విడవలూరు (నెల్లూరు జిల్లా): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో పేద దంపతులు తమ కుమార్తె (12)ను రూ.10 వేలకు అమ్మేశారు. కొనుక్కున్న వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం విడవలూరు మండలం దంపూరులో గురువారం వెలుగుచూసింది. బాధిత బాలిక, స్థానికుల కథనం మేరకు.. నెల్లూరు నగరంలోని కొత్తూరుకు చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తెకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆస్పత్రిలో ఉంచి వైద్యం చేయిస్తున్నారు. రోజూ పనికి వెళితేగానీ గడవని కుటుంబం కావడంతో చికిత్సకు డబ్బులేక ఇబ్బందులు పడసాగారు. ఆ సమీపంలోనే ఉండే మానికల చిన్నసుబ్బయ్య (46) కన్ను ఈ కుటుంబంపై ఉంది.
భార్య కొన్నేళ్ల కిందటే ఎటో వెళ్లిపోవడంతో అతడు ఈ బాలికను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు తెలుసుకుని రూ.10 వేలకు ఆ బాలికను కొనుక్కున్నాడు. రెండు రోజుల కిందట ఆ బాలికను పెళ్లి చేసుకున్న అతడు బుధవారం రాత్రి విడవలూరు మండలం దంపూరులోని తన బంధువుల ఇంటికి తీసుకొచ్చాడు.
రాత్రి సమయంలో బాలిక పెద్దగా ఏడవడంతో స్థానికులు ఆరాతీశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడివారు వెంటనే సర్పంచి సురేంద్రరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. బాలికను మరొకరి ఇంట్లో ఉంచారు. గురువారం సచివాలయ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఐసీడీఎస్ అధికారులు దంపూరు వచ్చారు. స్థానికులు బాలికను వారికి అప్పగించారు. అధికారులు ఆ బాలికను నెల్లూరులోని శిశుసంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు జైన్‌కుమారి, శైలజ, నాగమ్మ, దేవసేన, బుజ్జమ్మ, లావణ్య, స్థానికులు నారాయణ, భానుప్రకాశ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
చదవండి:
తాడిపత్రిలో బయటపడ్డ ‘జేసీ’ ప్రలోభాలు
అనూష కేసు: రెండేళ్లు గా వేధిస్తున్నాడు!
Comments
Please login to add a commentAdd a comment