ఎస్పీ ఐశ్వర్యరస్తోగికి వినతిపత్రం అందజేస్తున్న బాధితులు
సాక్షి, నెల్లూరు(క్రైమ్): ఓ టీచర్, అతని భార్య అందరితో కలివిడిగా ఉండేవారు. రొయ్యల వ్యాపారం చేస్తున్నామని అందరి వద్ద రూ.కోట్లలో అప్పులు చేసి రాత్రికి రాత్రే ఉడాయించారు. దీంతో బాధితులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ దంపతుల ఆచూకీ తెలియకపోవడంతో సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఎస్పీ ఐశ్వర్యరస్తోగికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ కేసు నమోదు చేయాలని బాలాజీనగర్ పోలీసులను ఆదేశించారు.
బాధితుల వివరాల మేరకు.. హరనాథపురం నాలుగో వీధికి చెందిన సీహెచ్ కృష్ణారెడ్డి, పద్మజ దంపతులు. కృష్ణారెడ్డి తోటపల్లిగూడూరు మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. దంపతులిద్దరూ తమ ప్రాంతంలోని అందరితో ఎంతో కలివిడిగా ఉండేవారు. స్థానికంగా ఉన్న వారి వద్ద వ్యక్తిగత అవసరాల నిమిత్తం అప్పులు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించి అందరి వద్ద నమ్మకస్తులుగా ఉన్నారు. తాము రొయ్యల వ్యాపారం చేస్తున్నామని, వ్యాపారం నిమిత్తం కొంత నగదు అవసరమని ఆ ప్రాంతంలోని కె.విజయకుమార్‌రెడ్డి వద్ద రూ.10.50 లక్షలు, రజని వద్ద రూ.9 లక్షలు, కె.పిచ్చిరెడ్డి వద్ద రూ.18 లక్షలు, ఎం.సునీత వద్ద రూ.15 లక్షలు ఇలా అనేక మంది వద్ద నగదు అప్పుగా తీసుకున్నారు.
అనంతరం తాము ఉంటున్న ఇంటిని ఓ డాక్టర్‌కు విక్రయించి సుమారు నెల రోజుల క్రితం రాత్రికి రాత్రే దంపతులు ఉడాయించారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారి ఆచూకీ తెలియరాలేదు. స్కూల్‌లోనూ సమాచారం లేదు. ఈక్రమంలోనే తమలా అనేక మంది వద్ద వారు అప్పులు చేసి తిరిగి చెల్లించలేదని బాధితులకు తెలిసింది. దీంతో బాధితులు రజని, విజయకుమార్‌రెడ్డి, పిచ్చిరెడ్డి, సునీత తదితరులు సోమవారం స్పందన కార్యక్రమంలో ఎస్పీ ఐశ్వర్యరస్తోగిని కలిసి వినతిపత్రం సమర్పించారు. దానిపై స్పందించిన ఎస్పీ కేసు నమోదు చేసి దంపతులిద్దరినీ వెంటనే అరెస్ట్ చేయాలని బాలాజీనగర్ పోలీసులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment