సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని చార్మినార్ తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా చోటు చేసుకున్న ఆసరా పెన్షన్ల పథకం భారీ గోల్‌మాల్ కేసు దర్యాప్తును సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరం చేశారు. ఆ కార్యాలయం ఉద్యోగుల ప్రమేయంపై ఆధారాలు లభించకపోయినా వారి నిర్లక్ష్యం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీన్ని నివృత్తి చేసుకోవడానికి నలుగురు నిందితుల్నీ కోర్టు అనుమతితో శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. 8 నెలల్లో 255 మంది పేర్లతో రూ.25 లక్షల వరకు స్వాహా చేసిన వీరిని సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవా రం అరెస్టు చేసిన విషయం విదితమే. నగరానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ ఆరేడు ఏళ్ళుగా బండ్లగూడ, చార్మినార్ తహశీల్దార్ కార్యాలయాల కేంద్రంగా దళారిగా పని చేస్తున్నాడు. సర్వేయర్లు అనేక స్థలాలను సర్వే చేస్తుంటారు. ఇది పూర్తి చేయడానికి కనీసం మరో ఇద్దరు సహాయకుల అవసరం ఉంటుంది. ఈ పోస్టులు అధికారికంగా అందుబాటులో లేకపోవడంతో ఆయా సర్వేయర్లు ఇమ్రాన్ లాంటి వారిపై ఆధారపడుతున్నారు. ఇలా తహశీల్దార్ కార్యాలయంలోకి ‘అడుగుపెడుతున్న’ బయటి వ్యక్తులు ఆపై దళారులుగా మారి సాధారణ ప్రజలకు కొన్ని సర్టిఫికెట్లు ఇప్పించడం వంటివి చేస్తూ కమీషన్లు తీసుకోవడం మొదలెడుతున్నారు. ఇమ్రాన్ కూడా ఇలానే చేస్తూ తహశీల్దార్ వద్ద నమ్మకం సంపాదించాడు. ఆపై కార్యాలయంలో ఆయన సమీపంలో ఉంటూ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్ వినియోగించేప్పుడు వాటిని రహస్యంగా చూసి నమోదు చేసుకున్నాడని విచారణలో వెల్లడైంది. ఇమ్రాన్ వీటిని తన స్నేహితుడైన మహ్మద్ అస్లంతో పాటు సయ్యద్ సోహైలుద్దీన్‌లకు అందించారు.
వీరి ద్వారా ఈ రహస్య వివరాలు నగరానికి చెందిన మహ్మద్ మోసిన్‌కు చేరాయి. ఈ నలుగురూ కలిసి బోగస్ ఖాతాలు సృష్టించడం, లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు మార్చడం, అనర్హులనూ లబ్ధిదారులుగా చేర్చారు. ఇలా కొందరి పేరుతో సొమ్ము కాజేయడం, మరికొందరికి పెన్షన్లు ఇప్పిస్తూ నెలనెలా కమీషన్ తీసుకోవడం, ఇంకొందరి నుంచి ఒకేసారి కొంతమొత్తం తీసుకోవడం చేశారు. బండ్లగూ డ, చార్మినార్, చంద్రాయణగుట్ట ప్రాంతాలకు చెందిన 255 మంది పేర్లు, వివరాలను వీరు కొత్తగా చేర్చడానికి తహశీల్దార్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వాడారు.ఇటీవల కొందరు వృద్ధులు తమకు ఆసరా పెన్షన్లు అందట్లేదని, ఆ డబ్బు తమ ఖాతాల్లో పడటం ఆగిపోయిందని ఆర్డీఓ కు ఫిర్యాదు చేశారు. అంతర్గత విచారణ చేపట్టిన ఆయన స్కామ్ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర భద్రంరాజు రమేష్ దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సై మదన్ సహకారంతో సాంకేతిక దర్యాప్తు చేసి స్కామ్ మూలాలు కనిపెట్టారు. మంగళవారం అస్లంతో పాటు సోహైల్, మోసిన్, ఇమ్రాన్‌లను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో వీరికి ఓ మహిళ సైతం సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె ఎవరనే దానిపై ప్రస్తుతం కస్టడీలో ఉన్న నిందితులను ఆరా తీస్తున్నారు. వీరిలో అస్లం అనే నిందితుడు 2015 నుంచి నల్లగొండలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. 2017లో ఇదే తరహా స్కామ్‌కు పాల్పడి అరెస్టు కావడంతో సస్పెండ్ అయ్యాడు. ఇప్పుడు మరోసారి కటకటాల్లోకి చేయడంతో ఆ విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు విద్యుత్ శాఖకు సమాచారం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment