సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర ముఠాల దొంగలు నగరంపై పంజా విసురుతున్నారు. వరుస దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రోజు రోజుకూ ఈ ముఠాల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఉత్తరాదిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ గత వారం కిందట హైదరాబాద్‌లో అడుగుపెట్టి పోలీసులకు సవాల్ విసురుతోంది. తాజాగా మేడ్చల్ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ దొంగలు సంచరిస్తున్నారు. ఈ విషయంపై రాచకొండ కమిషనర్ మహేష్ భగత్ పోలీసులను అప్రమత్తం చేశారు. కమిషనర్ ఆదేశాలతో గస్తీ తీవ్ర తరం చేసిన పోలీసు సిబ్బంది నగర శివారులోని ఘట్ కేసర్‌లోని పలు సీసీ టీవీలను పరిశీలించారు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే అన్నోజిగూడలోని మోదీ ఎమరాల్డ్ పార్క్ కాలనీలో చెడ్డీ గ్యాంగ్ కదలికలు కనిపించాయి. దీంతో మరింత అప్రమత్తమైన రాచకొండ పోలీసులు ఈ గ్యాంగ్‌ను పట్టుకొనేందుకు గాలింపు చేపట్టారు. అదే విధంగా గ్యాంగ్‌కు సంబంధించిన పలు విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను కమిషనర్ మహేష్ భగత్ తెలిపారు.
ఇదీ గ్యాంగ్ చరిత్ర
ఈ ముఠా సభ్యులు ఫాసే పార్థి అనే తెగకు చెందిన వారు. ఈ తెగలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ తెగ గత 18 ఏళ్లుగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మద్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఏపీలలో దోపిడీలకు పాల్పడ్డారు. కానీ ఎక్కడా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగారు. చివరిగా ముబై పోలీసులు గత ఏడాది బోరవెల్లిలో కాల్పులు జరిపి ఈ గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు బెంగళూరు, మహారాష్ట్రల్లో దోపిడీలకు పాల్పడ్డ చడ్డీ గ్యాంగ్ తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో సంచరిస్తున్నట్టు ఆధారాలు లభించాయి. ఈ గ్యాంగ్‌లో ఐదు నుంచి ఆరుగురు లేదా ఎనిమిది నుంచి పది మంది సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లేవారు, ఇండిపెండెంట్ ఇళ్లే ఈ గ్యాంగ్ టార్గెట్. సిసి టీవీ ఫుటేజీలను పరిశీలించేటప్పుడు ఈ గ్యాంగ్ సభ్యులు ఆయుధాలతో సంచరించడం కనిపించింది. ఈ గ్యాంగ్ సభ్యులు చెడ్డీలు, బనియన్లు ధరించి ముఖానికి ముసుగు వేసుకుని దోపిడీలకు పాల్పడతారు. ముఖ్యంగా నిర్మానుషమైన కాలనీలలో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి దోపిడీ చేస్తారు.
మరో పేరు కచ్చా బనియన్
చెడ్డీ గ్యాంగ్ మరో పేరు కచ్చా బనియన్ గ్యాంగ్. శరీరానికి ఒండ్రు మట్టి లేదా నూనె రాసుకుని సంచరిస్తారు. పగలు కుర్తా మరియు లుంగీలు ధరించి రెక్కీ నిర్వహిస్తారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్.. కాలనీలలో ఉన్న ఖాళీ ప్రదేశాలలో బస చేస్తారు. పగలు బిచ్చగాళ్లగా.. కూలీల మాదిరి నటిస్తూ కాలనీలలో తిరుగుతారు. తాళం వేసి ఉన్నఇళ్లను గుర్తించి అర్థరాత్రి దోపిడీ చేస్తారు. ఈ ముఠా రెండుమూడు ఇళ్లలో ఒకేసారి చోరీ చేయగల నేర్పరులు. దొంగతనం చేసే సమయంలో ఇంటి సభ్యులు ఉంటే వారిని కట్టేస్తారు.. ఒకవేళ ఎదురుతిరిగితే చంపడానికి కూడా వెనుకాడరు. ఈ గ్యాంగ్ కొన్ని సార్లు దోపిడీ చేసిన ఇంట్లోనే భోజనం చేసి అక్కడే మలమూత్ర విసర్జన చేసి జుగుప్సాకరంగా ప్రవర్తిస్తారు.
తీసుకోవాల్సిన చర్యలు
నిర్మానుష్యమైన కాలనీలలోని అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్లకు వారి దృశ్యాలు చూపించి పోలీసులు అవగాహన కల్పించాలి. తమ తమ పరిసర ప్రాంతాల్లో అనుమానంగా తిరుగుతున్న వారి గురించి సమాచారం అందించాలని ప్రజలకు విఙ్ఞప్తి చేయాలి. స్థానిక యువకులతో కలిపి గస్తీ బృందాలను ఏర్పాటు చేసుకునే దిశగా ప్రోత్సహించాలి. అన్నీ ఏరియాల్లో సీసీటీవీలతో భద్రత పెంచుకునే దిశగా ప్రజలకు అవగహన కల్పించాలి. గస్తీకి వెళ్లేటప్పుడు పొలీసులు తప్పకుండా ఆయుధాలు ధరించాలి. గస్తీ పోలీసులకు గ్యాంగ్ సమాచారం తెలిసిన వెంటనే కంట్రోల్ రూమ్‌కు తెలిపి. అక్కడ నుంచి ఉన్న ప్యాట్రోల్ కార్స్ కి, సిబ్బంది, బోడెరింగ్ పోలీస్ స్టేషన్స్‌ను కూడా అలర్ట్ చేయాలి.
వణికిస్తున్న చెడ్డీ గ్యాంగ్
Comments
Please login to add a commentAdd a comment