
విజయవాడ, ప్రత్తిపాడు : యువకులు మద్యం సేవించి సినిమా హాల్‌లో వీరంగం సృష్టించిన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెరుకుపల్లి మండలం బొలుసుపాలెంకు చెందిన షేక్ సంధాని, షేక్ ఇలియాస్, గుంటూరు ఆర్టీసీ కాలనీకి చెందిన వసీం అక్రమ్ గురువారం రాత్రి గుంటూరులోని ఓ శుభకార్యానికి వచ్చారు. ఫంక్షన్ ముగిసిన అనంతరం ప్రత్తిపాడులో ఉన్న బంధువుల ఇంటికి వచ్చారు. రాత్రి పూటుగా మద్యం సేవించి స్థానిక మారుతి థియేటర్‌లో సెకండ్ షో సినిమాకు వెళ్లారు.
కొద్దిసేపటి తరువాత థియేటర్ లోపల నుంచి భారీ శబ్ధం రావడంతో టిక్కెట్లు ఇచ్చే చేపర్తి వెంకటశివ లోపలకు వెళ్లి గమనించాడు. కుర్చీలు విరగ్గొట్టి ఉండటంతో ఇదేమని యువకులను మందలించడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరలా కొద్ది సమయం తరువాత సినిమా హాల్‌కు వచ్చిన యువకులు నానా హంగామా సృష్టించారు. థియేటర్‌లోని లైట్లు పగులగొట్టడంతో పాటు 25 కుర్చీలు విరగ్గొట్టి, తెరను చింపేశారు. అడ్డు వచ్చిన టిక్కెట్‌లు ఇచ్చే చేపర్తి శ్రీనివాసరావుతో పాటు హాల్ సిబ్బంది, మరికొందరిపై కుర్చీలతో దాడి చేశారు. శ్రీనివాసరావు తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ మేరకు శుక్రవారం బాధితుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ప్రత్తిపాడు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment