లక్నో : బరాత్ అనుమతి కోసం యూపీకి చెందిన ఓ దళిత యువకుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. గ్రామంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అతను పిటిషన్ దాఖలు చేశాడు. అయితే కోర్టులో అతనికి చేదు అనుభవమే ఎదురైంది. స్థానిక పోలీసులను ఆశ్రయించాలంటూ కోర్టు అతనికి సూచిస్తూ.. పిటిషన్‌ను కొట్టేసింది.
వివరాల్లోకి వెళ్తే... కాస్‌గంజ్ పరిధిలోని ఓ గ్రామంలో గత నెలరోజులుగా దళిత-అగ్రవర్ణాలకు మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో థాకూర్ పెద్దలు దళితుల వివాహా వేడుకలకు అడ్డుపడుతున్నారు. కాదని వేడుకలను నిర్వహిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు. శీతల్ అనే దళిత యువకుడికి ఈ మధ్యే వివాహం నిశ్చయమైంది. నెలాఖరులో వివాహం కూడా. అయితే గ్రామంలోనే థాకూర్ పెద్దలు అడ్డుపడుతుండటంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. అక్కడ ప్రయోజనం లేకపోవటంతో చివరకు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
‘తమ ఆదేశాలకు దిక్కరిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని థాకూర్ పెద్దలు బెదరిస్తున్నారు. ఇది మా ప్రభుత్వం.. మీరు ఎవరిని ఆశ్రయించినా వ్యర్థమే. ఎవరూ జోక్యం చేసుకోరు అంటూ చెబుతున్నారు. దీనిపై న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి. బరాత్‌తో నా వివాహం జరుపుకునేందుకు అనుమతి ఇప్పించండి’ అని శీతల్ పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఇక ఈ వ్యవహారంపై సంజయ్ కుమార్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీస్ శాఖ కూడా ఈ వ్యవహారంలో చేతులెత్తేసినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కావాలంటే పొరుగు గ్రామంలో నిర్వహించుకోవాలని పోలీసులు సూచించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment