
నెల్లూరు(క్రైమ్): నిద్రిస్తున్న తల్లిదండ్రులపై కుమార్తె వేడి నీళ్లు, వేడి నూనె పోసి వారిని ఆస్పత్రి పాలు చేసిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై నెల్లూరులోని బాలాజీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. బాలాజీనగర్ స్టేషన్ పరిధిలోని రాయపుపాళెంలో జేమ్స్ పాల్ నివాసం ఉంటున్నాడు. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద కుమార్తెకు వివాహమైంది. అయితే ఆమె మూడేళ్ల నుంచి భర్తకు దూరంగా తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది.
ఏమి జరిగిందో గానీ ఈనెల 10వ తేదీ అర్ధరాత్రి జేమ్స్‌పాల్, అతని భార్య నిద్రిస్తుండగా పెద్ద కుమార్తె వేడి నీళ్లు, వేడి నూనెను వారిపై పోసింది. దీంతో దంపతులిద్దరూ ఇంట్లోంచి బయటకు పరుగులు తీశారు. వారిని వెంబడించిన కుమార్తె కారం చల్లేందుకు యత్నించింది. ఇంతలో దంపతులు పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జేమ్స్ పాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని బాలాజీనగర్ ఎస్సై జి.అంకమ్మ శుక్రవారం తెలిపారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.