
సాక్షి, హైదరాబాద్: తన భర్త హత్య వెనుక శిఖా చౌదరి ప్రమేయం ఉందని ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం భార్య పద్మశ్రీ ఆరోపించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. శిఖా ప్రమేయం లేకుంటే తన భర్త చనిపోయేవారు కాదని అన్నారు. తమ ఆస్తులు లాక్కునేందుకే ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేయిందని ఆమె ఆరోపించారు. ఆమె వ్యవహారం చూసి తన భర్తకు ప్రాణహాని ఉందని ఐదేళ్ల క్రితమే భయపడినట్టు వెల్లడించారు. హత్యకు ప్లాన్ చేసింది శిఖాయేనని స్పష్టం చేశారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు బయటపడతాయన్నారు.
పేద అమ్మాయి అయిన శిఖా చౌదరి నేడు బిఎండబ్ల్యూ కారులో ఎలా తిరుగుతోందని ప్రశ్నించారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిందని, డబ్బు కోసం ఆమె ఎంతకైనా తెగిస్తుందని మండిపడ్డారు. అలాంటి అమ్మాయి తమ ఇంట్లో ఉండటం దురదృష్టమన్నారు. జయరాం చనిపోయిన కబురు తెలిసినా తర్వాత నందిగామ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. జయరాం ఇంటికి వెళ్లి పలు కీలక పత్రాలు, విలువైన వస్తువులు తీసుకుపోయిందని ఆరోపించారు. ఎక్స్‌ప్రెస్ టీవీలో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించిన తర్వాతే ఆ చానల్ నాశమైందన్నారు. (శిఖా ప్రియుడే హంతకుడు)
రాకేష్ రెడ్డి ఎవరో తనకు తెలియదన్నారు. జయరాంకు రాకేష్‌రెడ్డి నాలుగున్నర కోట్ల రూపాయలు ఇచ్చారనడంతో వాస్తవం లేదని చెప్పారు. శిఖా చౌదరికే చెక్ పవర్ ఉందని వెల్లడించారు. తన భర్త అంత్యక్రియలకు ఆయన తరపు దగ్గర బంధువులు ఎవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జయరాంకు మహిళలతో సంబంధాలున్నాయని వింటుంటే బాధగా ఉందని పద్మశ్రీ అన్నారు. తన భర్తతో ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. (ఎవరీ రాకేష్ రెడ్డి..?)
Comments
Please login to add a commentAdd a comment