బాధితురాలు కమలమ్మ, సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు
పరకాల : మాయమాటలతో వృద్ధురాలి మెడలోని రెండు తులాల పుస్తెల తాడు అపహరించిన సంఘటన ఆదివారం పరకాల పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. శాయంపేట మండలం జోగంపల్లి గ్రామానికి చెందిన గోరంట్ల కమలమ్మ అనే వృద్ధురాలు ఆదివారం సంత కావడంతో పరకాల పట్టణానికి చేరుకుంది. ఎండకు భరించలేక కాసేపు సేదతీరేందుకు బంగారం దుకాణం ముందు కూర్చున్న సమయంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి .. తెలిసిన వ్యక్తిలా ఎంతో అప్యాయంగా పలకరించాడు.
‘బాగున్నావా.. అంటే బాగున్నాను..’ అంటూ సమాధానం ఇచ్చింది. కొంతసేపు ముచ్చటపెట్టినట్టే పెట్టి తన భార్య ఫొటో దిగుతుందని..మెడలో పుస్తెల తాడు ఇస్తే మళ్లీ తీసుకొచ్చి ఇస్తానని నమ్మపలికాడు. అరగంట సేపయినా తిరిగి రాకపోవడంతో వృద్ధురాలు లబోదిబోమనటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ జానీ నర్సింహులు, ఎస్సై రవీందర్‌లు వృద్ధురాలు కూర్చున్న స్థలం వద్ద బంగారం దుకాణం ఉండటంతో సీసీ çఫుటేజీని పరిశీలించారు. వృద్ధురాలి మెడలో పుస్తెలు తాడు ఉన్న మాట వాస్తవంగా నిర్ధారణ చేసుకొని..మాయమాటలతో ఎత్తుకెళ్లిన వ్యక్తి గురించి గాలించారు. తెలిసిన వ్యక్తే వృద్ధురాలి పుస్తెలు తాడు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment