సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: రోడ్డు ప్రమాదాలు నిరోధించడంలో భాగంగా రవాణ శాఖ వాహనాల వేగ నియంత్రణపై దృష్టి పెట్టింది. 2015కు ముందు తయారైన అన్ని రవాణా వాహనాలకు స్పీడ్ గవర్నెర్స్ అమలు చేస్తోంది. ఈ నిబంధనను క్యాష్ చేసుకున్న ఢిల్లీకి చెందిన సంస్థ స్పీడ్ కంట్రోల్ పరికరాల సరఫరా డీలర్ షిప్ పేరుతో ఎరవేసింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది నుంచి దండుకుని మోసం చేసింది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌కు చెందిన ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు ఆ సంస్థతో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంస్థ బాధితులు రాష్ట్రవ్యాప్తంగా 60 మంది వరకు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. 2015 తర్వాత తయారవుతున్న వాహనాలకు ఈ పరికరాలు ఉంటున్నా అంతకుముందు వాహనాలకు లేదు. దీంతో ఇప్పుడు వీటిని ఇప్పుడు ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర రవాణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
మూడు కంపెనీలకే అనుమతి..
ఈ పరికరాలను సరఫరా చేసే కాంట్రాక్టును 3 కంపెనీలకు అప్పగించారు. ఆటోమోబైల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఏఆర్‌ఏఐ), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ వంటి కేంద్రం గుర్తింపు పొందిన సాంకేతిక సంస్థల ధ్రువీకరించిన కంపెనీలకే ఈ అనుమతి ఉంది. ఈ రెండు సంస్థలు దేశవ్యాప్తంగా 37 ఎస్‌ఎల్‌డీ తయారీ కంపెనీలను సర్టిఫై చేశాయి. రాష్ట్రంలో ఈ పరికరాలు సరఫరాకు కాన్వెర్జ్, మెర్సిడా, క్రిసాల్ కంపెనీలకే ఆర్టీఏ అనుమతి ఇచ్చింది. అయితే తమ కంపెనీకి దేశ వ్యాప్తంగా ఎస్‌ఎల్‌డీల సరఫరా చేయడానికి అనుమతి ఉందని, ఇప్పటికే అనేక రాష్ట్రాలకు అందిస్తున్నామని ఢిల్లీకి చెందిన రోస్‌మెర్‌ట్రా ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రచారం చేసుకుంది. దీని ప్రతినిధిగా అసిస్టెంట్ డెవలప్‌మెంట్ మేనేజర్ సాయిరాం కొండాపూర్‌కు చెందిన సదాత్ రాజ్‌ను సంప్రదించాడు. రూ.12 లక్షలు చెల్లిస్తే డీలర్‌షిప్ ఇస్తామంటూ నమ్మబలికాడు.
కొంత కాలం తర్వాత ఆ కంపెనీ జీఎం మనోజ్‌తో కలసి వెళ్లిన సాయిరాం మరోసారి సదాత్ రాజ్‌ను కలిశారు. డీలర్‌షిప్ తీసుకుంటే లాభదాయకంగా ఉంటుందని నమ్మబలకడంతో రూ.2 లక్షలే చెల్లిస్తానని చెప్పాడు. దీనికి కంపెనీ ప్రతినిధులు అంగీకరించడంతో ఈ ఏడాది ఆగస్టు 21న కంపెనీ ఖాతాకు రూ.లక్ష బదిలీ చేశారు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా సాయిరాం, మనోజ్‌ల నుంచి స్పందన లేదు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన సదాత్ రాజ్ గచ్చిబౌలి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రోస్‌మెర్‌ట్రా ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో పాటు ఏడీఎం సాయిరాం, జీఎం మనోజ్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment