గలీజ్‌ పోలీస్‌! | Constable Harassments on Love Couples In Warangal | Sakshi
Sakshi News home page

గలీజ్‌ పోలీస్‌!

Published Fri, Apr 20 2018 1:09 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

Constable Harassments on Love Couples In Warangal - Sakshi

స్టేషన్‌కు పద..లేకుంటే సమర్పించాలె. ఎక్కడైన చెబితే మీ సంగతి ఫోన్‌లో ఉంది.. ఇక మీ ఇష్టం!

ఇటీవల సదరు కానిస్టేబుల్‌కు ఓ ప్రేమ  జంట కనపడింది. వారి నుంచి దోచుకోవడమే కాకుండా మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు..?

వరంగల్‌ క్రైం: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఓ యువతితో ఎస్సై అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన మరువక ముందే మరొకటి వెలుగు చూసింది. కొద్దికాలంగా వరంగల్‌ ఉర్సు గుట్ట అడ్డాగా ఒంటరి మహిళలు, ప్రేమికులే లక్ష్యంగా దారి దోపిడీ, అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఓ కీచకుడిని పోలీసులు ఎట్టకేలకు వలపన్ని పట్టుకున్నారు. ఇంతకాలం కీచక పర్వం కొనసాగించిన సదరు ప్రబుద్ధుడు పోలీసు శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ కావడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు నివ్వెరపోయారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ద్వారా ప్రజలు, పోలీసులకు మంచి సంబంధాలు ఏర్పడుతున్న ప్రస్తుత తరుణంలో సదరు కానిస్టేబుల్‌ కీచక వ్యవహారంపై మండిపడుతున్నారు. ఈ దుశ్చర్యను వారు తీవ్రంగా పరిగణించి అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు సదరు పోలీస్‌ అధికారులు ఖాకీ వనంలో గంజాయి మొక్కగా మారిన కానిస్టేబుల్‌ఇంతకాలం ఒడిగట్టిన దారుణాలను కక్కించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

ప్రేమికులే టార్గెట్‌గా దోపిడీలు...
వరంగల్‌ ఉర్సు గుట్ట వైపు సాయంత్రం ప్రయాణించే ఒంటరి మహిళలు, ప్రేమికుల కదలికలపై సదరు కానిస్టేబుల్‌ కన్నేసేవాడు. ఎవరైనా అమ్మవారిపేట జాతర దారి వైపున ఉన్న చెట్ల పొదలు, గుట్ట వైపు ప్రయాణిస్తే చాలు ఒక్కసారిగా వారి ముందు ప్రత్యక్షమై వారి ఫొటోలను కెమెరాలో బంధించేవాడు. స్టేషన్‌కు పద అంటూ బెదిరింపులకు పాల్పడేవాడు. ఊహించని సంఘటనకు బెదిరిపోయిన ప్రేమికుల వద్ద బంగారం, సెల్‌ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను దోచుకునేవాడు. ఎక్కడైన చెబితే మీ సంగతి ఫోన్‌లో ఉంది.. ఇక మీ ఇష్టం అంటూ బెదిరించేవాడు. పోలీస్‌ యూనిఫాంలో ఉండడంతో అతడిని వారు ఏం చేయలేకపోయేవారు. ఈ క్రమంలో సదరు కానిస్టేబుల్‌తో దెబ్బలు తిన్న ప్రేమజంటలు సైతం ఉన్నట్లు తెలిసింది. ఇలా ఎంతో మంది  బయటకు చెప్పుకోలేక.. పోలీసులకు ఫిర్యాదు చేయలేక నరకయాతన అనుభవిస్తున్నట్లు సమాచారం.

బాధితుల్లో పోలీస్‌ కుటుంబాలు.. ?
ఇటీవల ఓ మహిళ తన ప్రియుడితో అమ్మవారిపేట గుట్టల వైపు సాయంత్రం వెళ్లింది. ఆ సమయంలో అక్కడే కాపుకాచుకుని ఉన్న సదరు కానిస్టేబుల్‌ కంట ఆ జంట పడింది. వారి కదలికలను కనిపెట్టిన కానిస్టేబుల్‌ ఆ దృశ్యాలను తన కెమెరాలో బంధించి బెదిరింపులకు పాల్పడ్డాడు. ప్రియుడిపై భౌతికదాడికి దిగాడు. పదా స్టేషన్‌కు అంటూ ఇద్దరిని చెయ్యి పట్టుకుని లాగాడు. దీంతో ఆ జంట కాళ్లావేళ్లా పడ్డారు. కనికరించని ఆ ప్రబుద్ధుడు ఆ మహిళ ఒంటిపై ఉన్న సుమారు 4 తులాల బంగారం, ఇద్దరి సెల్‌ఫోన్లు లాక్కున్నాడు. అక్కడితో  ఆగక ఆ మహిళపై లైంగికదాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని ఆ  జంట భయపడినట్లు తెలిసింది. సదరు కానిస్టేబుల్‌ బారినపడిన వారిలో పోలీస్‌ కుటుంబాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో పోలీస్‌ ఉన్నతాధికారులకు ఉప్పందడంతో అతడిని వలపన్ని పట్టుకున్నట్లు తెలిసింది.

కాపు కాసి పట్టుకున్న పోలీసులు..?
ఉర్సుగుట్ట కేంద్రంగా ఇటీవల ఇలాంటి పలు ఘటనలు జరిగినట్లు పోలీసులకు సమాచారం ఉంది.  కానీ.. ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో సంబంధిత అధికారులు దృష్టి సారించలేదు. బాధితుల  బలహీనతను ఆసరాగా చేసుకున్న కీచక కానిస్టేబుల్‌ సమయం దొరికినప్పుడల్లా దోపిడీలకు పాల్పడుతున్నాడు. యూనిఫామ్‌లో ప్రేమికులను బెదిరించి, వారి సొమ్ములను దోచుకునేవాడు. ఆ తర్వాత తన ద్విచక్ర వాహనంలో ఉన్న టీషర్టు వేసుకుని బయటకు వచ్చేవాడు. మొత్తానికి..  సమాచారం అందుకున్న పోలీసులు ఉర్సు గుట్ట నుంచి కాజీపేట భట్టుపల్లికి వెళ్లే దారిలో 15  రోజులుగా మాటు వేశారు. సదరు కానిస్టేబుల్‌ ఎవరనే కోణంలో రహస్య విచారణ చేపట్టారు. పోలీసులకు తెలిసిన ఓ ప్రేమ జంటను అమ్మవారిపేట వైపు సాయంత్రం పంపించారు.

అప్పటికే అక్కడ పోలీసులు మఫ్టీలో ఆ పరిసర ప్రాంతంలో పొదల చాటున కాపు కాస్తూ ఉన్నారు. ప్రేమ  జంట అమ్మవారిపేట జాతర వైపు వెళ్లగానే వారిని ఆ కానిస్టేబుల్‌ వెంబడించాడు. వారిని ఫొటోలు తీసి, డబ్బులు, నగల కోసం బెదిరిస్తుండగా అక్కడే కాపు కాస్తున్న పోలీసులు అతడిని చుట్టుముట్టారు. అప్రమత్తమైన సదరు కానిస్టేబుల్‌ వారిపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు చాకచక్యంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.  పోలీసు శాఖకు తలవంపులు తెచ్చిన ఆ ప్రబుద్ధుడు హన్మకొండ–హైదరాబాద్‌ హైవేలో నగరంలోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌గా నిర్ధారించి విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement