సాక్షి, చెన్నై: విద్యార్థి గ్రూపుల దాడులతో చెన్నైలో ఓ రైల్వే స్టేషన్ అట్టుడికింది. విద్యార్థులు రెండు గ్రూపులుగా మారి.. కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన చెన్నై శివారులోని అంబత్తూరు-కొరట్టూరు నడుమ పట్టరైవాకంలో చోటుచేసుకుంది. చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరిన లోకల్ ట్రైన్ పట్టరైవాకం స్టేషన్‌కు చేరుకోగానే అందులో నుంచి దిగిన రెండు గ్రూపుల విద్యార్ధులు కత్తులతో ఒకరిపై మరొకరు దాడులకు దిగారు.
కొందరు విద్యార్థులు కత్తులు ప్రదర్శిస్తూ.. మరో వర్గం విద్యార్థులను వెంబడించి మరీ దాడులు చేశారు. ఈ ఘటనతో అదే రైల్లో ఉన్న ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. విద్యార్ధుల పరస్పర దాడులతో రైల్వేస్టేషన్ దద్దరిల్లింది. ఈ దాడుల అనంతరం విద్యార్ధులు అదే రైల్లో వెళ్లిపోవడం గమనార్హం. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలైనట్టు తెలుస్తోంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై స్టేషన్ మేనేజర్ ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. దాడులు చేసుకున్న విద్యార్థులను గుర్తించేందుకు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా ఈ దాడులను తమ సెల్‌ఫోన్ల ద్వారా రికార్డు చేసిన వారిని నుండి వీడియోలు తీసుకుని.. ఆరా తీస్తున్నారు. రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేసిన సదరు మూకను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. విద్యార్ధు గ్రూపుల గ్యాంగ్‌వార్ ఘటన చెన్నైలో కలకలం రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment