శీతల్ హత్య కేసు నిందితులు
కన్నకూతుర్ని దారుణంగా పరువు హత్య చేసిన ఘటన న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. సగోత్రీకుడిని పెళ్లి చేసుకుందన్న ఆగ్రహంతో తమ కుమార్తె శీతల్(25)ను గొంతు నులిమి హత్య చేసి, మృతదేహాన్ని కాలువలో విసిరేసారు. తాము చేసిన ఘోరం ఎవరికి తెలియదులే అనుకొని ఊరుకున్నారు. కానీ నేరస్తులు ఎంతటివారైనా ఎప్పటికైనా దొరకక మానరు. సత్యం ముందు కచ్చితంగా తలవంచాల్సిందే. శీతల్ పరువు హత్య కేసులో అదే మరోసారి రుజువైంది. శీతల్ భర్త అంకిత్ భాటి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు శీతల్ అద్యశ్యం మిస్టరీని ఛేదించారు. కిడ్నాప్, హత్య ఆరోపణలతో శీతల్ తల్లిదండ్రులు, రవీందర్, సుమన్, మేనమామలు (సంజయ్, ఓం ప్రకాష్) ఇద్దరు కజిన్స్ అంకిత్, పర్వేష్‌ను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు డీసీపీ(తూర్పు) జస్మీత్ సింగ్ తెలిపారు. అదే గోత్రానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తమకు నచ్చలేదని, అందుకే హత్య చేశామని నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారని వెల్లడించారు.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం శీతల్, భాటి కుటుంబాలు పక్క పక్కనే నివసించేవి. ఇరు కుటుంబాలు పాల వ్యాపారం చేసేవారు. ఈ క్రమంలో శీతల్, భాటి గత మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో రహస్యంగా వివాహం చేసుకున్నారు, కానీ ఎవరి కుటుంబాలతో వారు కలిసి ఉన్నారు. అయితే ఇటీవల భాటి తమ పెళ్లి గురించి ఇంట్లో చెప్పాడు. అటు శీతల్ కూడా జనవరి 20న తేదీన తమ పెళ్లి విషయాన్ని తల్లి తండ్రులకు చెప్పింది. అంతే ఆగ్రహంతో రగిలిపోయిన ఆ కుటుంబం ఆమెను ఎలాగైనా మట్టు బెట్టాలని పథకం వేసింది. జనవరి 29 రాత్రి మరో నలుగురితో కలిసి, తల్లిదండ్రులు ఆమెను గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం రెండు కార్లలో ఆరుగురు నిందితులు ఉత్తరప్రదేశ్‌లోని సికంద్రబాద్ (తమ సొంత గ్రామానికి దగ్గర)కు తీసుకెళ్లారు. వెనుక ఒక కారులో మేనమామలు, ఇతర బంధువులు రాగా తమ కన్నకూతురు మృతదేహాన్ని ఉంచుకుని ముందు కారులో (వాగన్‌ఆర్)లో శీతల్ తల్లిదండ్రులు వెళ్లారు. మొదట మృతదేహాన్ని సికంద్రబాద్‌లో దింపారు. అక్కడ కుదరక మళ్లీ అక్కడినుంచి అలీగఢ్ వరకు తీసుకెళ్లి, అక్కడ పడవేసి చక్కా పోయారు. అయితే లోతు, నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో మృతదేహంపైకి తేలింది. దీంతో గ్రామస్తులు అలీగఢ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం నిర్వహించారు. మృతదేహాన్ని ఎవరూ గుర్తించకపోవడంతో, ఫిబ్రవరి 2న పోలీసులే దహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆమె బట్టలు, ఫోటోలు, ఇతర వస్తువులను భద్రపరిచారు.
మరోవైపు తన భార్య శీతల్ కనిపించడకపోవడంతో బంధువులను, స్నేహితులను విచారించాడు భాటి. అయినా ఆచూకీ లభించలేదు. దీంతోపాటు భాటి కుటుంబ సభ్యులు శీతల్ బంధువులను కూడా సంప్రదించారు. అయినా ఫలితంలేక పోవడంతో ఫిబ్రవరి 17న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శీతల్ ఆచూకీపై పోలీసులు ఆమె కుటుంబ సభ్యులను విడివిడిగా విచారించారు. ఒకరికొకరు పొంతనలేని సమాధానాలు చెప్పారు. అలాగే ‘అమ్మాయి బతికి వుంటే కనిపించేది కదా సార్’ అని నిందితుల్లో ఒకడు పోలీసులకు చెప్పడంతో మరింత లోతుగా విచారించిన పోలీసులు విషయాన్ని రాబట్టారు. ఆమె బట్టలు, ఫోటోలు, ఇతరు వస్తువులతో పాటు, ఆరుగురు నిందితుల కాల్ వివరాలు, ఇంతర సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను పోలీసులు గుర్తించారు.
చదవండి: జియో కొత్త రీచార్జ్ ప్లాన్
Comments
Please login to add a commentAdd a comment