క్రీడల్లో ప్రతిభావంతులు.. సరదా కోసం వాహనాల చోరీలు | College Students Arret in Vehicle Stolen Case Hyderabad | Sakshi
Sakshi News home page

ఎంజాయ్‌.. గంజాయ్‌!

Published Sat, Mar 23 2019 12:13 PM | Last Updated on Sat, Mar 23 2019 12:13 PM

College Students Arret in Vehicle Stolen Case Hyderabad - Sakshi

పోలీసులు అరెస్టు చేసిన నిందితులు, స్వాధీనం చేసుకున్న వాహనాలు

సాక్షి, సిటీబ్యూరో:  మర్కా అరుణ్‌కుమార్‌.. వయసు 20 ఏళ్లు. డిగ్రీ విద్యార్థి.. నమోదైన కేసులు 19మనీష్‌ ఉపాధ్యాయ.. వయసు 20.. ఇంటర్మీడియట్‌ స్టూడెంట్‌.. కేసులు 18సంజయ్‌ సింగ్‌.. వయసు 22..
ఇంటర్‌ విద్యార్థి.. కేసులు 25అఖిల్‌ కుమార్‌.. వయసు 20 ఏళ్లు..ఇంటర్‌ విద్యార్థి.. కేసులు 9 నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం అరెస్టు చేసిన ఘరానా గ్యాంగ్‌ లీడర్‌తో పాటు మరో ముగ్గురు సభ్యుల నేపథ్యమిది. క్రైమ్‌ చేయాల్సిన అవసరం లేని ఈ గ్యాంగ్‌ నేరబాట పట్టడం వెనుక జాయ్‌ రైడింగ్, గంజాయికి బానిసత్వం ప్రధాన కారణాలుగా మారాయి. ఈ నలుగురినీ చిలకలగూడ పోలీసులు శుక్రవారం జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. నగర పోలీసులకు.. అందునా టాస్క్‌ఫోర్స్‌కు నిత్యం అనేక మంది నేరగాళ్లు చిక్కుతూ ఉంటారు. విచారణలో హృదయవిదార అంశాలు బయటకు వస్తుంటాయి. కుటుంబ నేపథ్యం, అవసరాలు, బాధలు, కష్టాలు, వైద్యావసరాలు.. ఇలా వివిధ కారణాలతో నేరబాటపట్టామని చాలామంది చెబుతుంటారు. అయితే, ఈ స్టూడెంట్స్‌ గ్యాంగ్‌ తీరే వేరు. ఈ నలుగురు విద్యార్థుల్లో అందరి తండ్రులూ ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు చేస్తున్నవారే. అరుణ్‌ తండ్రి ఆర్మీ రిటైర్డ్‌ కాగా, మనీష్‌ తండ్రి ప్రైవేట్‌ ఉన్నతోద్యోగి, సంజయ్‌ తండ్రి వ్యాపారం చేస్తుండగా అఖిల్‌ తండ్రి నేవీలో పని చేసేవారు. ఈ నేపథ్యంలో ఈ నలుగురిలో ఎవరికీ కుటుంబ బాధ్యతలు, బా ధలు, సంపాదించాల్సిన అవసరాలు గాని లేవు. 

సరదా కోసం మొదలై..
అయినప్పటికీ వీరు నేరబాట పట్టడం వెనుక సరదా కోణం ఉంది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని విద్యాసంస్థలో విద్యనభ్యసించిన అరుణ్, అఖిల్‌ స్నేహితులు. ఈ నలుగురిలో కొందరికి ద్విచక్ర వాహనాలపై షికార్లు చేయడమంటే చాలా ఇష్టం. అయితే, ఆ వయసులో తల్లిదండ్రులను అడిగినా వాహనాలు కొనివ్వరనే ఉద్దేశంతో అనువైన ప్రదేశాల నుంచి వాహనాలను దొంగిలించడం మొదలెట్టారు. తొలినాళ్లలో వీటిని కేవలం విహరించడానికి మాత్రమే వాడేవారు. పెట్రోల్‌ ఎక్కడ అయిపోతే అక్కడే వాహనాన్ని పడేసి పోయేవారు. దీన్నే పోలీసుల సాంకేతిక పరిభాషలో ‘జాయ్‌ రైడింగ్‌’ అంటారు. ఇలా కొన్నాళ్లు చేసిన తర్వాత ఒక్కోక్కరికీ ‘కొత్త పరిచయాలు’ ఏర్పడ్డాయి. 

క్రికెట్‌లో ఒకరు..ఫుట్‌బాల్‌లో మరొకరు..
ఈ గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరించిన అరుణ్‌ కుమార్‌లో మంచి క్రికెట్‌ ప్లేయర్‌ కూడా ఉన్నాడు. గతంలో హైదరాబాద్‌ తరఫున అండర్‌ 16 మ్యాచెస్‌లో ప్రాతినిథ్యం వహించాడు. ఖాళీ దొరికినప్పుడల్లా పరేడ్‌ గ్రౌండ్స్‌కు వచ్చి ప్రాక్టీసు చేస్తూ ఉండే ఇతడికి అక్కడే టొమాటో సంజయ్‌ పరిచయమయ్యాడు. అప్పటికే గంజాయికి అలవాటుపడ్డ ఇతగాడు ఆ జాఢ్యాన్ని అరుణ్‌కూ అంటించాడు. మంచి ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ అయిన అఖిల్‌ స్పోర్ట్స్‌ కోటాతో పాటు తన ప్రతిభతో ఆర్మీకి ఎంపికయ్యాడు. అయితే, గతేడాది ఇతడిపై కుషాయిగూడ ఠాణాలో ఓ బెదిరింపుల కేసు నమోదైంది. ఈ కేసులో జైలుకు కూడా వెళ్లి రావడంతో పోలీసుల నుంచి నిరభ్యంతర పత్రం జారీ కాలేదు. దీంతో ఆ ఉద్యోగంలో చేరలేకపోయాడు. దీంతో అరుణ్‌తో స్నేహం కొనసాగించాడు.

నలుగురూ కలిసి ‘కొత్త బాట’
ఈ ముగ్గురికీ మనీష్‌ ఉపాధ్యాయ కూడా తోడవడంతో నలుగురూ కలిసి ముఠా కట్టారు. గంజాయి తాగడంతో పాటు జల్సాలు పెరిగాయి. దీంతో జాయ్‌ రైడింగ్‌ కోసం మొదలైన బైక్‌ చోరీలు వాటిని విక్రయించే వరకు వెళ్లాయి. ఇలా వస్తున్న డబ్బు కూడా చాలకపోవడం, తమ ‘ఖర్చులకు’ ఇళ్లల్లో అడిగే ఆస్కారం లేకపోవడంతో ‘ప్రత్యామ్నాయ’ మార్గాలు అన్వేషించారు. దీంతో చోరీ చేసిన వాహనాలపై నిషాలో తిరుగుతూ స్నాచింగ్స్‌ చేయడం మొదలెట్టారు. ఓ దశలో ఇళ్లల్లోనూ చోరీలు చేయడం మొదలెట్టి రాచకొండ పోలీస్‌ కమిషరేట్‌ పరిధిలోని మేడిపల్లిలో ఓ ఇంటికి కన్నం వేశారు. అక్కడ నుంచి 20 గ్రాములు వెండి వస్తువులు, డబ్బు ఎత్తుకుపోయారు. 

పీటీ వారెంట్ల దాఖలుకు సన్నాహాలు
నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్న ఈ ముఠాను ప్రాథమికంగా చిలకలగూడ ఠాణాకు అప్పగించారు. కోర్టులో హాజరు పరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించిన అధికారులు.. తదుపరి విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ గ్యాంగ్‌పై చిలకలగూడతో పాటు గోల్కొండ, మారేడ్‌పల్లి, ఉస్మానియా యూనివర్శిటీ, మేడిపల్లి, నేరేడ్‌మెట్‌లో కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా ఠాణాల అధికారులు ప్రిజనర్స్‌ ట్రాన్సిట్‌ (పీటీ) వారెంట్‌పై ఆయా కేసుల్లో నిందితులను అరెస్టు చేయనున్నారు. తల్లిదండ్రులు టీనేజ్‌లో ఉన్న తమ పిల్లలపై కన్నేసి ఉంచాలని అధికారులు కోరుతున్నారు. వారిపై పర్యవేక్షణ కొరవడితే ఇలాంటి దుష్ఫరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement