ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్‌ను దొంగగా భావించిన గుంపు అతడిని దారుణంగా కొట్టి చంపేశారు. ఈ మూక హత్య దక్షిణ ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో జరిగింది. వివరాలు... ఢిల్లీకి చెందిన అవినాష్ కుమార్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇద్దరు వ్యక్తులను తన ఆటోలో ఎక్కించుకున్నాడు. ఉత్తమ్‌నగర్ చేరుకోగానే మూత్ర విసర్జన కోసం అవినాష్ ఆటో దిగాడు. ఈలోగా దాదాపు 300 మంది అతడి ఆటో దగ్గర గుమిగూడారు. బ్యాటరీలు దొంగిలించారంటూ ఆటోలో ఉన్న వ్యక్తులను తీవ్రంగా కొట్టసాగారు. అయితే వారిద్దరు నిజంగానే దొంగలు అన్న విషయం తెలియక అవినాష్ అక్కడున్న వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అవినాష్‌ను దొంగల ముఠా నాయకుడిగా భావించిన గుంపు అతడిని కరెంటు స్తంభానికి కట్టేసి రాడ్లు, కర్రలతో తీవ్రంగా కొట్టారు.
ఆటో పత్రాలన్నీ తెప్పించినా వినకుండా..
తను దొంగను కాదని ఎంత చెప్పినా వినకుండా తీవ్రంగా హింసిస్తుండటంతో తన తల్లిదండ్రులకు ఫోన్ చేయాల్సిందిగా అవినాష్ అక్కడున్న వాళ్లను కోరాడు. ఈ క్రమంలో ఆటో పత్రాలు, గుర్తింపు కార్డులతో సహా అతడి తల్లిదండ్రులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తమ కొడుకుకు దొంగలతో ఎటువంటి సంబంధం లేదని చెప్పినా వినకపోవడంతో పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని అవినాష్‌ను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. దీంతో మూక హత్యగా నమోదు చేసిన ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment