తెనాలి గడ్డ...పేకాట అడ్డా..! | cards clubs and gambling in thenali city | Sakshi
Sakshi News home page

తెనాలి గడ్డ...పేకాట అడ్డా..!

Published Sat, Nov 18 2017 11:48 AM | Last Updated on Sat, Nov 18 2017 11:48 AM

cards clubs and gambling in thenali city - Sakshi

జూదం.. తెనాలిలో మళ్లీ షో అంటోంది. రాజు, రాణీ, జాకీ.. కాయ్‌ రాజా కాయ్‌ అంటూ పలవరిస్తోంది. లోనా, బయటా అంటూ ఊరిస్తోంది. కోట్ల రూపాయలతో పందెం కాస్తూ పోలీసులను జోకర్లను చేస్తోంది. రాజధాని  గ్రామాల నుంచీ పేకాటరాయుళ్లు తరలివస్తున్నారు. విజయవాడ నగరంలోని ఒక ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ఇక్కడే పేకాటలో తరిస్తున్నాడు. మొత్తంగా ఆంధ్రాప్యారిస్‌ మినీ క్లబ్‌గా మారిపోయింది.

తెనాలి : ఆంధ్రాప్యారిస్‌గా పిలుచుకొనే తెనాలికి ఆ పేరు ఎలా వచ్చిందనే అంశంపై భిన్నవాదనలు తెలిసిందే. అన్నీ పక్కన బెడితే, ప్యారిస్‌లో ఉన్నట్టుగా జూదం, వినోదం ఇక్క డ మస్తు. పరిసరాల్లోని వందకుపైగా గ్రామాలకు కూడలి అయినందున జనం తాకిడి అధికం. పూర్వం నుంచి వ్యభి చారం, పేకాట క్లబ్బులకు పెట్టింది పేరు. ఆధునికతతో అం దివచ్చిన వ్యసనాలనూ పట్టణం వంట బట్టించుకుంది. సిం గిల్‌ నంబర్‌ లాటరీ.. ఒక ఊపు ఊపింది. జనం గుల్లయిపోయారు. రిక్రియేషన్‌ పేరుతో క్లబ్‌లూ నడిచాయి. మహిళల తిరుగుబాటుతో రెండు దశాబ్దాలుగా క్లబ్‌లలో పేకాట బం దయింది. రెండు క్లబ్‌లు బార్‌ అండ్‌ రెస్టారెంట్లుగా మారా యి. జిమ్, క్రీడల సహా రమ్మీ కోసం ఇటీవల ఓ క్లబ్‌ను ఆధునికీకరించి సిద్ధం చేస్తే, పోలీసులు అడ్డుకోవటం తెలిసిందే.

అధికార పార్టీ నేతల కనుసన్నల్లో మినీక్లబ్బులు...
ఈ నేపథ్యంలో పట్టణంలో జూదం మళ్లీ జడలు విప్పింది. పేకాటలో ఆరితేరిన అధికార తెలుగుదేశం పార్టీ ఛోటా నేతల నేతృత్వంలో పలు చోట్ల మినీ క్లబ్‌లు వెలిశాయి. ఊరి శివారుల్లో, పంట పొలాల్లో నాలుగైదు క్లబ్‌లున్నాయి. వీటిలో కోతముక్కాట అడ్డూఅదుపూ లేకుండా సాగుతోంది. ఐతానగర్‌లో రెండు, పినపాడు నుంచి దుండిపాలెం వెళ్లే డొంకరోడ్డులో తెనాలి, చుండూరు సరిహద్దుల్లో ఒకటి, అక్కడకు కొంచెం దూరంలోని పంట పొలం పాకలో భారీ జూదం జరుగుతోంది. మారీసుపేటలో స్థానిక ప్రజాప్రతినిధి బంధువు అడ్డాలో నడిచే పేకాట క్లబ్‌లో కొందరు పోలీసులూ ఆటగాళ్లేనట! చంద్రబాబు కాలనీలో ఓ వ్యాపారి ఇంట్లో పేకాట లేనిదే తెల్లవారదని వ్యసనపరులు చెబుతున్నారు. అమరావతి ప్లాట్స్, బోసురోడ్డులోని వ్యాపారకూడలిలో, నాజరుపేటలోని ఓ గుడి సమీపంలో, చెంచుపేటలోని ఓ హోటల్‌లో...ఇలా పట్టణంలో అన్నీ కలిపి 30 మినీక్లబ్‌లు నడుస్తుండగా, పదింటిలో భారీస్థాయిలో పేకాట సాగుతోంది.  మరికొన్ని ప్రైవేటు ఇళ్లలో ఒక్కో టేబుల్‌ చొప్పున క్లబ్‌లు నిర్వహిస్తున్నారు.

రోజుకు చేతులు మారుతున్న రూ.3 కోట్లు
కోతముక్కాట ఆడే బరిలో కోటి రూపాయలు చేతులు మారుతుంటే, ఓకుకు రూ.50, రూ.100 చొప్పున జరిగే రమ్మీతో సహా రోజుకు హీనపక్షం రూ.3 కోట్లు చేతులు మారుతున్నాయి. కోతముక్కాటలో పాల్గొనే వ్యక్తి రూ.3 వేలు చెల్లించాలి. కనీసం రూ.5 లక్షలు జేబులో ఉండాలట! దాదాపు 20 మంది పాల్గొనే ఈ ఆటలో బరి కోసమే రూ.60 వేలు తీస్తున్నారు. రమ్మీ ఆట క్లబ్‌లలో ఒక్కో ఆటకు రూ.100, రూ.150 వంతున కేటాయిస్తున్నారు. అంటే రోజుకు కనీసం రూ.10 నుంచి రూ.15 వేల వరకు ఆదా యం. ఒక్కో క్లబ్‌కు నలుగురైదుగురు వేగులు. పోలీస్‌స్టేషను ముందు నుంచి, క్లబ్‌ వరకు ఉండే వేగులు పోలీసు వాసనను ఇట్టే పసిగట్టేసి హెచ్చరికలు చేస్తారు. ఆట పడిన రోజుల్లా ఒక పోలీస్‌స్టేషన్‌కు చెందిన నలుగురు కానిస్టేబుళ్లకు రూ.3 వేలు చొప్పున మామూళ్లు చెల్లిస్తారట. రైడింగులుంటే ముందే సమాచారం వచ్చేలా పక్కాగా ప్లాను చేసుకున్నారు.

పేకాట జోలికొస్తే ఖబడ్దార్‌...!
తెనాలిలో పేకాటకు రాజధాని గ్రామాలు, విజయవాడ నుంచీ ఆటగాళ్లు వస్తున్నారు. విజయవాడలోని ఓ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడికి ఇక్కడి పేకాట బరికి రాకుంటే నిద్ర పట్టదంట! ఊరి వెలుపల ఓ గుడి వద్ద, ఆర్టీసీ బస్టాండు వెలుపల, రైల్వేస్టేషనులోనూ వాహనాలను పార్క్‌ చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 11 గంటల మధ్య జరిగే ఈ పేకాటలో కొన్ని చోట్ల కోతముక్కను తెల్లవారుజాము 4 గంటల నుంచి 7.30 గంటల మధ్య ఆడుతున్నారు. పేకాట జోలికొస్తే ప్రజాప్రతినిధులూ ఊరుకోవటం లేదు. సమీప అంగలకుదురులో ఈ వారంలో వనభోజనాల్లో పేకాడుతున్న వారిపై పోలీసులు దాడి చేశారు. దాదాపు రూ.38 లక్షల నగదు బరిలో ఉందని తెలిసింది. మండల, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు జోక్యంతో పోలీసులు మౌనంగా తిరిగి వెళ్లినట్టు సమాచారం. ఇటీవల బోసురోడ్డులోని ఓ హోటల్‌లో పట్టుబడిన ఆటగాళ్లను వదిలేశారు. చేసేదిలేని పోలీసులు ఏ అండా లేని బక్క ఆటగాళ్ల బరులపై దాడులు చేస్తూ కేసులు కడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement