ఎస్పీ అట్టాడ బాబూజీకి ఫిర్యాదు అందజేస్తున్న మంత్రి అయ్యన్న సోదరుడు సన్యాసిపాత్రుడు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడి హత్యకు కుట్ర జరుగుతుందంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వదంతులు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కుటుంబంలోని వ్యక్తులే బయటివారితో చేతులు కలిపి అయ్యన్నని హతమార్చేందుకు కుట్ర పన్నుతున్నారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతుండగా, వారు మంత్రి అయ్యన్న పాత్రుడ్ని హతమార్చడానికి కుట్ర పన్నేందుకే అక్కడ సమావేశమైనట్టుగా చూపించారు. సన్యాసిపాత్రుడు కుమారుడు వరుణ్ దీనిని ఖండిస్తూ తన తండ్రి ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ఓ పథకం ప్రకారం కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి సన్యాసి పాత్రుడు విశాఖ పట్నంలో జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీని కలిసి వినతిపత్రం సమర్పించారు.
కావాలనే కుట్ర చేస్తున్నారు: సన్యాసిపాత్రుడు
తనపై ఓ పథకం ప్రకారమే దుష్ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసిపాత్రుడు ఎస్పీకి అందజేసిన లేఖలో ఆరోపించారు. ఈ నెల 21న నర్సీపట్నం సత్యకాంప్లెక్స్‌లో తన స్నేహితుడు షేక్ అల్లా ఉద్దీన్ కుమార్తె వివాహానికి తన బంధువు చింతకాయల రమణ, గన్‌మెన్‌లతో కలిసి తాను హాజరయ్యానని, ఆ ఫంక్షన్‌కు నాతవరానికి చెందిన పలువురు ప్రతిపక్ష నేతలు కూడా హాజరయ్యారన్నారు. వరండాలో మెట్లు దిగుతున్న సమయంలో వారు ఎదురవడంతో మర్యాదపూర్వకంగా పలుకరించుకున్నామన్నారు. ఆ సమయంలో సీసీ టీవీ పుటేజ్ సేకరించి.. ఆ దృశ్యాలను తమకు అనుకూలంగా క్రోడీకరించి.. తన సోదరుడిని హత్య చేసేందుకు తామంతా ఏదో కుట్ర చేసేందుకు సమావేశమైనట్టుగా ఒక తప్పుడు వీడియోను సృష్టించి వైరల్ చేశారని ఆరోపించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈవీడియో వెనుక ఉన్నదెవరో గుర్తించి చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment