతి చదువుతున్నాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న అన్నయ్య శివతో కలిసి ప్రతిరోజూ ఆర్టీసీ బస్సులో స్కూలుకు వెళ్లి వస్తుంటాడు. గురువారం సాయంత్రం విద్యార్ధులను తీసుకువెళ్లేందుకు బస్సు వచ్చి స్కూల్ వద్ద వెనక్కు మళ్లిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అశోక్ గట్టిగా కేకలు వేయడంతో అంతా వచ్చి గాయాలైన ఆ విద్యార్ధిని హుటాహుటిన నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్టు అక్కడి వైద్యులు చెప్పారు. అశోక్ ఒంటిపై గాయాలేవీ లేనప్పటికీ బస్సు మీదకు ఎక్కేస్తుందని ఆందోళన చెంది గుండె ఆగిపోయి ఉంటుందని వైద్యులు చెప్పారు. రావికమతం పోలీసులు బస్సును స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రామలక్ష్మణులను విడదీశావా దేవుడా..
అశోక్ బస్సుకింద పడి తీవ్రగాయాల పాలై మృతి చెందిన వార్తను తెలుసుకున్న అశోక్ తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటిన ఆటోల్లో స్కూల్ వద్దకు వచ్చారు. అప్పటికే మృతి చెందిన వార్త తెలుసుకున్న వారు గుండెలవిసేలా రోదించారు. బిడ్డలిద్దరూ రామలక్ష్మణుల్లా స్కూల్‌కు వచ్చేవారనీ, ఇద్దరిలో ఒకరిని విడదీశావా దేముడా అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.
చెదిరిన కల
నూకరాజు, వరహాలమ్మ నిరు పేదలు. ఎటువంటి ఆస్తులు లేకపోవడంతో కూలి పనులు చేసికుని ఇద్దరు కుమారులను చదివించుకుంటున్నారు. వారిద్దరినీ ప్రయోజకుల్ని చేయాలని ఎన్నో కలలు కన్నారు. మూడేళ్ల క్రితమే పెద్ద కుమారుడు శివను రావికమతం మండలం మరుపాక మోడల్ స్కూల్ జాయిన్ చేయగా.. ఇటీవల ఐదో తరగతి పూర్తి చేసిన అశోక్‌ను కూడా అదే పాఠశాలలోనే చేర్చారు. పది రోజుల కిందటే పాఠశాలలో జాయిన్ అయిన అశోక్ అన్నయ్యతో కలిసి గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదం జరిగింది. అశోక్ మృతితో తోటి విద్యార్ధులతోపాటు తల్లిదండ్రులు, గ్రామస్తులు భోరున విలపిస్తున్నారు. పొట్టకూటి కోసం అశోక్ తండ్రి నూకరాజు హైదరాబాద్‌లో కూలిపనుల కోసం నెల రోజుల కిందట వెళ్లాడు. అశోక్ సర్పంచ్ కూరాకుల ముత్యాలరావుకు స్వయాన మేనల్లుడు. ప్రమాద సంఘటన తెలిసుకుని ప్రయాణంలో ఉన్న ఆయన నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి వెళ్లి తన మేనల్లుడు మృతదేహాన్ని చూసి విలపించాడు.
Comments
Please login to add a commentAdd a comment