గుండె నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు | Do not ignore cardiovascular pain | Sakshi
Sakshi News home page

గుండె నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు

Published Sat, Apr 7 2018 1:25 PM | Last Updated on Thu, Aug 16 2018 1:18 PM

Do not ignore cardiovascular pain - Sakshi

గుండె పరీక్షలను పరిశీలిస్తున్న కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, సీఐ చంద్రకుమార్‌ 

యాచారం(ఇబ్రహీంపట్నం): కేసీఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కామినేని ఆస్పత్రి వైద్య బృందం శుక్రవారం యాచారం మండల కేంద్రంలో నిర్వహించిన మెగా హెల్త్‌ క్యాంపునకు అపూర్వ స్పందన వచ్చింది. నేటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేసీఆర్‌ (కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి) ఫౌండేషన్‌ యాచారంలో మెగా హెల్త్‌ క్యాంపును ఏర్పాటు చేసింది.

కొద్ది రోజుల కిందట మంచాల మండలం లోయపల్లి గ్రామంలో గుండె జబ్బు కారణంగా శ్రీను మృతితో తీవ్రంగా కలత చెందిన కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి (కేసీఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌) ఈ ప్రాంతంలో గుండె జబ్బులున్న వారు అధికంగా ఉన్నారని గుర్తించి యాచారంలో ప్రత్యేకంగా గుండె జబ్బు, క్యాన్సర్‌ రోగాల నిర్ధారణ కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ వైద్య శిబిరానికి దేశంలోనే పేరుగాంచిన ప్రముఖ గుండె జబ్బుల నిపుణుడు, కామినేని ఆస్పత్రి సీఈఓ ఆశ్విన్‌ ఎంషా హాజరవుతున్నట్లు తెలుసుకున్న ప్రజలు పలు గ్రామాల నుంచి భారీగా తరలివచ్చారు. యాచారం మండలం నుంచే కాకుండా మంచాల, ఇబ్రహీంపట్నం మండల గ్రామాల నుంచి  వచ్చారు.

గుండె జబ్బులు, క్యాన్సర్‌తో పాటు కాళ్లు, కీళ్లు తదితర రోగాలకు సంబంధించి 700 మందికి పైగా హాజరయ్యారు. వివిధ పరీక్షలు జరిపి గుండె జబ్బులున్నట్లు 8 మందిని గుర్తించారు. గుర్తించిన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు జరిపే విధంగా పేర్లు నమోదు చేసుకున్నారు.

పలు వైద్య పరీక్షలు నిర్వహించిన వారికి  కేసీఆర్‌ ఫౌండేషన్‌ ఉచితంగా మందులను అందజేసింది. కామినేని ఆస్పత్రికి చెందిన స్త్రీ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో తరలిరావడంతో సాయి శరణం ఫంక్షన్‌ హాల్‌ నిండిపోయింది. యాచారం సీఐ చంద్రకుమార్, ఎస్సై వెంకటయ్యలు వచ్చి వైద్య శిబిరంలో వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.  

ఆదిలోనే గుర్తిస్తే మేలు: కామినేని ఆస్పత్రి సీఈఓ అశ్విన్‌

గుండె నొప్పికి వయస్సుతో సంబంధం లేదు. ఛాతిలో నొప్పి వస్తున్నట్లు తెలిసిన వెంటనే వైద్యులను సంప్రదించాలని, లేదంటే ప్రాణానికే ప్రమాదమని కామినేని ఆస్పత్రి సీఈఓ, గుండె జబ్బుల వైద్య నిపుణుడు ఆశ్విన్‌ ఎం.షా  పేర్కొన్నారు.

యాచారంలో కేసీఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరానికి హాజరైన ఆయన వైద్య శిబిరాన్ని ప్రారంభించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ... గుండె  జబ్బులను ముందే గుర్తించి వైద్యం పొందితే ప్రమాదం తప్పుతుందని అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేసీఆర్‌ ఫౌండేషన్‌ మెగా హెల్త్‌ క్యాంపును నిర్వహించడం అభినందనీయమని అన్నారు.  

ప్రజాసేవ చేయడం కోసమే ఫౌండేషన్‌: కంచర్ల 

ప్రజలకు సేవ చేయడానికే కేసీఆర్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసినట్లు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. వైద్య శిబిరంలో ఆయన పాల్గొని రోగుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

 చైతన్యం లేని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఫ్లోరైడ్, వివిధ రోగాల భారినపడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసేవ చేయడం కోసమే కేసీఆర్‌ ఫౌండేషన్‌ను స్థాపించి ఈ రోజు యాచారంలో మెగా హెల్త్‌ క్యాంపును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఏటా ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తామని కేవలం 5 మంది తమ ఫౌండేషన్‌ వల్ల ప్రాణాలతో బయటపడితే చాలని అన్నారు. కార్యక్రమంలో నల్లవెల్లి, కొత్తపల్లి ఎంపీటీసీ సభ్యులు గడల మాధవి, సంధాని, టీఆర్‌ఎస్‌ నాయకులు జక్క రాంరెడ్డి, బందె రాజశేఖర్‌రెడ్డి, సతీష్‌ ముదిరాజ్, మూలకిరణ్‌గౌడ్, ఆజయ్, భాస్కర్, గడల మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement