
ఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం జరిగింది. ఫుడ్ డెలివరీ బాయ్ అనుకొని తలుపు తీసిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు.. అమిత్ కొచ్చార్(35) అనే వ్యాపారవేత్త ఢిల్లీలోని వికాస్‌పురిలో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. గురువారం రాత్రి భార్య ఆఫీస్‌కి వెళ్లిన తర్వాత కొచ్చార్ స్నేహితులు అతని ఇంటికి వచ్చారు. దాంతో స్నేహితుల కోసం ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేశాడు కొచ్చార్. కొంత సమయం తర్వాత కాలింగ్ బెల్ మోగింది. ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చాడనుకొని కొచ్చార్ తలుపు తీశాడు.
కొచ్చార్ డోర్ తీయగానే దుండగులు అతన్ని లాక్కెళ్లి కారులో పడేశారు. అనంతరం గన్‌తో కొచ్చార్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల శబ్దం విని బయటకు వచ్చిన స్నేహితులకు అపస్మారక స్థితిలో ఉన్న కొచ్చార్ కన్పించాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే కొచ్చార్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.