మల్లేష్ వీపుపై గాయాలు
మొయినాబాద్: బియ్యం పంపిణీ ఫొటోను వాట్సాప్‌లో పోస్టు చేసి సర్పంచ్ పేరు పెట్టలేదని ఓ యువకుడిపై సర్పంచ్, అతడి అనుచరులు దాడి చేసి చితకబాదారు. ఈ సంఘటన మండల పరిధిలోని శ్రీరాంనగర్‌లో చోటుచేసుకుంది. మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ జానయ్య తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని శ్రీరాంనగర్ గ్రామానికి చెందిన కౌకుంట మల్లేష్‌గౌడ్ అనే యువకుడు శనివారం గ్రామంలో బియ్యం పంపిణీ చేసిన ఫొటోను గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశాడు. గ్రామ ఎంపీటీసీ సభ్యుడు బియ్యం పంపిణీ చేస్తున్నాడని రైటప్ కూడా పెట్టాడు. అందులో సర్పంచ్ పేరు పెట్టకపోవడంతో సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరులు 15మంది మల్లేష్ ఇంటికి వెళ్లి అతడి అన్నను, తల్లిదండ్రులను బెదిరించారు. తరువాత వ్యవసాయ బావి వద్ద ఉన్న మల్లేష్ వద్దకు వెళ్లి అతడిపై దాడిచేసి చితకబాదారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి పేకాట ఆడుతుంటే వచ్చి కొట్టారని మల్లేష్‌తోనే లెటర్ రాయిస్తుండగా ఎంపీటీసీ సభ్యుడు రాంరెడ్డి వచ్చి అడ్డుకున్నారు. 100కు డయల్ చేయడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వివరాలు తెలుసుకుని మల్లేష్‌ను ఆసుపత్రికి తరలించారు. మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదుతో సర్పంచ్‌తోపాటు మరో 15మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
మల్లేష్‌పై దాడి చేయలేదు
సర్పంచ్‌గా గ్రామంలో అనేక పనులు చేపడుతున్నా మల్లేష్ సోషల్ మీడియాలో తన పేరు లేకుండా ఎంపీటీసీ సభ్యుడు పేరుతో ఫొటోలు పోస్టు చేస్తున్నాడు. బియ్యం పంపిణీ చేసిన సందర్భంలోనూ అదే విధంగా పోస్టు చేశాడు. ఆ విషయాన్ని మేం పట్టించుకోలేదు. మల్లేష్ పేకాట ఆడుతుండగా చూసిన కొందరు యువకులు అతన్ని కొట్టారు. నేను మాత్రం అతనిపై దాడి చేయలేదు.
– ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్, శ్రీరాంనగర్
Comments
Please login to add a commentAdd a comment