
బోల్తాపడిన ఆటో (ఇన్‌సెట్) మృతి చెందిన డిగ్రీ విద్యార్థి హరీష్
కర్నూలు, బేతంచెర్ల: పట్టణానికి సమీపంలోని కర్నూలు రహదారిలో మంగళవారం ఆటోను ట్రాక్టర్ ఢీ కొంది. ఈఘటనలో ఓ విద్యార్థి మృతిచెందగా..ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని సీతారామాపురం గ్రామం నుంచి వస్తున్న ఆటోలో డ్రైవర్ బ్రహ్మయ్యతో పాటు శంకలాపురం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి హరీష్, పాణ్యంకు చెందిన రామసుబ్బయ్య, భార్య విజయ, కుమార్తె శ్రావణి, కుమారుడు మురళీ, గోరుమానుకొండ తండాకు చెందిన కిరణ్ నాయక్, యమున ఉన్నారు. బేతంచెర్లకు సమీపంలోని అయ్యల చెర్వు వద్ద నాపరాయి పరిశ్రమలో నుంచి ట్రాక్టర్ వచ్చి వెళ్తున్న ఆటోను ఢీ కొంది. ఈ ఘటనలోఆటో బోల్తా పడటంతో విద్యార్థి హరీష్‌కు కాలు విరిగి రక్తగాయలు కాగా రామసుబ్బయ్య, విజయ, శ్రావణి, మురళీ, కిరన్ నాయక్, యమునతో పాటు ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది బాధితులను చికిత్స నిమిత్తం బేతంచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో 108లో కర్నూలుకు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతిచెందాడు.
శోకసంద్రంలో విద్యార్థి తల్లిదండ్రులు
శంకలాపురం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ, రామలక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు హరీష్ (20) స్థానిక జ్ఞాన సరస్వతీ డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సెమిష్టర్ పరీక్షలు రాసేందుకు మంగళవారం ఆటో ఎక్కి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో విద్యార్థి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న తహసీల్దార్ తులసీనాయక్, సీఐ ఓబులేసు, ఎస్‌ఐలు ఆర్ సురేష్ , జీఎండీ బాషా సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు ఆరా తీశారు. గాయాల పాలైన వారిని ఆసుపత్రిలో పరామర్శించారు. మృతిచెందిన విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు. కాగా తీవ్రగాయాల పాలైన 7 మందిని మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment