మొయినాబాద్(చేవెళ్ల) : రాత్రి సమయంలో క్యాబ్ బుక్ చేసిన దుండగులు నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి డ్రైవర్‌ను కొట్టి క్యాబ్‌తో ఉడాయించారు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై నయీముద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపూర్ గ్రామానికి చెందిన చింతం మల్లేష్ రెండు సంవత్సరాల నుంచి హయత్‌నగర్ మండలం గుర్రంగూడలో ఉంటూ ఓనర్ కం డ్రైవర్‌గా ఉబెర్ క్యాబ్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు.
మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో నగరంలోని లంగర్‌హౌస్‌లో ముగ్గురు యువకులు క్యాబ్ బుక్ చేసుకున్నారు. మొయినాబాద్ మండలం తోలుకట్ట వరకు వెళ్లాలని చెప్పారు. తోలుకట్టకు చేరుకున్నాక గమ్యస్థానం వచ్చిందని డ్రైవర్ మల్లేష్ కారు ఆపగా.. ఇంకా రెండు కిలోమీటర్లు వెళ్లాలని చెప్పారు. దాంతో కారును డ్రైవర్ మల్లేష్ ముందుకు నడిపాడు. కాస్త ముందుకు వెళ్లాక నిర్మాణుష్య ప్రాంతంలో కారు ఆపమన్నారు.
కారు ఆపగానే ఇద్దరు యువకులు కారులో నుంచి దిగి మల్లేష్‌ను కొట్టి బయటకు లాగారు. ముందుసీట్లో కూర్చున్న యువకుడు డ్రైవర్ సీట్లోకి వచ్చి కారు తీస్తుండగా ఇద్దరు యువకులు కార్లో ఎక్కి పారిపోయారు. డ్రైవర్ సెల్‌ఫోన్, ఒరిజినల్ లైసెన్స్ కారులోనే ఉన్నాయి. దీంతో క్యాబ్ డ్రైవర్ లబోదిబోమంటూ మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
క్యాబ్ డ్రైవర్‌ను కొట్టి కారు ఎత్తుకెళ్లిన దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. కేసును ఛేదించేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు. లంగర్‌హౌస్‌లో కాబ్ బుక్ చేసినప్పటి నుంచి కారు ఎక్కడెక్కడికి వెళ్లిందో ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. క్యాబ్ బుక్ చేసిన సెల్ నెంబర్ ఆధారంగా దుండగులు ఏ లోకేషన్‌లో ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీలైనంత త్వరగా దుండగులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment