ఆన్‌లైన్‌ చీటింగ్‌! | cyber crime police Advice on online cheating | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ చీటింగ్‌!

Published Fri, Dec 29 2017 9:01 AM | Last Updated on Fri, Dec 29 2017 9:01 AM

cyber crime police Advice on online cheating - Sakshi

నాసిరకం సెల్‌ఫోన్లు పట్టుకుని రహదారుల్లో సంచరించడం... ‘అనువైన’వారిని ఎంపిక చేసుకుని కష్టాల పేరుతో ఆకర్షించడం.. సదరు ఫోన్‌ తక్కువ ధరకే విక్రయిస్తున్నానంటూ అందినకాడికి దండుకుని అంటగట్టడం.. ఇలా నేరుగా జరిగే చీటింగ్స్‌ గతంలోనూ చూశాం. ప్రస్తుతం మోసగాళ్ల పంథా మారింది. ఆన్‌లైన్‌ వేదికగా పక్కా పథకం ప్రకారం వంచనకు పాల్పడుతున్నారు. డూప్లికేట్‌ ఫోన్ల ఫొటోలు పోస్ట్‌ చేసి, ఒరిజినల్‌ అంటూ టోకరా వేస్తున్న వాళ్లు కొందరైతే.. ఆన్‌లైన్‌లో ఉన్న సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్లు కొంటామంటూ పట్టుకుని ఉడాయిస్తున్న వారు ఇంకొందరు. తాజాగా  ఇరవై  రోజుల్లో కార్ల విక్రయం పేరుతో జరిగిన రెండు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి మోసాలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయని, వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ–కామర్స్‌ సైట్స్‌ను బాధ్యుల్ని చేయలేమంటున్నారు.

ఆయా సైట్స్‌కు బాధ్యత ఉండదు
ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో క్రయవిక్రయాలు చేసే వాళ్లు జాగ్రత్త పడాల్సిన అవసరముంది.  ప్రాథమికంగా అమ్ముతున్న వ్యక్తి వివరాలు, వస్తువు అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. వీలున్నంత వరకు వ్యక్తిగతంగా కలవడం, వస్తువును చూడటం చేసిన తర్వాతే ఆర్థిక లావాదేవీలు చేయాలి. ఎలాంటి పరిశీలన లేకుండా ముందుకు వెళ్తే మోసపోతారు.   – సైబర్‌ క్రైమ్‌ పోలీసులు  

సాక్షి, సిటీబ్యూరో: ఆన్‌లైన్‌లో విక్రయాలు జరిపే ఈ–కామర్స్‌ వెబ్‌సైట్లు రెండు రకాలుగా అందుబాటులోకి వచ్చాయి. వివిధ కంపెనీలు, సంస్థలకు చెందిన ఉత్పత్తులకు ప్రచారం కల్పిండంతో పాటు తమ వెబ్‌సైట్‌ ద్వారా అమ్ముకునే అకాశం ఇచ్చేవి మొదటి రకం. ఇలా చేసినందువల్ల లావాదేవీల్లో వీటికి కొంత కమీషన్‌ ముడుతుంది.  రెండో రకానికి చెందిన ఈ–కామర్స్‌ సైట్లు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి.  ఓఎల్‌ఎక్స్, క్వికర్‌ వంటివి ప్రధానంగా సెకండ్‌ హ్యాండ్‌ వ్యాపారాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి. వినియోగదారులే తాము వినియోగిస్తున్న వస్తువుల వివరాలను ఫొటోలతో సహా వీటిలో పోస్ట్‌ చేస్తారు. ఆసక్తి ఉన్న వారు సంప్రదించడం ద్వారా ఖరీదు చేసుకునే అవకాశం ఉంది. 

‘పోస్టింగ్‌’ ఎంతో ఈజీ..  
మొదటి తరహా వెబ్‌సైట్ల వల్ల అంతగా నష్టం లేకపోయినా.. రెండో రకానికి చెందిన వాటితోనే తలనొప్పులు వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. వీటిలో తాము వినియోగిస్తున్న వస్తువుల్ని విక్రయించాలని ఆశించే వినియోగదారులు ఎలాంటి ధ్రువీకరణలు సమర్పించాల్సిన అవసరం లేదు. కేవలం స్మార్ట్‌ ఫోన్‌ కలిగి ఉండి, ఆయా వెబ్‌సైట్లకు చెందిన యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరిపోతుంది. ఆ ఫోన్‌లో వినియోగించే సిమ్‌కార్డు బోగస్‌ వివరాలతో తీసుకున్నదైతే వీరి ఉనికి బయటపడటం కూడా కష్టసాధ్యమే. ఇలాంటి వెబ్‌సైట్లను వేదికగా చేసుకున్న మోసగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. 

చీటింగ్స్‌ ఎన్నో రకాలు..  
ఈ వెబ్‌సైట్లను ఆధారంగా చేసుకుని మోసాలకు పాల్పడే చీటర్లు ప్రధానంగా రెండు ‘మార్గాలను’ అనుసరిస్తున్నారు. ప్రముఖ కంపెనీలకు చెందిన వస్తువుల్ని పోలి ఉండే, అదే కంపెనీ పేర్లతో లభించే వస్తువుల్ని ఖరీదు చేస్తున్నారు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి మెట్రోనగరాల మార్కెట్లతో ఇవి అతి తక్కువ ధరకు లభిస్తున్నవాటిని తీసుకువచ్చి అవి అసలువంటూ ‘సెకండ్‌ హ్యాండ్‌’ వెబ్‌సైట్స్‌లో పోస్టు చేసి వినియోగదారులకు టోకరా వేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఉన్న సెకండ్‌ హ్యాండ్‌ వస్తువుల్ని ఖరీదు చేస్తామంటూ వాటి యజమానుల్ని సంప్రదిస్తున్న మోసగాళ్లు ట్రయల్‌ అని, డబ్బు తీసుకువస్తామని, దృష్టి మళ్లించి వాటిని ఎత్తుకుపోతున్నారు. పోర్టబుల్‌ ఎలక్ట్రానిక్‌ వస్తువులే ఎక్కువగా టార్గెట్‌ అవుతున్నాయి.

మరోపక్క వాహనాలను సైతం విక్రయిస్తామంటూ పోస్టులు పెట్టి అడ్వాన్స్‌ రూపంలో అందినకాడికి దండుకుంటున్నారు.  ఈ తరహా ఆన్‌లైన్‌ మోసగాళ్లలో విదేశీయలు కూడా ఉంటున్నారు. తేలిక పాటి వాహనాలను విక్రయిస్తానంటూ ఈ–కామర్స్‌ సైట్‌ ఓఎల్‌ఎక్స్‌లో తప్పుడు ప్రకటనలు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్న రాజమహేంద్రవరం వాసి వినోద్‌ను సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఓఎల్‌ఎక్స్‌ వెబ్‌సైట్‌ వేదికగా వాహనం విక్రయం పేరుతో టోకరా వేసిన ఉగాండా జాతీయుడు ఫెడ్రిక్‌ను గత శుక్రవారం రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పట్టుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement